అందమా నీ పేరేమిటి?

అసలు సినిమా పాటల్లో కవిత్వం ఎంత వరకూ వాడొచ్చు? సినిమా అనేది ముఖ్యంగా వినోదసాధనం కాబట్టి, సినిమా చూసే సామాన్యులకి కూడా అర్థమయ్యేటట్టు పాట ఉండాలి అనుకోవడంలో తప్పు లేదు. మన సినిమా పాటలు చాలా వరకూ ఇలాగే ఉంటాయి కూడా. గొప్ప కవిత్వమూ, భాషా పాటవమూ ప్రదర్శించడానికి సినిమా ఏమైనా సాహితీ సభా వేదికా? ఒక వేళ రాసినా ఎవరికి అర్థం అవుతుంది?

… “అర్థం అవుతుంది! అర్థం చేసుకోవాలి!! తెలియక పోతే అడిగి తెలుసుకోవాలి. భాషా, సాహిత్యమూ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి సినిమా కూడా ఒక సహాయకారి కావాలి” – ఈ మాటలు అన్నది సినిమా కవులందరూ సాహో అని కీర్తించిన మల్లాది రామకృష్ణ శాస్త్రి. సినిమా పాట ద్వారా కూడా చక్కటి భాషా, కవిత్వమూ కుదిరినప్పుడల్లా ప్రదర్శించవచ్చు అని “మల్లాది స్కూల్” కవుల భావన.

ఈ “మల్లాది స్కూల్” కి చెందిన కవే వేటూరి. ఈయన అందరి కంటే ఒక అడుగు ముందుకు వేసి, కుదిరినప్పుడు మాత్రమే కాక, కుదరనప్పుడు కూడా మథురమైన భాషా, లోతైన కవిత్వమూ ఒలికించాడు. పాటల్లో తెలుగు సంస్కృతీ విశేషాలు చొప్పించాడు. తెలిసి, తెలిసీ “తప్పులు” చేసిన అసాధారణ ప్రతిభాశాలి! సినిమా పాటకు తగ్గట్టు తను మారకుండా, తనకు తగ్గట్టు సినిమా పాటనే మార్చిన ఘనుడు! అందుకే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చెప్పినట్టు – “వేటూరి వెండి తెరను నల్ల పలకగా మార్చి తిరిగి మనందరిచేతా ఓనమాలు దిద్దించాడు”

వేటూరి కవిత్వానికి ఒక ఉత్తమ ఉదాహరణ “అల్లరి ప్రియుడు” సినిమాలోని “అందమా నీ పేరేమిటి” అనే పాట. ఇది “రాఘవేంద్రుని” సినిమా కాబట్టి వేటూరి ప్రత్యేక శ్రద్ధతో రాసిన పాట (వాళ్ళిద్దరి combination గొప్పది మరి!). సినిమా సందర్భంలో ఒక కవయిత్రి రాసిన కవితని hero పాటగా పాడతాడు. కాబట్టి వేటూరికి చాలా స్వతంత్రం దొరికింది – అంశం, భాషా, భావం, శైలీ మొదలైన విషయాల్లో.

వేటూరి ఎంచుకున్న అంశం “అందం”. ఒక అమ్మాయి అందాన్ని సంగీత పరంగా, సాహిత్య పరంగా ఎంత బాగా వేటూరి వర్ణించాడో చూద్దాం.

పల్లవి:
అందమా నీ పేరేమిటి, అందమా
ఒంపుల హంపీ శిల్పమా? బాపు గీసిన చిత్రమా?
తెలుపుమా తెలుపుమా తెలుపుమా!
పరువమా నీ ఊరేమిటి, పరువమా
కృష్ణుని మథురా నగరమా, కృష్ణాసాగర కెరటమా?
తెలుపుమా తెలుపుమా తెలుపుమా!

అమ్మాయి అందాన్ని హంపి శిల్పంతోనూ, బాపు బొమ్మతోనూ పోల్చడం మామూలే. అయితే అందం పేరేమిటి అని అడిగి, తన పేరు ఏ హంపి శిల్పమో, బాపు చిత్రమో అయ్యి ఉంటుంది అనుకోవడం నవ్యత. అంటే పాత విషయానికే కవితాత్మకమైన కొత్త expression ఇవ్వడం. అలాగే “ఓ పరువమా, నీ ఊరి ఏమిటి?” అని అడగడం కూడా. దానికి సమాధానం – “ఏ కృష్ణుని మథురా నగరమో, కృష్ణాసాగర కెరటమో!”. “కృష్ణా సాగరం” అంటే “కృష్ణా నది” అనుకుంటే, ఆ నదీ కెరటాలతో పరువాన్ని పోల్చడం సబబే! “కృష్ణా సాగరం” అంటే “కృష్ణుని భక్తి సాగరం” అనుకుంటే, అందులో ఉవ్వెత్తున ఎగిసిపడే ఓ సుందర కెరటం గా పరువాన్ని వర్ణించడమూ సరిపోతుంది. ఈ పోలికలో జయదేవుని మథుర భక్తి కీర్తనలు పరోక్షంగా ప్రస్తావించడమూ ఉండి ఉండొచ్చు.

చరణం 1:
ఏ రవీంద్రుని భావమో గీతంజలి కళ వివరించె
ఎండ తాకని పండు వెన్నెల గగనమొలికె నా కన్నుల

ఆ అమ్మాయి అందాన్ని చూస్తే చాలు, మనసులో రాగం పుడుతోంది! తను మహాకవి రవీంద్రుడు ఊహించిన భావమా? ఏ భావమైతే “గీతాంజలి” కావ్యమై, రవీంద్ర సంగీతమై విరిసిందో, ఆ అమ్మాయిని చూడగానే ఆ భావం కలిగి, వెన్నెల నిండిన గగనం చూసిన అనుభూతి కలుగుతోంది. ఇక్కడ వేటూరి చేసిన కొన్ని ప్రయోగాలు గమనించదగినవి –

“ఎండ తాకని పండు వెన్నెల గగనం” – వెన్నెలున్నప్పుడు ఎండ ఉండదు, ఎండ ఉన్నప్పుడు వెన్నెల ఉండదు. దీనినే వేటూరి కొత్త కోణం నుంచి చూసి “ఎండ తాకని వెన్నెల” అంటాడు. “ఎండ కన్ను సోకని సుకుమారి” అంటూ ఉంటాం కదా, అలాగ! ముద్దొచ్చే ప్రయోగం ఇది.

“కన్నుల్లోకి వెన్నెల గగనం ఒలకడం” – వెన్నెల కళ్ళలోకి “ఒలికింది” అట! ఎంత అందమైన expression!

ఎంకి పాటల రాగమే గోదారి అలలపై నిదురించె
మూగబోయిన రాగమాలిక ముసిరెనిపుడు నా గొంతున

నండూరి వారి ఎంకి పాటల రాగాలు ఏమయ్యాయ్? బహుశా గోదారి అలల ఊయల జోలలో ఆదమరిచి నిదురిస్తున్నాయి ఏమో! నిదురించిన ఆ రాగాలని కదిపి, మేలుకొలిపి, అబ్బాయి గొంతులో పాటగా బయటకి రప్పించిన ఆ అమ్మాయి అందం ఎంత అద్భుతం!

“గొంతులో రాగమాలిక ముసిరింది” అనడం very poetic expression.

సంగీతమా, నీ నింగిలో
విరిసిన స్వరములే ఏడుగా, వినబడు హరివిల్లెక్కడ?
తెలుపుమా తెలుపుమా తెలుపుమా

ఆ అమ్మాయి “సంగీత గగనం” అనుకుంటే, మరి ఆ నింగిలో ఏడు స్వరాలుగా విరిసిన హరివిల్లు ఎక్కడో? ఈ ప్రశ్నలో కొంచెం చిలిపితనం తొంగి చూస్తుంది. “వినబడు హరివిల్లెక్కడ” అని పాడినప్పుడు బాలు గొంతులోని చిరునవ్వు దీనికి సాక్ష్యం.

మామూలుగా అయితే హరివిల్లు కనిపిస్తుంది. కానీ ఇది సంగీత గగనం కాబట్టి, ఇక్కడ “హరివిల్లు వినిపిస్తుంది”! ఇలాటి ప్రయోగాలు వేటూరికే సాధ్యం. That is Veturi!

చరణం 2:

భావ కవితల బరువులో ఆ కృష్ణశాస్త్రిలా కవినైతే
హాయి రెమ్మల కోయిలమ్మకు విరుల ఋతువు వికసించదా

రెండో చరణంలో అమ్మాయి అందాన్ని సాహిత్యపరంగా వర్ణించడం కనిపిస్తుంది. అమ్మాయి అందాన్ని చూసిన అబ్బాయి అనుకుంటున్నాడు – “నేను కృష్ణశాస్త్రి అంత కవిని అయినా బాగుణ్ణు. అయ్యి ఉంటే ఈ అందాన్ని చూసి పులకించి రాసిన భావ కవితలతో కోయిలకి వసంతం వచ్చెయ్యదూ?”

కృష్ణశాస్త్రి అంటే వేటూరికి అభిమానం, గౌరవం. “మావి చిగురు తినగానే కోయిల కూసేనా, కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా” వంటి రమ్యమైన వసంత గీతాలు రాసిన దేవులపల్లకి వేటూరి సమర్పించిన గౌరవ నివాళిగా కూడా ఈ వాక్యాల గురించి చెప్పుకోవచ్చు.

తుమ్మెదడగని మధువులే చెలి సాకి వలపులే చిలికిస్తే
మాయ జగతికి ఏ ఖయామో మధుర కవిత వినిపించడా

“ఒమర్ ఖయాం” అన్నా కూడా వేటూరికి చాలా ఇష్టం. “సాకి” అంటే పెర్షియన్ భాషలో “మధువు అందించే పిల్ల” (wine-server) అని అర్థం. మధువు గురించీ, జీవితం గురించి ఖయాం రాసిన కవితలు సుప్రసిద్ధం. తాత్త్వికత, మార్మికత కూడా ఆ కవితల్లో కనిపిస్తుంది.

ఇక్కడ అబ్బాయి ఏమంటున్నాడు అంటే – ” ఈ అందమైన అమ్మాయే కనుక “సాకి” లా మధువునీ, వలపునీ అందిస్తే ఒమర్ ఖయాం గొప్ప కవితలు రాయడంలో ఆశ్చర్యం ఏముంది?” అంటే గొప్పతనం అంతా “సాకి”దే. రాసిన కవిది కాదట!

ఓ కావ్యమా, నీ తోటలో
నవరస పోషణే గాలిగా, నవ్విన పూలే మాలగా
పూజకే సాధ్యమా? తెలుపుమా

ఆ అమ్మాయి కావ్యాలు పూసే తోట. తను ఆ అమ్మాయి అందాన్ని పూజించే భక్తుడు. నవరసాలు కురిపించే ఆ అమ్మాయి కళలే ఆ తోటలో “పిల్ల”గాలులు అట. తోటలో పువ్వులన్నీ ఆ అమ్మాయి నవ్వులట! ఆ పువ్వులతోనే తను పూజిస్తున్నాడు కూడానూ!! పైగా “పూజించడానికి అనుమతివ్వవూ?” అంటూ వేడుకోవడం ఒకటీ!
ఈ పాటలో వర్ణించిన “అందం”, మనసుని “పులకింపజేసే” అందం. తనువుని “పలికింపజేసే” అందం కాదు. ఒక్కసారి పాటని ఆసాంతం చదవండి. ఒక అందమైన అనుభూతి మనసుకి కలుగుతుంది. అప్పుడు వేటూరి కూడా 70 ఏళ్ళ వృద్ధుడిలా కాక, పదహారేళ్ళ కన్నెపిల్లలా నవ్వుతూ కనిపిస్తాడు! … ఆ నవ్వు పేరు “తెలుగు”, ఆ కలం ఊరు “వెలుగు”!!
 

7 thoughts on “అందమా నీ పేరేమిటి?

  1. ఒక పేజి కి మించని పాటలో ఒక పుస్తకం అంత భావం.అలా వివరించుకుంటూ పోతే పెద్ద గ్రంధం అవుతుందేమొ.మహానుభావుల ప్రతి పదం లో ఎంతో లోతు వుంటుంది.పాఠకుడు అభిరుచిని,శక్తి ని బట్టి అవి అర్దం అవుతాయి.మీరు ఉత్తమ పాఠకుడు అని తెలుస్తుంది.అవి మాతో పంచుకుంటున్నందుకు ధన్యవాదములు.

    Like

  2. మీ వివరణ చదివేదాక ఈ పాట ఇంత అందమైనదని నాకు తెలీదు. చాలా బాగా రాసారు. మీరు ఇంకా ఇలా మంచి పాటలను ఎంచుకుని, వివరిస్తే, బాగుంటుంది. ఇంత మంచి పాట గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు.

    Like

  3. సాకి పదం కోసం వెతుకుతూంటే ఈ టపా నన్నో అరగంట ఇక్కడ నిలిపివేసింది.
    చాలా బాగుంది. వేటూరి గారి కవితాత్మను ఆవిష్కరించారు.

    బొల్లోజు బాబా

    Like

  4. ఈ పాటలో వర్ణించిన “అందం”, మనసుని “పులకింపజేసే” అందం. తనువుని “పలికింపజేసే” అందం కాదు. ఒక్కసారి పాటని ఆసాంతం చదవండి. ఒక అందమైన అనుభూతి మనసుకి కలుగుతుంది. అప్పుడు వేటూరి కూడా 70 ఏళ్ళ వృద్ధుడిలా కాక, పదహారేళ్ళ కన్నెపిల్లలా నవ్వుతూ కనిపిస్తాడు! … ఆ నవ్వు పేరు “తెలుగు”, ఆ కలం ఊరు “వెలుగు”!!
    చాలా బాగుంది

    Like

    1. ఈ లైన్లు నేను రాసినట్టు నాకే గుర్తు లేదు! మీ పుణ్యమా అని మళ్ళీ ఎప్పుడో
      రాసిన ఈ ఆర్టికల్ చదివాను. థాంక్స్ నాయుడు గారూ!

      On Sun Nov 23 2014 at 11:45:45 AM "తెర"చాటు చందమామ wrote:

      >

      Like

Leave a reply to ravindra Cancel reply