మరుమల్లెల్లో ఈ జగమంతా

అమృత సినిమా శ్రీలంకలోని తమిళుల ఆవేదనకి అద్దం పట్టిన సినిమా. తమ సొంత గూటి నుంచి వలసి వచ్చి, భయంతో బిక్కుబిక్కుమంటూ, శాంతినీ, సుఖాన్నీ కోల్పొయినవాళ్ళ దయనీయ పరిస్థితిని మణిరత్నం అద్భుతంగా ఆవిష్కరించాడు. రోజూ హింసా, రక్తపాతాల నడుమ నలిగిపొతున్న జీవితంలో ఏదో ఒక రోజు శాంతిని పంచే ఉషోదయం రావాలని అభిలషిస్తూ ఒక కవి పాడే గీతమే “మరుమల్లెల్లో” అనే పాట. సినిమానుంచి తీసి చూస్తే శాంతిని కాంక్షించే ఒక చక్కని భావగీతంలా కనిపిస్తుంది.

 

తమిళ గీతరచయిత వైరముత్తుకి జాతీయ అవార్డ్ తెచ్చి పెట్టిన ఈ సినిమా పాటలు తెలుగులో వేటూరి రాశారు. వేటూరి అనువాదాలు జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం బోధపడుతుంది – తమిళ భావం మాత్రమే ఆయన తీసుకుని తెలుగు చేస్తారు, కొన్ని సార్లు మారుస్తారు కూడా, అంతే కానీ మక్కికిమక్కీ దించరు. ఈ పాటకి అదే ఆయన చేశారు. వేటూరి అనువాదాల్లో ఉండే క్లిష్టత ఈ పాటలో కనిపించదు. ఈ చక్కని పాట గురించి క్లుప్తంగా –

 

మరుమల్లెల్లో ఈ జగమంతా విరియగా

ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా

పారాణేదో భుమికి వెలుగుగా

మందారాలే మత్తును వదలగా

కనుల తడి తుడిచే ఒడిలో పసి పాపాయి

చిలికే చిరునగవే చీకటితల్లికి వేకువ

 

శాంతి నిండిన జగాన ఉదయం ఎంత మనోహరంగా ఉంటుందో కవి ఊహిస్తున్నాడు. “పారాణి, మందారాలు” – ఇవి వేటూరి పెట్టిన తెలుగింటి సందెదీపాలు. పసి పాపలు హాయిగా నవ్వినప్పుడే నిజమైన వేకువ అంటూ, “చీకటితల్లి” అని వాడడం ఎంత గొప్ప ప్రయోగం!

 

గాలిపాటల జడివాన జావళి, అది మౌనంలా మధురం అవునా?

వేలమాటలే వివరించ లేనిది, తడి కన్నుల్లా అర్థం, అవునా?

 

రెహ్మాన్ పదాలు సరిగ్గా పాడకుండా మింగెయ్యడంతో ఈ చరణం ఎవరికీ అర్థం కాకుండా పోయింది. సరే చూద్దాం. “జడివాన జావళి” – ఆహా ఇదో వేటూరి చమత్కారం. ఈ జడివాన జావళి ఎంత బాగున్నా మౌనం అంత ఆనందం కలిగించదు అంటున్నాడు. అలాగే తడి కన్నులు ఇట్టే చెప్పగలిగే విషయాన్ని వేలమాటలు వివరించలేవన్నాడు. ఈ రెండు వాక్యాలకీ అర్థం ఎవరికి వారు తమ అంతరంగమౌనంలో తెలుసుకోవలసిందే కానీ నేను వివరించలేను.

 

లేతపాపల చిరునవ్వుతోటకే దిగివస్తావా సిరులవెన్నెలా

వీరభూమిలో సమరాలు మానితే వినిపించేనా స్వరమే కోయిలా

 

“లేతపాపల చిరునవ్వుతోట” అనడం ఎంత కవిత్వం! పసిపాపలు హాయిగా నవ్విన నవ్వుల్లో వెన్నెల కురుస్తుందని ఎంత బాగా చెప్పారు. యుద్ధాలు మానిన రోజు కోయిల స్వరాలు వినిపిస్తాయ్ అంటున్నాడు.

 

ఈ పాటని రెహ్మాన్ గొప్పగా స్వరిపరిచాడు. మనసులోతులు తాకుతుందీ స్వరరచన. గొప్ప సాహిత్యం తోడైన ఈ పాట టీవిలో, పేపర్లో ఎప్పుడు తీవ్రమైన హింస గురించి చదివినా నా మనసులో మెదులుతూ ఉంటుంది, పెదవిపై పలుకుతూ ఉంటుంది.

 

 

23 thoughts on “మరుమల్లెల్లో ఈ జగమంతా

  1. మంచి పాటను గుర్తుచేశావు సోదరా. వేటూరి ఎక్కడినుండో నీలాంటి అభిమానులను చూస్తూనే ఉంటారు, ఆశీర్వదిస్తూనే ఉంటారు.

    “వేలమాటలే వివరించలేనిది తడికన్నుల్లో మౌనం ఔనా?” – ఇది నాకు బాగా నచ్చిన లైన్. రెహ్మాన్ పాడిన పాటల్లోకల్లా ఇది ప్రశస్తమైనది అని ఆయన అభిమానులు చాలామంది అంటారు. నాకూ నచ్చింది. ఐతే తెలుగు-కి రెహ్మాన్ భాష సరిగ్గా తెలియకపోవడంతో ఎక్కువ న్యాయం చెయ్యలేదు (పాడినప్పుడు/స్వరపరిచినప్పుడు) అని నా అభిప్రాయం. ఇళయరాజా వంటివారు తెలుగు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు తెలుగులో స్వరపరిచినప్పుడు ముందే తమ్ష్జంలో వచ్చిన బాణీలను కూడా కాస్త ఆంధ్రీకరించేవారు అని నా అభిప్రాయం.

    Like

  2. థాంక్స్ ఫణి గారు. ఎన్ని సార్లు విన్నా గమనించలేదు ఈ అధ్బుతం.

    “కనుల తడి తుడిచే ఒడిలో పసి పాపాయి
    చిలికే చిరునగవే చీకటితల్లికి వేకువ”

    Like

  3. మీ ఈ టపా లంకెని నా ఫేస్బుక్ లో పెట్టుకుంటున్నా. మీరేమీ అనుకోరని అనుకుంటున్నాను.

    Like

  4. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. పాటలు రాయడంలో వేటూరి ప్రతిభావంతుడైనా డబ్బింగ్ పాటలు రాయడంలో మాత్రం తన ప్రతిభను అంతగా ప్రదర్శించలేదనే చెప్పాలి. డబ్బింగ్ పాటలకు డబ్బులు మరీ తక్కువ ఇస్తారేమో, అందుకని ఆయన అనువాద చిత్రాలకు చాలావరకు నాసిరకం పాటలే రాసాడు. నిజానికి డబ్బింగ్ పాటలు ఎలా రాయాలో రాజశ్రీ రాసిన పాటలనుచూసి, ఎలా రాయకూడదో వేటూరి రాసిన పాటలను చూసి నేర్చుకోవచ్చని చెప్పువచ్చు :-). వేటూరి ఎవరికీ అర్థం కాని “అరబిక్కడలందం” వంటి తమిళ పదబంధాలను యథాతంగా రాసేస్తాడు. “అరబిక్ కడలి” అన్నది తెలుగు నుడికారానికి సరిపోదని, దాన్ని తెలుగు విద్యార్థులు పుస్తకాలలో “అరేబియా సముద్ర”మని చదువుకుంటారని ఆయనకు తెలిసినా పెద్దగా పట్టించుకోడు. నాలుగు మాత్రలు అవసరమైన చోట ఆరు మాత్రలున్న “మామకొడుకు” అన్న పదాన్ని రాస్తే దాన్ని “మామా, కొడుకూ రాతిరికొస్తే” అని పలుకుతారని, అది చాలా తప్పుగా ధ్వనిస్తుందని ఆయనకు తెలిసినా సరిచేయడు. ఇదీ డబ్బింగ్ పాటల విషయంలో ఆయన విలక్షణమైన నిర్లక్ష్య ధోరణి!

    మీరు ఈ టపాలో చర్చించిన పాట వింటే డబ్బింగ్ పాట వింటున్నట్టే ఉంటుంది తప్ప ఎదలోని సొదలా, కదిలేటి నదిలా, కలల వరదలా వినిపించే వేటూరి పాటలోని తియ్యదనం, తెలుగుదనం ఈ పాటలో అస్సలే వినిపించదు. మీరు ఏదో వేటూరి మీద అభిమానంతో ఆయన ఏం రాసినా మెచ్చుకుంటున్నారు గాని మూలం లోని అర్థాన్ని అథ్వాన్నపు అడవిలో వదిలేసి, బాణీకి సరిపోయే పదాలను ఏరుకొని పది నిమిషాల్లో పూర్తి అయిపోయిందనిపించిన పాటలా ఉంది ఈ పాట. అమృత సినిమా చూసిన తరువాత తెలుగు సినిమా రంగంలో రాజశ్రీ లేని లోటు చాలా స్పష్టంగా తెలియవచ్చింది.

    ఏ మత్తులో తూలుతూ వేటూరి ఈ అనువాదరచన చేసాడో గానీ, ఈ పాటలో పల్లవికి, అనుపల్లవికి, చరణానికి ఏ రకమైన పొందిక లేదు. వైరముత్తు రాసినతమిళ గీతం వింటే శాంతిని పంచే ఉషోదయం రావాలన్న కవి అభిలాష సున్నితంగా మన గుండెలను తాకుతుంది. తెలుగు పాటలో తెలుగు నుడికారానికి దూరమైన పదబంధాలు, సరిగ్గా అతకని భావాలు మనకు ఏ రకమైన అనుభూతి కలిగించవు. అసలు కవి ఏం చెప్పదలుచుకున్నాడో అర్థం గాదు. సరిగ్గా అతకని ఈ అయోమయ కవిత్వాన్ని అధివాస్తవిక కవిత్వమని పేరు పెట్టుకొని సమర్థించుకోవాలేమో మరి!

    తమిళం తెలియని వారికోసం తమిళ పాట లోని భావాలను నాకు తెలిసినంత మేరకు అనువాదం చేసి ఇస్తున్నాను (పాట ట్యూన్ లో కాకుండా మామూలు కవితలా చదవండి. తమిళం బాగా తెలిసిన వాళ్ళు నా తప్పుల్ని సరిచేయండి):

    మరు మల్లెలే జగమంతా విరియనీ
    ఉదయం భూమి(ని) శాంతికోసమే తట్టి లేపనీ
    పుడమిపై పచ్చని వెలుగే ప్రసరించనీ
    పువ్వులు మత్తుగా ముఱిసిపోతూ విచ్చుకోనీ
    తల్లుల వెచ్చని ఒడిలో పాపాయిలు కనుతెరవనీ
    పిల్లలు చిలికే చిరునవ్వులలో ఈ లోకమే మేల్కొననీ

    గాలి సవ్వడిలో గాంధారం
    వాన పాటల సంగీతం
    మౌనంలోని ప్రశాంతతను తెస్తాయా?
    కోటి కీర్తనలు
    కవుల శతకోటి సత్కృతులు
    ఒక్క కన్నీటి చుక్కకు అర్థం చెబుతాయా?

    ఏ దిశలో పసిపాపలు
    తమ వేళ్ళను చూపిస్తారో
    ఆ వైపే చంద్రుడు ప్రభవించడా?
    ఎక్కడ మానవ జాతి
    యుద్ధభేరీలు ఆపివేస్తుందో
    అక్కడ కోయిలలు తమ వసంత గానం వినిపించవా?

    ఇప్పుడు చెప్పండి, తమిళ పాట తెలియని వారికి వేటూరి పాట వింటే ఈ రకమైన అర్థం, అనుభూతి కలుగుతాయా?

    Like

    1. to mr suresh kolichala,

      i have gone through ur post above,

      i really admire ur guts to say the kind of words u have expressed about mr Veturi in ur message,

      mr Veturi has written lyrics in his own style without necessarily following some one else meaning and who ever wanted his version only,

      if u feel the expressions are incomplete or meaningless it is up to ur understanding of telugu language and ur understanding of the visual and sound representation in film songs and the parameters of tune in which u have put in ur lyrics,

      i hope u will refrain from making comments like what u did in the above post here after in regard to any writer it may be,

      u participate in a discussion or not, but when u do u have to behave in a decent way hoe u will mind it ,

      Like

    2. సురేష్ గారూ చాలా మంచి పాటను పరిచయం చేశారు. అనువాదంలో చదువుతూంటేనే నాకు మనస్సు కరిగిపోయింది.. నేషనల్ అవార్డు వచ్చిందంటే రాదా మరి.

      Like

  5. వైరముత్తు గారి “వెళ్ళైప్ పూక్కళ్ ఉలగం ఎంగుం మలర్గవే”
    పాటయొక్క అనువాదం…

    గమనిక :
    ఈ అనువాదం చదివాక “ఇందులో ఏం గొప్పభావం ఉంది?” అని మీకు అనిపిస్తే అది అనువాదలోపమే అని
    గుర్తించాలి. ఎందుకంటే ములంలో ఉన్నభావాలకు ఆ భాషలోని native పదాలుకూడా బరువునిస్తుంది. అటూవంటి
    బరువైన భావాలను ఇక్కడ చూడలేకపోతే అది నా భాషలోనిలోపమే.

    పల్లవి :
    తెల్లని పువ్వులు జగమంతా పూయనీ
    తెల్లారే పొద్దు/భూమి శాంతికై తెల్లారనీ
    పసుపుపచ్చ వెలుగే ఈ పుడమిని తాకనీ

    పువ్వు బద్దకము తెంచి విరియనీ
    తల్లియొక్క వెచ్చని ఒడిలోనే పాప నిద్రించి లేవనీ
    బిడ్డయొక్క తొలి చిరునవ్వులో ప్రపంచం ఉదయించనీ

    చరణం 1
    గాలి హోరూ, వానపాటా
    మౌనంలోని ప్రశాంతతనివ్వగలదా?
    కోట్లాది కీర్తనలూ, కవులు అల్లిని పదజాలాలూ
    చుక్క కన్నీరు కలిగించే భావానికి సరితూగునా

    చరణం 2
    ఎక్కడైతే నిర్భయంగ చిన్నారి చేతులుచాచునో
    అక్కడే ఉదయించవా అందాల వెన్నెలా?
    ఎక్కడైతే మనుషజాతి యుద్ధాల్లేక ఉన్నారో
    అక్కడ కూయవా తెల్లని కోయిలా…

    Like

  6. వేటూరి గారి తమిళ అనువాద గీతాలు నాకు కొన్ని నచ్చావు కానీ.
    “ఎలా రాయకూడదో వేటూరి రాసిన పాటలను చూసి నేర్చుకోవచ్చని చెప్పువచ్చు “.. ఇది మరీ దారుణం.
    కావాలంటే .. అలై పొంగెరా .. చూడండి.

    ఒక్కసారి ఈ టపా చూడండి – http://kottapali.blogspot.com/2008/02/blog-post_12.html

    ఇక రాజశ్రీ కొంచెం ఎక్కువ శ్రద్ధగా అనువదించి ఉండవచ్చు. కానీ అక్కర్లేని. ఇప్పుడు వాడుకలో లేని తెలుగు పదాలు, పద ప్రయోగాలు. బహుసా తమిళ మాతృక చాలా దగ్గరగా అర్థం వచ్చేడట్టు రాసేవారేమో. నాకు తమిళం తెలియదు కాబట్టి చెప్పలేను.

    హిమ బిందువు వోలె,ముద్దులిడ

    వెన్నెలకంటి కూడా ఇలాటి పదాలు వాడుకలు చేస్తుంటారు.

    ఇంతకీ ..
    అర్థం సరిపోక పోయినా ఒరిజినల్ కంటే తెలుగు పాటలో భావమే బావుంది అక్కడక్కడా
    “కనుల తడి తుడిచే ఒడిలో పసి పాపాయి చిలికే చిరునగవే చీకటితల్లికి వేకువ”

    Like

    1. అక్కడక్కడా బావుండడమే సమస్య అండీ. పాటకు ఓ ధార ఉండాలి.

      Like

  7. మీ స్పందనకి ధన్యవాదాలు. మంచి చర్చకు తెరతీసారు. వేటూరి పాటల్లో, ముఖ్యంగా అనువాద గీతాల్లో, లోపాలు పుష్కలంగా ఉన్నాయ్. కొన్నిసార్లు ఆయన ఏమనుకుని రాశాడో అర్థమే కాదు ఓ పట్టాన. అయితే అర్థం కానందునో, పాటలో ఏవో కొన్ని తప్పులు/లోపాలు ఉన్నందునో పాట మొత్తాన్ని చెత్తని తీర్మానించడం సబబేనా అన్నది ప్రశ్న? ఏమో కొన్ని సార్లు మనం అర్థం లేదు అనుకున్న వాటి వెనుక గొప్ప అర్థం ఉండవచ్చు, చెత్త అనుకున్న పాటలో మంచీ ఉండొచ్చు. సిరివెన్నెల వేటూరి గురించి రాసినట్టు (http://goo.gl/TxKh5)- “ఆయన దంతధావనానంతరపు పుక్కిలింతలే గమనించి పక్కకి పారిపోయే వారు, ఆ తర్వాత ఆయన తన మనోమందిరంలో ధ్యానముద్రలో జపించిన నమక చమకాల నాదం నుంచి ఆవాహన చేసి మనకందించిన రుద్రాభిషేక సంజనిత గీతామృత శీకరాలలో స్నానించలేరు”. ఈ మాటలు సిరివెన్నెల వారు వేటూరి రాసిన చెత్త పాటలూ, మంచి పాటల గురించి రాశారు కానీ ఒకే పాటలో ఉన్న మంచికీ, చెత్తకీ కూడా ఇది వర్తిస్తుంది.ఓ పదప్రయోగమో, భావమో మనకి చికాకు కలిగిస్తే దానిని మాత్రమే వదిలేసి మిగిలిన పాటని ఆస్వాదించడం కష్టమే. మీరు అభిమానం అన్నారు చూడండి, అది ఇక్కడే కనబడుతుంది. నేను ఈ బ్లాగులో చేసిన ప్రయత్నమల్లా వేటూరి పాటల్లోన నేను మంచి అనుకున్నది వెలికి తీసే ప్రయత్నమే. అంతే తప్ప నేను వేటూరి ఏం రాసినా పొగిడే పనిలో లేను. ఈ వివరణ ఎందుకిస్తున్నానంటే గతంలో “దేహం తిరి” (http://goo.gl/ff3VT) పాట గురించి నేను రాసినప్పుడూ కొందరు “మీరు నాసి రకం పాటలూ గొప్పవంటున్నారు” అన్నారు.

    ఇప్పుడు ఈ పాట చూద్దాం. మొదటి చరణం తప్పించి మిగతా పాట చక్కగానే అర్థం అయ్యింది నాకు. తమిళ పాట భావం మిత్రులు చెప్పాక అప్పుడు మొదటి చరణం అర్థమైంది. అందుకే ఈ బ్లాగు రాసింది – నాకు అర్థమైనది అందరితో పంచుకోవాలని.

    “ఈ పాటలో పల్లవికి, అనుపల్లవికి, చరణానికి ఏ రకమైన పొందిక లేదు” అన్నారు. ఇది తమిళ పాటకి అనువాదమే కాబట్టి ఆ లెక్కన తమిళ పాటా మీకు ఇలాగే ఎందుకు అనిపించలేదు? ” తెలుగు నుడికారానికి దూరమైన పదబంధాలు ” ఏమిటో వివరిస్తారా?

    వేటూరి అనువాదాన్ని తప్పు పట్టడానికి మీరు ఈ పాట ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నా మటుకు ఇది వేటూరి కొంత బాగా అనువాదం చేసిన పాటల్లో ఒకటి. ఆ మాటకొస్తే అమృత సినిమా పాటలన్నీ చక్కగానే ఉంటాయి. నాకు బాగా గుర్తు – ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మా హాస్టల్‌లో వేటూరి సఖి మొదలైన చిత్రాలకి రాసిన అర్థం కాని అనువాదాలకి విసుగు చెందిన మిత్రులు కొందరు, ఈ అమృత పాటలు చాలా మెరుగని మెచ్చుకున్నారు.

    Like

  8. వేటూరి డబ్బింగ్ పాటలు బాగా వ్రాయలేదనే వాదనతో నేను ఏకీభవిస్తాను.. యువ లో ఇదివరకు ఫణీంద్ర విశ్లేషించిన(దేహం తిరి) పాటకూడా నాకు పెద్దగా నచ్చలేదు.. రావణ్ సినిమాలో పాటలు..పలు డబ్బింగ్ సినిమా పాటలు నాకు నచ్చవు .. వేటూరి ఎవరికి ఎలా కావాలో అలా రాసిచ్చా అని చెప్పారు.. చివరి రోజుల్లో ..వేటూరిలో నిబద్ధత తక్కువ అనిపిస్తుంది నాకు. ఇకపోతే అలైపొంగెరా కన్నా పాట పై ఇదివరకు నేను ఒక బ్లాగ్ పోస్ట్ వ్రాయాలనుకున్నాను.. ఈ పాట గొప్పతనాన్ని అందులోని సాహితీ విలువలు ప్రయోగాలు వివరిస్తూ చాలా బ్లాగ్ పోస్ట్ లు వచ్చాయి
    పాట సందర్భం:ఒక అమ్మాయి సీమంతం లో పాడేపాట
    పాడేవాళ్ళు:సీమంతానికి వచ్చిన ఆంటీలు

    ఆ సందర్భానికి ఆ సాహిత్యం ఎలా అతుకుతుందో నాకు అర్థం కాలేదు.. నా మటుకు ఆ పాట …కొందరు గోపికలు కలిసి కృష్ణుడి గురించి పాడుతున్నట్టు ఉంటుంది..అద్భుతమైన భావం పడింది అనుకునేలోగానే.. కొంత వేటూరిజం భావాలు పడిపోతాయి..
    గూగులమ్మ ఇచ్చిన సాహిత్యం

    http://kottapali.blogspot.com/2008/02/blog-post_12.html
    అనంత మనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా
    నిశాంత మహీజ శకుంతమరంద మెడారి గళాన వర్షించవా
    ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిల్లు బిగించవా
    సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిల్లు బిగించవా
    కడలికి అలలకు కధకళి కలలిడు శశి కిరణము వలె చలించవా
    చిగురు సొగసులను కలిరుటాకులకు రవికిరణాలె రచించవా
    కవిత మదిని రగిలి ఆవేదనా
    ఇతర భామలకు లేని వేదనో
    కవిత మదిని రగిలి ఆవేదనా
    ఇతర భామలకు లేని వేదనో
    ఇది తగునో యెద తగవో ఇది ధర్మం అవునో
    ఇది తగునో యెద తగవో ఇది ధర్మం అవునో
    కొసరి ఊదు వేణువున వలపులే చిలుకు
    మధుర గాయమిది గేయము పలుకగా
    అలై పొంగెరా కన్నామానసమలై పొంగెరా
    నీ ఆనంద మోహన వేణుగానమున .. ఆలాపనే .. కన్నా.. కన్నా..
    ——-
    1.అసలు ఈ సాహిత్యం సందర్భానికి మాచ్ ఎలా ఔతుంది.. పోనీ పాట హీరోయిన్ పాడుతుంది అనుకుంటే అలానూ కాదు ..మన మణిరత్నం గారు దాన్ని ముత్తయిదువలైన ఆంటీల పై చిత్రీకరించారు. ఒక గోపిక విరహగీతాన్ని ఆంటీలు సీమంతం లో ఎందుకు పాడతారు.
    2.పైన నేను పేర్కొన్న లైన్లలో అద్భుతమైన భావం భాషా మనకి కనపడతాయి కానీ..
    కడలికి అలలకు కధకళి కలలిడు శశి కిరణము వలె చలించవా — ఇది మరీ హద్దు మీరిన ఎక్స్ప్రెషన్ అనిపిస్తుంది నాకు
    3.కవిత మదిని రేగె ఆవేదన? — కవిత ఎక్కడినుంచి వచ్చింది (భావం అమ్మాయికి మదిలో ఆవేదన రేగింది అని అర్థమవుతున్నా …కవిత మదిని ఎందుకు?)

    ఇదే సినిమాలో వేటూరి వ్రాసిన కలలై పోయెను నా ప్రేమలు నాకు చాలా నచ్చుతుంది

    నాకు వేటూరి అంటే అమితమైన గౌరవం ఉన్నా .. డబ్బింగ్ పాటల్లో ఆయన తన ప్రతిభను పూర్తిగా వినియోగించలేదు అనిపిస్తుంది. ఆ మాటకొస్తే సురేష్ గారు చెప్పినట్టు రాజశ్రీ రచలను ఇప్పటికీ భలే ముద్దొస్తాయి ..ప్రేమికుడు లాంటి యూత్ ఫుల్ సినిమాలో కూడా.. ఈ కాలం డబ్బింగ్ పాటలు రాస్తున్నవారు లబ్ద ప్రతిష్టులా …పిల్ల కవులా అని పక్కన పెడ్ట్టి చూస్తే చాలా మటుకు బాగోవటంలేదు.. భావాలు గొప్పవే ఉంటున్నయేమో కాని.. తమిళ వాసనతో ఎక్కడా తెలుగుదనం లేకుండా మరీ దారుణంగా ఉంటున్నాయి.

    Like

    1. అది కర్ణాటక సంగీతంలో అపురూపమనదగ్గ ‘‘అలై పాయుదే’’ పాటకు అద్భుతమైన అనువాదం. అలైపాయుదే అన్న పాటే అందుకు పెట్టారు.

      Like

  9. ఫణీంద్ర గారు: నాకు వేటూరిని గాని, మిమ్మల్ని గాని కించపరచాలన్న ఉద్దేశ్యం లేదు. తెలుగు పద్యాలు విడమరచి చెప్పే పంతుళ్ళు లేని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న రోజుల్లో నాకు సాహిత్యంతో పరిచయం ఏర్పడింది వేటూరి పాటల ద్వారానే . ఎన్నో తెలుగుపదాల గురించి పాఠాలు చెప్పింది ఆయన పాటలే. కాబట్టి ఆయనంటేనాకు ఎంతో అభిమానం, గౌరవం, పాటలద్వారా చిన్నప్పటినుండి బాగా పరిచయమున్న కవిగా ఆయనను విమర్శించడంలో కూడా కొంత చనువుతో కూడిన అధికారం. అంతే. మీరు వేటూరిని సమర్థించడానికి సీతారావుఁణ్ణి ప్రయోగించాల్సిన అవసరంలేదు. మీరు పొందికైన వాక్యాలతో, వ్యర్థ పదాలు లేకుండా చక్కటి తెలుగు వచనం రాస్తారు. “నమక చమకాల నాదం నుంచి ఆవాహన చేసి మనకందించిన రుద్రాభిషేక సంజనిత గీతామృత శీకరాలలో” ఎందుకింత శబ్దాడంబరం సీతారామశాస్త్రికి? “నమక చమకాల నాదం నుంచి ఆవాహన చేసి మనకందించిన ” అన్న తరువాత మళ్ళీ “రుద్రాభిషేక సంజనిత” అనడం దేనికీ?

    మీరు చెప్పిన మొదటి చరణం ఎవరికీ అర్థం కాకుండా పోవడానికి పాట పాడిన రెహ్మాన్ కంటే పాట రాసిన వేటూరిదే ఎక్కువ దోషం అని నా అభిప్రాయం. నిజానికి ఈ పాట చరణాలకు ఇచ్చిన ట్యూన్ చాలా సింపుల్ ట్యూను. మొదటి చరణం, రెండవ చరణం ఈ కింద చూపిన బాణీలోఉన్నాయి.

    తాన తాననా
    తన తాన తాననా
    తన నాన తన నాన తననా

    ఇందులో మొదటి లైనులో 3+5 మాత్రలు, రెండవ లైనులో 2+3+5 మాత్రలు, మూడవ లైనులో 2+3+2+3+4. ప్రతి లైనులో విరామం ముందు చివరగా ఒక గురువు రావడం చాలా ముఖ్యం. ఈ విషయం గ్రహిస్తే ఈ చరణాలు రాయడంలో వేటూరి చేసిన తప్పు తెలుస్తుంది. ఈ ట్యూనుకు వేటూరి రాసిందేమీ?

    గాలిపాటల
    జడి వాన జావళి
    అది మౌనం లా మధురం అవునా?

    దాన్ని ఆ ట్యూనుకు సరిపోయేలా పాడాలంటే ఇలాగే పాడాలి మరి:
    గాలి /పాటలా (చివర దీర్ఘం గమనించండి)
    జడి /వాన /జావళీ (ఇక్కడ దీర్ఘంతో అర్థబేధం రాదు)
    అది /మౌనం /లామధురం/అవునా?

    ఇటువంటి పదాల విరుపుతో రాస్తే ఎవరికీ అర్థం కాకుండా మారిపోయినందుకు ఎవరిని తప్పు పట్టాలి? అనుచిత పదచ్ఛేదం లేకపోయినా “అది మౌనంలా మధురం అవునా” అన్నది తెలుగు మాటలా ఉందా? “అది” అనాలా “అవి” అనాలా ? (గాలిపాటల జడి వాన జావళి singular (ఏకవచనం) అని అనుకోవచ్చు లెండి). అయినా, “మౌనంలా మధురం అవునా” అన్నది ఏ తెలుగు ప్రాంతపు నుడికారం?
    ఈ బాణీకి సరిపోయేట్టుగా పదాల విరుపు ఉండడానికి నేను ఈ లైను రాయాల్సి వస్తే దాన్ని ఇలా రాస్తాను. రహ్మాన్ ఇచ్చిన ట్యూనులో పాడుకోండి:

    గాలి హోరులో
    జడి వాన పాటలో
    ఒక మౌనం అందించే సుఖముందా?

    ఆ తరువాత వాక్యం కొంచెం బెటరు. రగుమానుని బాణీలో విరిస్తే:

    వేల/మాటలే/ (చివర గురువు వచ్చిందోచ్, భలే!)
    వివ/రించ/ లేనిదీ/ (చివరి దీర్ఘంతో అర్థబేధం లేదు)
    తడి /కన్నుల్/ల్లా అర్థం/అవునా?

    “ల్లా అర్థం” తోనే పెద్ద అనర్థం వచ్చిపడ్డది. దీంట్లో ఈ బగ్గును ఫిక్స్ చేసి ఇలా పాడుకోవచ్చు:

    వేలమాటలే

    వివరించ లేనిదీ
    తడి కళ్ళే వినిపించే కథలే!

    మీరూ మీకు ఇష్టం వచ్చినట్టు ఫిక్స్ చేసి పాడుకోండీ!

    (ఇక పల్లవి, మిగితా చరణం గురించి డిన్నర్ చేసిన తరువాత! సశేషం )

    Like

    1. “నమక చమకాల నాదం నుంచి ఆవాహన చేసి మనకందించిన రుద్రాభిషేక సంజనిత గీతామృత శీకరాలలో”

      నేను మీ analysis తో ఏకీభవించడం లేదు, “నమక చమకాల నాదం నుంచి ఆవాహన చేసి మనకందించిన రుద్ర” ఒకటి, “అభిషేక సంజనిత గీతామృతం” మరొకటి. రుద్రుడిని, ఆవాహనం చేశారు, అభిషేకం నించి సంజనితమైనది, గీతామృతం. ఒక రకం గా చెప్పాలి అంటే, నాదం, అందులోంచి గీతం, వీటికి పూర్తిగా సరిపోయిన శివార్చన (నటరాజు), ఇవి చాల సీతారామ శాస్త్రిగారి రచనల్లో కనిపిస్తాయి, ఎందుకో repetition.

      సగం సగం అలంకారాలు వాడి అవతల పారేసేయ్యడం బహుసా ఆయన (వేటూరి) style అనుకుంటా, ఏదేమైనా అటువంటి గొప్ప కవి భావాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించడం, ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇందులో కూడా, చీకటితల్లి, బాగానే ఉంది కాని, తల్లి చీకటి అయితే, మరి “ప్రతి ఉదయం” ఏమిటి, తల్లి చావా? లేదంటే, “చీకటితల్లికి వేకువ” అంటే ఏమిటి? చీకటి తల్లికి వేకువ చావు కాదా? లోపల ఉన్న కవి హృదయం తెలిసింది లెండి, “నిరాశ గా ఉన్న పాత తరాలకి, కళ్యాణ ప్రదమైన దేదో జరిగి, ఒక కొంగొత్త ఉదయంలా, కొత్త ఆశలు, శాంతి వైపు కలిగాయి. అయితే ఈ ప్రస్తానం లో పాత తరం ఇంచుమించు ముసలిదయ్యిందేమో కూడా”.

      గాలి పాటల జడి వాన జావళి, చాలా బాగుంది. గాలి పాటలు, జావళీలు శృంగారాన్ని చెప్పకనే చెబుతాయి. శృంగార భరితమైన చేష్ట అయినా మనసు లోతుల్ని తాకదు (మౌనం తాకినంతగా) అంటున్నారు, అద్భుతం. అయితే “జడి” వాన అంటే జడిపించే (భయపెట్టే) వాన కాదా? నా సందేహం తీర్చగలరు. తప్పు అర్ధం చెబితే మన్నించాలి, నిజంగా తెలియక అడుగుతున్నాను.

      Like

      1. మీరు ఓపిగ్గా రాసిన వ్యాఖ్యకి ధన్యవాదాలు. మీరు నమక చమకాల గురించి చెప్పినది సబబుగానే ఉంది, మరి సురేష్ గారు ఏమంటారో మరి.

        “జడి వాన” అంటే ఎడతెగక కురిసే వాన అని అర్థం. దీనికీ “జడిపించడానికి” సంబంధం లేదు, నాకు తెలిసి.

        Like

  10. “మొదటి చరణం తప్పించి మిగతా పాట చక్కగానే అర్థం అయ్యింది నాకు” అన్నారు. అయితే పల్లవిని పరిశీలిద్దాం.

    మరుమల్లెల్లో ఈ జగమంతా విరియగా
    ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
    పారాణేదో భూమికి వెలుగుగా
    మందారాలే మత్తును వదలగా
    కనుల తడి తుడిచే ఒడిలో పసి పాపాయి
    చిలికే చిరునగవే చీకటితల్లికి వేకువ

    ఇక్కడ విరియగా, వదలగా, తుడిచే, చిలికే అన్నీ అసమాపక క్రియలే. ప్రథాన క్రియ ఎక్కడా కనిపించకుండా ఏం చెబుతున్నాడో ఎలా అర్థంచేసుకోవాలి? పాటల్లో, కవిత్వంలో కర్త, కర్మ, క్రియ ఉండాల్సిన అవసరం లేదనుకోండి. ఇంతకీ మరుమల్లెలు విరుస్తాయా? జగం విరిసిందా? పోనీ జగమే మల్లెల్లా విరిస్తుంది అన్నది కవిసమయం అనుకుందాం. “ప్రతి ఉదయంలో శాంతికోసమే తపనగా” — ఎవరికీ తపన? పారాణేదో భూమికి వెలుగుగా — వెలుగే భూమికి పారాణిగా అని అర్థం చేసుకోవాలేమో. “మందారాలే మత్తును వదలగా” — విరియగా, వదలగా … ఏమైందీ? తొందరగా చెప్పవయ్య బాబు, టెన్షన్తో చచ్చిపోతున్నాను. కనులా — ఇక్కడ నాలుగు మాత్రలు కావాలి, కాబట్టి “కనుల” అని పాడడం కుదరదు. “కనులతడి తుడిచే ఒడిలో పసిపాపాయి చిలికే చిరునగవే” — ఇక్కడ కనులతడి తుడిచేది ఎవరు? కనులతడి తుడిచేది ఒడియా? ఒడిలో పసిపాపాయి తుడుస్తున్నాడా? లేదా, కనులతడి తుడుచుకుంటున్న కన్నతల్లి ఒడిలో పసిపాపాయి ఉందా? ఆ పసిపాపాయి చిలికే చిరునగవే, చిలికే చిరునగవులే — ఓకే! చీకటితల్లికి వేకువ అన్నది మంచి ప్రయోగమే — మాత్రలు కూడా కరక్టుగా సరిపోయాయి (4+4+4).

    ఇక చివరి చరణం విషయం:

    లేతపాపల చిరునవ్వుతోటకే దిగివస్తావా సిరులవెన్నెలా
    వీరభూమిలో సమరాలు మానితే వినిపించేనా స్వరమే కోయిలా

    మళ్ళీ పదాల విరుపు వల్ల కలిగే దోషాలు గమనించండీ. బాణీ ఇది అని గుర్తుపెట్టుకొండి.

    తాన తాననా
    తన తాన తాననా
    తన నాన తన నాన తననా

    లేత/ పాపలా/ (చివర గురువు వల్ల “లేత పాపలాగా” అన్న అర్థం మాత్రమే ధ్వనిస్తుంది)
    చిరు/నవ్వు/ తోటకే (ఓకే)
    దిగి/వస్తా/వా సిరుల/ వెన్నెలా?

    లేతపాపలా దిగివస్తావా వెన్నెల అన్నట్టుగానే వినిపిస్తుంది. తమిళంలో నిల/నెల అన్నా చంద్రుడు అన్న అర్థం. తెలుగులో వెన్నెల అని వాడినప్పుడు తోటకు దిగివస్తావా అన్నది అర్థవంతమైన మార్పు. “వా సిరుల” మళ్ళీ పంటి కింది రాయి.

    వీర/భూమిలో/
    సమ/రాలు/ మానితే
    విని/పించే/నా స్వరమే/ కొయిలా?

    మళ్ళీ పదచ్ఛేదంతో కలిగిన పాటు: “నా స్వరమే”? పదాల విరుపు తో కలిగే భంగపాట్లు లేకపోయినా “సమరాలు మానితే వినిపించేనా స్వరమే కోయిలా?” అన్నది తెలుగు వాక్యంలా ఉందా? వినగానే అర్థానుభూతి కలుగుతుందా?

    “ఇది తమిళ పాటకి అనువాదమే కాబట్టి ఆ లెక్కన తమిళ పాటా మీకు ఇలాగే ఎందుకు అనిపించలేదు?” అని అడిగారు. నేను చూపిన దోషాలు చాలా వరకు మూలంలో లేనివి. తమిళ మాతృకలో పల్లవిలో శాంతిని పంచే ఉషోదయం రానివ్వండి అన్న అభ్యర్థన ఉంది. మొదటి చరణంలో సంగీతాలు, కవిత్వాలు కాదు, కన్నీరు లేని ప్రశాంతత కావాలి అన్న అరాటం ఉంది. రెండవ చరణంలో చండ్రుడు, కోయిల, ప్రకృతి కూడా యుద్ధంలేని శాంతి వాతావరణాన్నే కోరుకుంటాయి అన్న వాదన ఉంది.

    తెలుగు పాటలో ఏ ముక్కకు ఆ ముక్క అర్థమైనట్టు అనిపించినా — మీరు వివరించాకా — ఆ భావాలనన్నింటినీ గుదిగ్రుచ్చి అందమైన భావాలమాలగా అందించే సూత్రం లేదు. నిజానికి, ఇది చాలా వేటూరి పాటలల్లో కనిపించే సమస్యే. దాని గురించి మరింకెప్పుడైనా!

    Like

  11. ఆ తెలుగుబ్లాగుల్లో యేముందీ సొల్లు,సోదీ తప్ప అంటున్న చాలమందికి చూపాల్సిన టపా ఇది.ఈ మధ్య కాలంలొ ఇంత ఆసక్తికరంగా సాగుతున్న చర్చ ఇదేనేమో.కొనసాగించండి.

    Like

  12. @Suresh Kolichala

    మీరు నన్నుగానీ, వేటూరిని గానీ కించపరిచారని నేను భావించలేదు. నా వివరణని మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్టు ఉన్నారు. నేను చెప్పినదల్లా వేటూరి పాటల్లో మంచిని ఏరుకునే ప్రయత్నం చేస్తానని మాత్రమే. వేటూరిని సమర్థించడం నా ఉద్దేశ్యం కాదు. మీరన్నట్టు వేటూరి చాలా పాటల్లో భావం అంత స్పష్టంగా ఉండదు. నా ఊహ ఏమిటంటే వేటూరి intuition తో రాస్తారు తప్ప ఆలోచన పెద్ద చేయరు. అందుకే ఆయనకి surrealism అంటే మక్కువ కావొచ్చు. పైడిపాల గారు ఒక పుస్తకంలో వేటూరిలోని ఒక లోపం – “వెనక్కి తిరిగి పాటని చూసుకోకపోవడం” అన్నారు. అంటే పాట ఒకసారి పూర్తయ్యాక, review and editing వేటూరి చెయ్యరేమో మరి. కాబట్టి ఆయన పాటలు అర్థం చేసుకోవడం కొన్ని సార్లు చాలా కష్టమౌతుంది. వేటూరి పాటని ఆస్వాదించాలంటే ఆయనలోని ఈ లోపాన్ని పట్టించుకోకూడదు (సిరివెన్నెల చెప్పినది కూడా ఇదే). ఇది అందరూ చెయ్యలేరు కనుకే, చాలా మందికి వేటూరి పాట నచ్చదు.

    మీరు పాటని చాలా చక్కగా మాత్రలతో సహా విడమర్చి చెప్పారు. మీరు రాసినది చదివితే ఎవరికైనా చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. ఇంత ఓపికగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు.

    చరణాల ఆఖరి లైను బాణి – “తన తానానా నానా నానా” అని నాకు అనిపించింది. వేటూరి కూడా ఇలా అనుకునే రాసి ఉండవచ్చు. రెహ్మాను ఎందుకు “తానానా నానా” అని పాడేటప్పుడు “తానా-నా నానా” అని కొంత విరుపిచ్చాడో తెలియదు. కలుపుతూ పాడాలిక్కడ. కాబట్టి రెహ్మాన్ దోషం ఉందనే నా అభిప్రాయం. మీరు చేసిన మార్పులు బానే ఉన్నాయ్. కానీ –

    గాలి హోరులో
    జడి వాన పాటలో
    ఒక మౌనం అందించే సుఖముందా?

    అన్నది అర్థం బాగా అవుతోంది కాని వేటూరి రాసిన మాటల్లో ఉన్న లోతు (అది అస్పష్టమైనదైనా) కనిపించట్లేదు. కొన్నిసార్లు మనం ఆలోచించి విడమరిస్తే భావం పలచబడిపోతుంది.

    పల్లవిలో మొదటి రెండు లైన్లు ఒక భావం. మిగతా నాలుగు లైన్లు మరో భావం. “తపనగా” అంటే “తపన కదా” అని నాకు అర్థమైంది. కాబట్టి మొదటి రెండు లైన్ల భావం – “మరుమల్లె పూలలో ఈ జగం వికసిస్తూ ఉండగా, ప్రతి ఉదయంలో శాంతి నేను కోరుకుంటున్నాను”. మిగతా నాలుగు లైన్ల భావం – “తెల్లవారివెలుగు భూమికి పారాణి పెడుతుండగా, మందారాలు మెల్లగా విచ్చుకుంటుండగా, బాధని కరిగించే నిదురలేచే ఒడిలోని పసిపాపల నవ్వే నిజమైన వేకువ”

    వాక్యనిర్మాణంలోని లోపాలు మీరు బాగా వివరించారు. పాటల్లో ఇది కొంత అటూ ఇటూ అవుతుంది. ముందే నేను చెప్పినట్టు వేటూరి ఎలాగూ వెనక్కి తిరిగి చూడడు కాబట్టి వేటూరి పాటల్లో ఇది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అసలు నేను వేటూరి పాటలపై బ్లాగులు రాసేది ఇందుకే – నా వివరణ ద్వారా వేటూరి పాటని కొంత ఆస్వాదయోగ్యం చేద్దామని. ఈ ప్రయత్నం ఎవరూ చెయ్యట్లేదు కాబట్టి నేను మొదలెట్టాను తప్పితే నా తెలుగుపరిజ్ఞానం అతి స్వల్పం.

    చాలా రోజుల తర్వాత ఒక మంచి చర్చ జరగడం ఆనందం కలిగిస్తోంది. నేను మిమ్మల్ని follow అయ్యి తెలుగు గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. మీకు పునః ధన్యవాదాలు.

    Like

  13. @Mouli

    ఈ పాట తమిళ సాంప్రదాయ కీర్తన. పండగలకీ వాటికీ ఆడవాళ్ళు పాడుతూ ఉంటారు. అందుకే సినిమాలో సీమంతం అప్పుడు చూపించి ఉండవచ్చు.

    కడలికి అలలకు కధకళి కలలిడు శశి కిరణము వలె చలించవా  – కడలి అలలపై వెన్నెల నాట్యమాడే దృశ్యం మనోహరంగా ఉంటుంది. వెన్నెల అలలకి కొత్త అందాన్ని ఇస్తుంది, దీనినే “కలలు ఇవ్వడం” అని కవితాత్మకంగా చెప్పారు. అలా వెన్నెల్లా వచ్చి పులకింత కలిగించవా అని భావం. నీకు “మరీ హద్దుమీరినట్టు” అనిపించిన భావం ఏమిటో నాకు తెలియదు.

    కవిత మదిని రగిలి ఆవేదనా
    ఇతర భామలకు లేని వేదనో

    ఇది వాక్యాల్లో అస్పష్టత ఉంది. “కవిత మదిని రగిలి” అంటే “కవిత యొక్క మదిలో రగిలి” అని అర్థం చేసుకుని కొత్తపాళీ గారు మొత్తం పాట భావాన్ని కవిత పరంగా అర్థం చెప్పారు. నా ఊహ ఏమిటంటే (ఇది ఇప్పుడు ఆలోచిస్తే తట్టినదే) “కవిత మదిని రగిలి ఆవేదనా” అంటే “నా మదిలో కవిత రగిలి నాకు ఆవేదన కలుగుతోంది” అని అర్థం. ఈ ఆవేదన (శ్రీ కృష్ణుడు రాసలీలలు సాగిస్తున్న) ఇతర భామలకు లేదు. కవిత అనడం ఎందుకంటే పాటలో చెప్పిన అందమైన భావాలన్నీ కవిత లాంటివి కనుక. అయితే శ్రీ కృష్ణుడు చెంతనుండుంటే ఈ కవిత ఆనందం కలిగించేది, కానీ ఇతర స్త్రీలతో ఉన్నాడు కనుక వేదన కలిగిస్తోంది.

    Like

  14. సందrbhAniki set kAనిది అన్నమయ్య కీర్తన ఐనా నేను ఒప్పుకోను…తమిళం లో పాట సాహిత్యం నాకు తెలీదు so నాcomment ఈ తెలుగు సాహిత్యానికి మాత్రమే పరిమితం చేస్తున్నాను

    అక్కాడ వెన్నెల ని అతనితో పోల్చినప్పుడూ… కడలిని ఎవరితో పోల్చినట్టు? అమ్మాయితోనే కదా? కడలి అలల కదలిక పై వెన్నెల చలించటం– అనే పోలిక నాకు కొంత వేటూరిస్మ్ అనిపిస్తుంది….

    Like

  15. చాలా బావుంది చర్చ
    శ్రీనివాస మౌళి గారు
    “చిగురు సొగసులను కలిరుటాకులకు రవికిరణాలె రచించవా”

    ఇక్కడ తలిరుటాకు అండీ. కలిరుటాకు కాదు. తలిరుటాకు అంటే చిగురాకు అని అర్థం కదా!

    మీరన్నట్టు “కవిత మదిని రగిలి ఆవేదనా” పాయింటు కరక్టే. “కవిత మదిని రేపే ఆవేదనా” అని రాసుంటే మంచి అర్థం వచ్చేదేమో!

    Like

  16. రెహ్మాన్ పాడిన పాటల్లో మంచి పాట మరుమల్లెల్లో. కాకపోతే సురేశ్ గారితో నేను ఏకీభవిస్తున్నాను. తమిళంలో ఈ పాట చాలా మధురంగా, అర్థవంతం గా ఉంటుంది.

    Like

Leave a comment