అన్నమయ్య గురించి ఎక్కువగా, అన్నమయ్య చిత్రంలో తను రాసిన పాటల గురించి తక్కువగా వివరిస్తూ వేటూరి హాసంలో రాసిన వ్యాసం ఇది. ఈ చిత్రానికి వేటూరి రాసిన పాటలు మూడే – తెలుగు పదానికి జన్మదినం, ఏలే ఏలే మరదలా, అస్మదీయ మగటిమి (అప్పట్లో ఆడియో కేసెట్‌తో పాటూ ఇచ్చిన రంగుల పాటల పుస్తకంలో "ఫాలనేత్రానల" అన్న అన్నమాచార్య కీర్తన కూడా వేటూరి రచనే అని తప్పుగా పేర్కొన్నారు).
అన్నమయ్య ప్రయోగాలపై వేటూరికి ఉన్న అవగాహన వలనే "ఏలే ఏలే మరదలా" పాటని అంత సమర్థవంతంగా రాయగలిగారని ఈ వ్యాసం చదివితే అనిపిస్తుంది (ఈ పాటకి ప్రేరణ ఏదో అన్నమయ్య కీర్తన ఉన్నట్టు గుర్తు, ఏమిటో మీకు తెలిస్తే చెప్పగలరు. అలాగే "వేణువై వచ్చాను భువనానికి" అన్న పాటకి ప్రేరణ కూడా).
"అస్మదీయ మగటిమి" పాట పానకంలో పుడకని అప్పట్లో కొందరు విమర్శించారు. అసలు సినిమాలో సాళవనరసింహరాయలు పాత్రే సరిగా చిత్రించలేదని వేటూరే ఈ వ్యాసంలో – "బాక్సాఫీస్ సూత్రాలకి, అన్నమయ్య చిత్రానికి మధ్యపడి నలిగింది" అనడం ద్వారా ఒప్పుకున్నారు. ఈ పాటని సినిమానుండీ విడదీసి ఒక శృంగార గీతంగా భావిస్తే చాలా మంచి రచనే అని అనిపిస్తుంది నాకు.
ఇక తెలుగుపదానికి జన్మదినం పాట గురించి చెప్పేదేముంది?
ఈ వ్యాసాన్ని ఇక్కడ చదవండి – http://goo.gl/Pmx4w