అమృత సినిమా శ్రీలంకలోని తమిళుల ఆవేదనకి అద్దం పట్టిన సినిమా. తమ సొంత గూటి నుంచి వలసి వచ్చి, భయంతో బిక్కుబిక్కుమంటూ, శాంతినీ, సుఖాన్నీ కోల్పొయినవాళ్ళ దయనీయ పరిస్థితిని మణిరత్నం అద్భుతంగా ఆవిష్కరించాడు. రోజూ హింసా, రక్తపాతాల నడుమ నలిగిపొతున్న జీవితంలో ఏదో ఒక రోజు శాంతిని పంచే ఉషోదయం రావాలని అభిలషిస్తూ ఒక కవి పాడే గీతమే “మరుమల్లెల్లో” అనే పాట. సినిమానుంచి తీసి చూస్తే శాంతిని కాంక్షించే ఒక చక్కని భావగీతంలా కనిపిస్తుంది.
తమిళ గీతరచయిత వైరముత్తుకి జాతీయ అవార్డ్ తెచ్చి పెట్టిన ఈ సినిమా పాటలు తెలుగులో వేటూరి రాశారు. వేటూరి అనువాదాలు జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం బోధపడుతుంది – తమిళ భావం మాత్రమే ఆయన తీసుకుని తెలుగు చేస్తారు, కొన్ని సార్లు మారుస్తారు కూడా, అంతే కానీ మక్కికిమక్కీ దించరు. ఈ పాటకి అదే ఆయన చేశారు. వేటూరి అనువాదాల్లో ఉండే క్లిష్టత ఈ పాటలో కనిపించదు. ఈ చక్కని పాట గురించి క్లుప్తంగా –
మరుమల్లెల్లో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
పారాణేదో భుమికి వెలుగుగా
మందారాలే మత్తును వదలగా
కనుల తడి తుడిచే ఒడిలో పసి పాపాయి
చిలికే చిరునగవే చీకటితల్లికి వేకువ
శాంతి నిండిన జగాన ఉదయం ఎంత మనోహరంగా ఉంటుందో కవి ఊహిస్తున్నాడు. “పారాణి, మందారాలు” – ఇవి వేటూరి పెట్టిన తెలుగింటి సందెదీపాలు. పసి పాపలు హాయిగా నవ్వినప్పుడే నిజమైన వేకువ అంటూ, “చీకటితల్లి” అని వాడడం ఎంత గొప్ప ప్రయోగం!
గాలిపాటల జడివాన జావళి, అది మౌనంలా మధురం అవునా?
వేలమాటలే వివరించ లేనిది, తడి కన్నుల్లా అర్థం, అవునా?
రెహ్మాన్ పదాలు సరిగ్గా పాడకుండా మింగెయ్యడంతో ఈ చరణం ఎవరికీ అర్థం కాకుండా పోయింది. సరే చూద్దాం. “జడివాన జావళి” – ఆహా ఇదో వేటూరి చమత్కారం. ఈ జడివాన జావళి ఎంత బాగున్నా మౌనం అంత ఆనందం కలిగించదు అంటున్నాడు. అలాగే తడి కన్నులు ఇట్టే చెప్పగలిగే విషయాన్ని వేలమాటలు వివరించలేవన్నాడు. ఈ రెండు వాక్యాలకీ అర్థం ఎవరికి వారు తమ అంతరంగమౌనంలో తెలుసుకోవలసిందే కానీ నేను వివరించలేను.
లేతపాపల చిరునవ్వుతోటకే దిగివస్తావా సిరులవెన్నెలా
వీరభూమిలో సమరాలు మానితే వినిపించేనా స్వరమే కోయిలా
“లేతపాపల చిరునవ్వుతోట” అనడం ఎంత కవిత్వం! పసిపాపలు హాయిగా నవ్విన నవ్వుల్లో వెన్నెల కురుస్తుందని ఎంత బాగా చెప్పారు. యుద్ధాలు మానిన రోజు కోయిల స్వరాలు వినిపిస్తాయ్ అంటున్నాడు.
ఈ పాటని రెహ్మాన్ గొప్పగా స్వరిపరిచాడు. మనసులోతులు తాకుతుందీ స్వరరచన. గొప్ప సాహిత్యం తోడైన ఈ పాట టీవిలో, పేపర్లో ఎప్పుడు తీవ్రమైన హింస గురించి చదివినా నా మనసులో మెదులుతూ ఉంటుంది, పెదవిపై పలుకుతూ ఉంటుంది.