సిందూరపు పూదోట

చాలా కాలం క్రితం నాగార్జున హీరోగా కిల్లర్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాని అందరూ మర్చిపోయినా, ఆ సినిమాలో “ప్రియా ప్రియతమా రాగాలు” పాటనీ, బేబీ షామిలీ నటననీ గుర్తుంచుకునే ఉంటారు. సినిమాలో పాటలు అన్నీ రాసినది వేటూరి. రాసిన పాటల్లో ఎన్నదగిన “సిందూరపు పూదోటలో” అనే పాట సినిమాతో పాటూ మరుగున పడిపోయింది. ఈ చక్కని పాటని పరిచయం చెయ్యడం ఈ వ్యాసం ఉద్దేశం.

ఈ పాట సినిమా చివరలో వస్తుంది. కథ ప్రకారం ఈశ్వర్ అనే పేరు గల హీరో, professional killer. ఎంతో ఆస్తికి వారసురాలై, జాగ్రత్తగా పెంచబడుతున్న, బేబీ షామిలిని చంపడం కోసం కోటలాంటి వాళ్ళ ఇంటిలోకి ప్రవేశిస్తాడు. చివరకి తనకీ ఆ పాపకీ రక్త సంబంధం అని తెలుసుకోడం, పశ్చాత్తాపపడడం, సంహరించాలనుకున్న పాపనే పరిరక్షించడం, దుష్టులని శిక్షించడం – ఇదీ కథ. ఈ పాట అతనికి పశ్చాత్తాపం కలిగినప్పుడు పాడేది. SPB, జానకి కలిసి పాడిన ఈ పాట ఒక అద్భుతమైన హమ్మింగ్ తో మొదలవుతుంది. పాట పల్లవి ఇది:

సిందూరపు పూదోటలో చిన్నారి ఓ పాపా
ఏ పాపమో ఆ తోటలో వేసిందిలే పాగా
ఏమని నే పాడనులే
ప్రేమకు తానోడెనులే
ఆ కథ ఎందుకులే

క్లుప్తత వేటూరి రచనా లక్షణం. మొత్తం సినిమా కథని పల్లవిలో ఇలా నాలుగు ముక్కల్లో చెప్పెయ్యడం సులువు అనిపించొచ్చు గానీ, అస్సలు కాదని పాటలు రాసే  వాళ్ళకి తెలుస్తుంది. గొప్ప రచయితలు అది సులువు అనిపించేలా రాస్తారు అంతే. “పూదోటలో చిన్నారి పాప” అని రాయడం ద్వారా ఒక లాలిత్యాన్ని చూపించారు వేటూరి. “పాపం ఆ తోటలో పాగా వేసింది” అని ఆ పాపం చేసిన వాడే పాడడం అతని పశ్చాత్తాపానికి సూచన. “పాప” కి “పాగా” అని ప్రాస వెయ్యడం నవ్యం. “ఏమని నే పాడను” అనడం హీరో మనస్థితినీ, పరిస్థితిని చూపిస్తుంటే, “ఆ కథ ఎందుకు” అనడం హీరో తన గతాన్ని చీదరించుకుని, మరిచిపోడానికి, మారడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్తోంది.

ఇప్పుడు చరణంలోకి వద్దాం:

కనులే కథలల్లే కనుపాపే నా బొమ్మగా
మనసే తెరతీసె పసిపాపే మా అమ్మగా

ఇప్పటి దాకా హీరో తన కళ్ళు చూపింది చూశాడు, చెప్పింది చేశాడు. కానీ కళ్ళు మోసం చేస్తాయి, దారి తప్పిస్తాయి. తనకీ ఒక మనసు ఉందనీ అతనికి తెలియదు ఇన్నాళ్ళూ. ఈ పసిపాప ఒక అమ్మగా మారి తనకే తెలియని తన మనసుని తెరతీసి చూపించింది. “మనసే తెరతీసె పసిపాపే మా అమ్మగా” అన్నది గొప్ప వాక్యం.

రగులు పగలు కాసే చల్లని వెన్నెల కాగా
చిలక పలకగానే గూటికి గుండెలు మోగ

ఇన్నాళ్ళు తన లోకంగా ఉన్న అక్రమాలూ, హత్యలూ, రగిలే పగలూ పోయి, అనుబంధాలూ బాంధవ్యాలతో నిండిన ఒక చల్లని వెన్నెల అతని జీవితంలో ప్రవేశించింది. అవును మరి, చిలక తడిమితే గూటికి గుండెలు పలకకుండా, మనసు కరగకుండా ఉంటుందా? “చిలక పలకగానే గూటికి గుండెలు మోగ” అన్నది అద్భుతమైన వాక్యం. ఈ లైన్ దగ్గర ఇళయరాజా ట్యూన్, బాలూ గానం, వేటూరి సాహిత్యం మూడూ కలిసి నాలో పాట విన్న ప్రతిసారీ ఎంతో స్పందనని కలిగిస్తాయి. ఈ లైన్ ఒక్కటి చాలు ఈ మొత్తం పాటకి అనిపిస్తుంది.

విధి చదరంగంలో విష రణరంగంలో
గెలవలేని ఆటే ఎన్నడు పాడని పాట

విధి చిత్రమైనది. లేకుంటె తను చంపాలనుకున్న పాపే పాశమై మనసుని చుట్టుకోడం ఏమిటి? ఇన్నాళ్ళ విష రణరంగంలో తను ఓడిపోయి మనిషిగా ఇప్పుడిప్పుడే గెలుస్తున్న నిమిషంలో పుట్టిన “ఎన్నడూ పాడని పాట” ఇది.

పాపకి సంరక్షకురాలిగా ఉన్న శారద హీరోని క్షమంచానని చెబుతూ, అతనిని సముదాయిస్తూ రెండో చరణం పాడుతుంది. ఇప్పటి దాకా బాలూ తన గాత్రంతో అలరిస్తే ఇప్పుడు జానకి గారు తన గానంతో మనని కదిలిస్తారు.

రాబందే కాదా ఆ రామయ్యకు బంధువు
సీతమ్మను విరహాలే దాటించిన సేతువు

రామాయణంలో జటాయువు సీతమ్మ వారి జాడని రామునికి తెలియజేసిన కీలక ఘటనని ప్రస్తుత కథతో ముడిపెట్టడం నిజానికి అంత అతకకపోయినా, హిరోతో నువ్వు నిజానికి మంచివాడివే, పరిస్థితుల ప్రభావం వల్ల ఇలా అయ్యావ్, ఇప్పుడు మమ్మల్ని కాపాడే ఉపకారిగా మారబోతున్నవ్ అని చెప్పడానికి పై వాక్యాలు చక్కగా సరిపోతాయ్. “సీతమ్మను విరహాలే దాటించిన సేతువు” అనడం how poetic!

కోవెల చేరిన దీపం దేవుడి హారతి కాదా
చీకటి మూగిన చోటే వేకువ వెన్నెల రాదా

దీపం అంతకు ముందు అందరినీ కాల్చే మంటే కావొచ్చు, దేవుడి గుడికి చేరాక మాత్రం వెలిగే హారతే. ఇక్కడ “దీపాన్ని” వాడం ద్వారా అజ్ఞానపు తెరనీ, అది కరిగించే జ్ఞాన జ్యోతిని, వేటూరి సూచిస్తున్నారు అనిపిస్తోంది నాకు. నిన్న మాకు ప్రమాదమైన నువ్వే ఇప్పుడు మా రక్షణవి అని చెప్పడానికి, వెలుగూ చీకటీ కలిసే ఉంటాయ్, బాధపడకు అనే positive attitude ప్రబోధించడానికి “చీకటి మూగిన చోటే వేకువ వెన్నెల రాదా” అని రాయడం బాగుంది.

ఈతడు మా తోడై ఈశ్వరుడే తానై
కలిసి ఉంటే చాలు వేయి వసంతాలు

ఇప్పుడు నువ్వు మాకు కోటగా మారి దుష్ట శిక్షణ చెయ్యి. తర్వాత మనం హాయిగా ఉంటాం అని చెప్పడం ఇక్కడ చూడొచ్చు. సినిమాలో “ఈశ్వర్” అన్న హీరో పేరుని లయకారుడైన ఈశ్వరుడితో ముడిపెట్టడం వేటూరి brilliance కి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.

మొత్తంగా చూస్తే ఈ పాట gem of a lyric కాకపోవచ్చు కానీ, చక్కని సాహిత్యం అని ఒప్పుకోక తప్పదు. సినిమా సందర్భాన్ని స్పృశిస్తూ, తన భావాలని పలికించుకోడం ఎలాగో ఔత్సాహిక సినీ గీత రచయితలకు ఇలాటి పాటలు స్టడీ చేస్తే తెలుస్తుంది. నిజానికి సిరివెన్నెల ఇలాటి పాటలు రాయడంలో సుప్రసిద్ధులు. వేటూరి కూడా ఇలాటి సందర్భ శుద్ధీ, thought continuity కలిగిన పాటలు చాలా రాశారని చెప్పడానికి ఈ పాట ఉపకరిస్తుంది.

పాట పూర్తి పాఠం ఇది:
సిందూరపు పూదోటలో చిన్నారి ఓ పాపా
ఏ పాపమో ఆ తోటలో వేసిందిలే పాగా
ఏమని నే పాడనులే
ప్రేమకు తానోడెనులే
ఆ కథ ఎందుకులే

కనులే కథలల్లే కనుపాపే నా బొమ్మగా
మనసే తెరతీసె పసిపాపే మా అమ్మగా
రగులు పగలు కాసే చల్లని వెన్నెల కాగా
చిలక పలకగానే గూటికి గుండెలు మోగ
విధి చదరంగంలో విష రణరంగంలో
గెలవలేని ఆటే ఎన్నడు పాడని పాట

రాబందే కాదా ఆ రామయ్యకు బంధువు
సీతమ్మను విరహాలే దాటించిన సేతువు
కోవెల చేరిన దీపం దేవుడి హారతి కాదా
చీకటి మూగిన చోటే వేకువ వెన్నెల రాదా
ఈతడు మా తోడై ఈశ్వరుడే తానై
కలిసి ఉంటే చాలు వేయి వసంతాలు

సిందూరపు పూదోటలో చిన్నారి ఓ పాపా
పాపానికే మా తోటలో లేదందిలే జాగా
ఏమని నే పాడనులే
ప్రేమకు తానోడెనులే