సౌలభ్యం కోసం ఈ పాట పూర్తి సాహిత్యం కింద ఇస్తున్నాను:
సాకీ:
జీవనవాహినీ పావనీ
కలియుగమున కల్పతరువు నీడ నీవని
కనులు తుడుచు కామధేను తోడు నీవని
వరములిచ్చి భయముతీర్చి శుభముకూర్చు గంగాదేవి
నిను కొలిచిన చాలునమ్మ సకల లోకపావనీ
భువిని తడిపి దివిగ మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రి
పల్లవి:
గలగలగల గంగోత్రి హిమగిరిజని హరిపుత్రి
పసుపు కుంకుమతో
పాలు పన్నీటితో
శ్రీగంధపు ధారతో
పంచామృతాలతో
అంగాంగం తడుపుతూ
దోషాలను కడుగుతూ
గంగోత్రికి జరుపుతున్న
అభ్యంగన స్నానం
చరణం 1:
మంచు కొండలో ఒక కొండవాగుగా
ఇల జననమొందిన విరజావాహిని
విష్ణుచరణమే తన పుట్టినిల్లుగా
శివగిరికి చేరిన సురగంగ నీవని
అత్తింటికి సిరులనొసగు అలకనందవై
సగరకులము కాపాడిన భాగీరధివై
బదరీవన హృషీకేశ హరిద్వార ప్రయాగముల
మణికర్ణిక తనలోపల వెలసిన శ్రీవారణాసి గంగోత్రి
|| గలగలగల గంగోత్రి హిమగిరిజని హరిపుత్రి ||
అమ్మా గంగమ్మా
కృష్ణమ్మకి చెప్పమ్మా
కష్టం కలిగించొద్దని…
యమునకి చెప్పమ్మా
సాయమునకి వెనకాడొద్దని…
గోదారికి కావేరికి
ఏటికి సెలయేటికి
కురిసేటి జడివానకి
దూకే జలపాతానికి
నీ తోబుట్టువులందరికీ
చెప్పమ్మా మా గంగమ్మా
చరణం 2:
జీవనదివిగా ఒక మోక్షనిధివిగా
పండ్లుపూలుపసుపుల పారాణిరాణిగా
శివునిజటలనే తన నాట్యజతులుగా
జలకమాడు సతులకు సౌభాగ్యదాత్రిగా
గండాలను పాపాలను కడిగివేయగా
ముక్తినదిని మూడుమునకలే చాలుగా
జలదీవెన తలకుపోసె జననీ గంగాభవాని
ఆమె అండ మంచుకొండ వాడని సిగపూదండ
|| గలగలగల గంగోత్రి హిమగిరిజని హరిపుత్రి ||