ఆమని పాడవే హాయిగా

చిత్రం: గీతాంజలి
రచన: వేటూరి
సంగీతం: ఇళయరాజా
గానం: బాలు

పల్లవి: ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూవులా రాగాలతో పూసేటి పూవులా గంధాలతో
మంచు తాకి కోయిల మౌనమైన వేళల

1. వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే రచించెలే మరీచికా
పదాల నా యద స్వరాల సంపద
తరాల నా కధ క్షణాలదే కదా
గతించి పోవు గాధ నేనని

2. శుకాలతో పికాలతో ధ్వనించిన మధూదయం
దివీ భువీ కలా నిజం స్పృశించిన మహోదయం
మరో ప్రపంచమే మరింత చేరువై
నివాళి కోరిన ఉగాది వేళలో

ఈ పాట చాలా popular song. నేను చాలా సార్లు విన్నా, నాకెందుకో ఈ పాట భావం పూర్తిగా కొరుకుడు పడలేదు. ఏదో నిరాశ నిండిన hero పాడుకునే పాట అనుకునే వాడిని. అయితే ఈ మధ్యే వేటూరి ఒక చోట తను ఈ పాట రాయడానికి “మధుమతి” సినిమాలో ముఖేష్ పాడిన “సుహానా సఫర్ ఔర్ ఏ మౌసం హసీ” పాట (lyrics: shailendra, music: salil chowdary) ప్రేరణ అన్నారు. ఈ శైలేంద్ర అంటే వేటూరికి చాలా అభిమానం. ఆయనని మహాకవి అని కీర్తించారు. ఆ మధుమతి సినిమాలో పాట ఆశ నిండిన వసంత గీతం కాబట్టి, ఈ పాటకి ఇప్పుడు కొత్త అర్థం ఆలోచించాల్సి వచ్చింది. అలా ఆలోచిస్తే తోచిన భావం ఇక్కడ రాస్తున్నాను.

మనకి పల్లవి లోనే మంచు రుతువు వచ్చినా, కోకిల మూగబోయినా, ఓ వసంతమా కోకిల బదులు నువ్వే పాడుకో అనడం కనిపిస్తుంది. అలాగే రాలేటి పూవుల రాగలతో పాడుకోమనీ, పూసేటి పూవుల గంధాలతో పాడుకోమనీ చెప్పడమూ కనిపిస్తుంది. అంటే సుఖమైనా, దుఃఖమైనా పాట ఆపకూ అని. పాట మొదటి చరణంలో నిరాశలో ఉన్నా ఎలా పాడుకోవచ్చో, రెండో చరణంలో ఆశాగీతాలాపన ఎలా చెయ్యొచ్చో విశదీకరించడం జరిగింది.

Hero “వయస్సులో ఉన్న వసంతం” లాంటి వాడు. ఎంతో హాయిగా, ఉత్సాహంగా, ప్రకాశిస్తున్న ఆ వసంతానికి, ఒక మరీచిక (ఎండ మావి) ఎదురయ్యింది. మరీచిక అంటేనే ఒక “బ్రాంతి”. ఆ “బ్రాంతి” ఎందుకు కలిగింది? మనసులో నిరాశ వల్ల. Hero అనుకుంటున్నాడు: మనసులో నిరాశ వల్ల ఈ అశాంతీ, బ్రాంతీ కలుగుతోంది గానీ, నిజానికి నాకేమయ్యింది ఇప్పుడు? ఉన్నన్నాళ్ళు ఆనందంగా గడిపాను (పదాల నా యద, స్వరాల సంపద). నా ఈ కథ క్షణంలో గతించి పోవచ్చు గాక, అయితే యేం? ఈ విషయం తెలిసి కూడా హాయిగా పాడుకోలేనా? (గతించి పోవు గాథ నేననీ, ఆమనీ పాడవే హాయిగా!!)

రెండో చరణంలో మళ్ళీ వసంత పునారాగమనం గురించి అద్భుతమైన వర్ణన కనిపిస్తుంది. ఎంత చక్కటి భాష వాడతారో వేటూరి ఇక్కడ. ఈ చరణంలో సినిమా కథ పరంగా కూడా అన్వయించుకోవచ్చు. ముందు ముందు heroine hero జీవితంలో ప్రవేశించి ఒక గొప్ప మహోదయాన్ని చూపిస్తుంది. అదొక అద్భుత అనుభూతి! ఎన్నో జన్మల కలలు నిజమయ్యి నట్టు, దివీ భువీ కలిసినట్టు అనిపించే ఆ మరో ప్రపంచానికి తెర తీసే ఆమని ఆ heroine ఏ కదా! ఆ ప్రేమలో ఆ ఇద్దరి ప్రణయ జీవులదీ, గతించి పోని గాధే కదా!! See the perspective change: ఇంతకు ముందే గతించి పోతే పోయాను, అయినా హాయిగా పాడుకుంటాను అన్న hero, ఇప్పుడు అసలు గతించి పోనే పోను అంటున్నాడు. ఇదొక కొత్త ఆవిష్కరణ అతనికి. ప్రేమ ద్వారా జీవించడం లో ఉన్న అద్భుతాన్ని తెలుసుకున్న వాళ్ళకి ఇలాగే అనిపిస్తుంది, అనిపించాలి! ఈ సినిమా theme అదే.

అలోచించిన కొద్దీ ఈ పాటలో కొత్త అర్థాలు స్ఫురిస్తాయి. అదే రచయితగా వేటూరి గొప్పతనం!