కొమ్మ కొమ్మకో సన్నాయి

కొన్ని పాటలు వింటుంటే “ఆహా! ఎంత బాగా రాశాడు కవి” అనిపిస్తుంది. ఈ మంచి పాటల్లో కొన్ని, సినిమా పరిధిని దాటి మన దైనందిన జీవితంలో ఎదురయ్యే సందర్భాలకి కూడా అన్వయిస్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయే పాట అలాంటిదే. “గోరింటాకు” సినిమాలోని ఈ పాట రచన “వేటూరి”. భావానికి తగ్గ సంగీతం అందించినది “స్వర బ్రహ్మ” మహదేవన్.

పాట సందర్భం ప్రేమ సంఘర్షణ గురించి. అబ్బాయి అటు ప్రేమకి ఇటు బాధ్యతకి మధ్య నలుగుతూ ఉంటాడు. అయితే అమ్మాయి, మనసు పంచుకుని ప్రేమించుకోవచ్చు కదా అనుకుంటుంది. ఇలా రెండు భిన్న మనస్తత్త్వాలని ఆవిష్కరించే పాట ఇది. అయితే పాటలో ఈ సంఘర్షణని  philosophical  గా వర్ణించడంతో మనం రోజూ ఎదురుకునే అనేక సంఘర్షణలని ఈ పాటలో చూస్తాం . ముఖ్యంగా పాట రెండో చరణం నాకెన్నో సందర్భాల్లో గుర్తొస్తూ ఉంటుంది. మీరు కూడా ఆ చరణాన్ని మీ జీవితంలోని ఏదో సంఘటనతో తప్పకుండా అన్వయించుకోగలుగుతారు. ఒకసారి చదివి చూడండి!

నోట్ : కొంత హాస్యం , నాటకీయత జోడించి రాయడం వల్ల, నా విశ్లేషణ సినిమా కథానాయకుల మనస్థితిని “ఖచ్చితంగా” ఆవిష్కరించలేదని సినిమా చూసిన వాళ్ళు గ్రహించగలరు!

అమ్మాయి:
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
ఎందుకీ మౌనం ?
ఏమిటీ ధ్యానం ?

అబ్బాయి:
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
మనసులో ధ్యానం !
మాటలో మౌనం !!

కొమ్మ కొమ్మకో సన్నాయితో ఇన్ని రాగాలూ, అందాలూ, ఆనందాలు నీ చుట్టూ ఉంటే వాటిని ఆస్వాదించకుండా ఈ మౌనం ఏమిటని అమ్మాయి ప్రశ్న. ఈ ప్రశ్నలోనే తన మనస్తత్త్వం ఇమిడి ఉంది. జీవితం గురించి తెగ  serious  గా ఆలోచించక, హాయిగా ప్రతి నిమిషాన్నీ గడిపేసే నైజం ఆ అమ్మాయిది. అయితే మన అబ్బాయిగారు అలాటి వాడు కాదు. మనసులో సుదీర్ఘంగా అలోచిస్తూ ఉంటాడు అన్ని విషయాల గురించీ! ఏ విషయం గురించో ఆలోచిస్తున్నాను కాబట్టే మౌనంగా మాట్లాడకుండా ఉన్నాను అంటాడు.

అమ్మాయి: మనసు మాటకందని నాడు మథురమైన పాటవుతుంది !
అబ్బాయి: మథురమైన వేదనలోనే పాటకి పల్లవి పుడుతుంది !!

అతను తన ప్రేమ గురించే ఆలోచిస్తున్నాడని ఆమెకి తెలుసు. మనం సాధారణంగా మన భావాలని మాటల ద్వారా చెబుతాం. అయితే చెప్పాల్సిన విషయం మన మనసుని కదిలించి, గుండె స్పందనగా బయటకి వచ్చినప్పుడు అది “పాట” అవుతుంది. ఇక్కడ పాట అంటే లలితంగా, ప్రియంగా, హత్తుకునేటట్టు చెప్పబడిన మాటగా అన్వయించుకోవాలి. మన హీరో “పెదవివిప్పి పాట అవ్వొచ్చు కదా!” అని అమ్మాయి భావన. అయితే గుండెలోంచి బయటకి ఉబికివచ్చే ప్రతి “పాట” వెనుకా గాఢమైన సంఘర్షణ ఉండి తీరుతుంది. అది మనం ఇష్టపడేది కాబట్టి “తియ్యనిది” అవుతుంది. ఈ “తియ్యటి వేదన” ఒకటి ఉంటుందనీ, ఆ స్థితిలో తను ఉన్నాననీ గుర్తుచేస్తాడు మన హీరో.

అమ్మాయి: పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు
అబ్బాయి: పసితనాల తొలి వేకువలో ముసురుకున్న మబ్బులు చూడు
అందుకే ధ్యానం , అందుకే మౌనం !

ఆ అమ్మాయి కొనసాగిస్తుంది. ప్రేమా, మమతా ఏ వయసులో అయినా బాగుంటాయి. అయితే అప్పుడే వచ్చిన పడుచుదనంతో (పల్లవించు పడుచుదనం ) నిండిన మమతల ప్రత్యేకతే వేరు. ఈ వయసులోని ప్రేమ భావనని అనుభవించిన వాళ్ళకి ఆ మాధుర్యం తెలుస్తుంది (నాకూ తెలుసండోయ్ )!! కాబట్టి, “నీపై నా ఇష్టాన్నీ, ప్రేమనీ చూడలేవా?” అని అబ్బాయిని అడుగుతోంది అమ్మాయి. అబ్బాయికీ హీరోయిన్ పై ఇష్టం ఉంది, అయితే ఏ బాధ్యతో ఉండడం వల్ల సందేహిస్తున్నాడు. ఈ విషయాన్నే చెబుతాడు. ఇక్కడ “పసితనాల తొలివేకువ” అన్న ప్రయోగం గమనించ దగినది. “అప్పుడే చిగురిస్తున్న” (పసితనాల) ప్రేమోదయన్ని పూర్తిగా కనబడనీయకుండా పరుచుకున్న సందేహాల మబ్బులని అబ్బాయి ప్రస్తావిస్తున్నాడు. ఎలాగైతేనే ఆ అమ్మాయి అంటే తనకూ ఇష్టం ఉందని  indirect  గా అయినా ఒప్పుకున్నాడు!

అమ్మాయి: కొంటె వయసు కోరికలాగ గోదారి ఉరకలు చూడు
అబ్బాయి: ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు

హమ్మయ్యా! అబ్బాయికి తనంటే ఇష్టం ఉందని ఇప్పుడు అమ్మాయికి తెలిసింది. ఇక తను అబ్బాయికి చెప్పాల్సినదల్లా “సందేహాలు అన్నీ కట్టి పెట్టి, కాస్త తెగువ చూపి ,   ప్రేమలో దూకు మహాశయా!” అనే. అందుకే గోదారిని చూపించి అలా ముందుకి ఉరకాలి సుమా అంటోంది. అబ్బాయి తక్కువ తిన్నాడా? తను గోదారిని కాను, గోదారిలో పడవను అంటాడు. కాబట్టి ఒడ్డుకీ, నదికీ మధ్య ఊగిసలాడుతున్నాను అని మళ్ళీ పాత పాటే ఎత్తుకుంటాడు.

అమ్మాయి: ఒడ్డుతోనొ నీటితోనో పడవ ముడి పడి ఉండాలి !
అబ్బాయి: ఎప్పుడేముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి !!
అందుకే ధ్యానం , అందుకే మౌనం !

ఎంత సేపని ఈ ఊగిసలాటలు? అటో ఇటో తేల్చుకోవాలి కదా! అమ్మాయికి విసుగొచ్చిందోఏమో, “ఒడ్డో నీరో తేల్చుకో మహానుభావా” అంటుంది! పాపం మన హీరో గారు ఏమి చెయ్యగలరు? ముందు ఏముందో ఎవరికి తెలుసు? మనసై ఉండేది, మమతై పండేది ఏమో ఏ బంధమో కాలమే చెప్పగలదు కదా! కాబట్టి సూటిగా సమాధానం చెప్పలేక “ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక? ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగక” అని “సిరిసిరిమువ్వ” పాట అందుకుంటాడన్న మాట!!

ఈ పాట తేలిక పదాలతో, చాలా సరళంగా ఉన్నట్టు అనిపిస్తూనే గాఢమైన అర్థాన్ని కలిగి ఉంటుంది. నిజానికి ఈ పాటని తాత్త్వికంగా విశ్లేషించొచ్చు కూడా! ఏది ఏమైనా, వేటూరి ప్రతిభకి అద్దం పట్టే పాట ఇది. “ఆత్రేయ” రాశారని చాలామంది అనుకునే ఈ పాట, నిజానికి ఆత్రేయదిలా అనిపించే వేటూరి రచన.

ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, ఈ పాటలో లాంటి సన్నివేశమే “నువ్వు నాకు నచ్చావ్ ” సినిమాలో “సిరివెన్నెల” వారికి వచ్చింది. అప్పుడు పుట్టిన పాట “ఒక్కసారి చెప్పలేవా” కూడా ఒక గొప్ప రచన. అయితే ఈ సందర్భంలో హీరో గారు (వెంకటేష్ ) మన “శోభన్ బాబు” గారిలా కాకుండా ముందే  decide  అయిపోతాడు. తన నిర్ణయాన్ని చాలా చక్కగా సమర్థించుకుంటాడు కూడా.

ఈ రెండు పాటలనీ పక్క పక్కన పెట్టి వినడం ఒక చక్కని అనుభూతి. ఇద్దరు గొప్ప కవులు తమ ప్రతిభాపాటవాలని సినీమాధ్యమం ద్వారా ఎంత అద్భుతంగా అవిష్కరించగలరో తెలుస్తుంది. ఇలాంటి పాటలు విన్నప్పుడల్లా “జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః” అని భర్తృహరిలా నమస్సులు అర్పించడం తప్ప ఏమి చెయ్యగలం ?