కడలి అలలకు అలుపు లేదులే

ఓ అందమైన అమ్మాయి, పేరు హేమ. ఆ అమ్మాయిని తన పాటతో మురిపించి, పెళ్ళి దాకా నడిపించాలనుకునే అబ్బాయి. “నువ్వు పదాలు చెప్పు, నేను పాట పాడతాను” అన్నాడు అమ్మాయితో. ఇంకేం ఓ చక్కని పాట పుట్టింది. అసంపూర్ణంగా మిగిలిపోయిన ఓ “ఉషాకిరణ్ మూవీస్” సంస్థకి చెందిన చిత్రానికి వేటూరి రాసిన పాట ఇది. ఎస్పీబీ స్వరకల్పనలో, ఎస్పీబీ, జానకి ఎంతో చలాకిగా పాడారు.

“కడలి కలలకు అలుపు లేదు, కనుల కలలకు అదుపు లేదు” అని మొదలెట్టడం ద్వారా అబ్బాయి వెల్లువెత్తిన తన ప్రేమనీ, ఆ ప్రేమని గెలిపించుకోవడం కోసం తాను అలుపెరుగక ప్రయత్నిస్తూనే ఉంటాననీ చెప్తున్నాడు! తర్వాత “అన్నం-చారు”  పదాలు వాడి వేటూరి చమత్కారంగా అన్నమయ్య పాట విని ఉప్పొంగిన చారుశీల అలమేలుమంగనీ, పులకిస్తున్న సప్తగిరులనీ వర్ణించాడు! మరి వేంకటేశ్వరుడి సంగతేమిటి? ఈ ఏర్పాటు అంతా ఆయనదే కదా మరి! శ్రీసతిని వేంకటేశ్వరుడు చూసుకున్నంత మురిపెంగా, వైభవంగా నిన్నూ నేను చూసుకుంటాను అన్న సూచన!

ఆకాశం-కైలాసం పదాలకి చెప్పిన వాక్యాలు చాలా కవితాత్మకంగా ఉన్నాయి. ఉదయ సంధ్యవేళ ఆ అమ్మాయి చరణాలని ముద్దాడే అరుణ కిరణాల దివ్యసౌందర్యాన్ని తిలకించాలని ఆకాశం ఇలకి దిగివస్తోందట! తామిద్దరూ ప్రేమని పండించుకుని, హృదయమనే గుడిలో సంధ్యాదీపాన్ని వెలిగించుకుంటే కైలాసం తలవంచి సాక్షాత్కరిస్తుందట! ఈ అతిశయోక్తులన్నీ విని ఆ అమ్మాయి “చాలు బాబూ ఈ ప్రేమ సుత్తి (హేమరింగ్)” అని తలపట్టుకుంటుంది. నా “ప్రేమరింగు” అందుకునే దాకా నీకీ పోరు తప్పదూ అంటాడు అబ్బాయి. “నీ హేమరింగే నాకివ్వరాదా” అని కూడా అంటాడు. ఇక్కడ మరి వేటూరి “హేమ”-రింగు అని అమ్మాయి పేరుతో చమత్కారం చేశాడో లేక “నీ గోలంతా ప్రేమగా భర్తనై భరిస్తా” అనే అర్థంలో వాడాడో!

రెండో చరణం ముచ్చటగా ఉంది. కాకి-కోకిల, దారం-దూరం వంటి పదాలను గమత్తుగా వేటూరి వాడాడు. “ప్రేమ వలనే మోక్షం సిద్ధిస్తుంది” అనే అర్థంలో వాడిన “మమకారమొకటే మనిషికున్న మోక్షతీరం” వాక్యం చాలా చక్కనైనదీ, లోతైనదీ! పాపం అబ్బాయి ఇలా తన భావుకతతో ప్రేమ బాణాలు వేస్తున్నా ఆ అమ్మాయికి బొత్తిగా కవితాసక్తి ఉన్నట్టు లేదు! “ఏమిటీ నస” అంటుంది! నస కాదు ప్రేమ పనస అంటాడు మన అబ్బాయి. పనస పండంత తియ్యనైన ప్రేమగోల ఇది మరి! “పనస” అంటే సంస్కృతంలో వేదభాగం అనే అర్థమూ ఉంది కనుక, వేదమంత్రం లాంటి నా ప్రేమ గీతాన్ని వినలేవా, విని శుభమస్తు అనలేవా (మాటతో కాకపోయినా కనీసం చూపుతో!) అనే చమత్కారమూ చేశాడు వేటూరి.

సినిమాలో అమ్మాయి ఒప్పుకుందో లేదో తెలియదు కానీ, అమాయకత్వం, ఆరాధనా నిండిన అబ్బాయి ప్రేమగీతానికి పొంగి శ్రోతలు మాత్రం వారు కలవాలని ఓటేస్తారు!

పల్లవి

అమ్మాయి: అలలు – కలలు

అబ్బాయి: కడలి అలలకు అలుపు లేదులే

అమ్మాయి: ఆహా!

అబ్బాయి: కనుల కలలకు అదుపు లేదులే

అమ్మాయి: పర్వాలేదే! అన్నం – చారు!

అబ్బాయి: అన్నమయ్య పదములు పాడగ

చారుశీల శ్రీసతి పొంగగ

సప్తగిరుల శిఖరాలూగెలే!

సప్తస్వరాలే ఊయలై!

అమ్మాయి: వెరీ గుడ్! వన్స్ మోర్!

|| కడలి అలలకు ||

 

చరణం 1

అమ్మాయి: ఆకాశం – కైలాసం

అబ్బాయి:  ఆకాశమే ఇలనంటదా

అమ్మాయి: పాపం!

అబ్బాయి: కైలాసమే తలవంచదా

అమ్మాయి: అలాగేం! ఇప్పుడు నువ్వు తలవంచుతావ్! చరణం-కిరణం!

అబ్బాయి: అయబాబోయ్!

చరణాల ఒడిలో అరుణకిరణం ఆడుతుంటే

హృదయాల గుడిలో సాంధ్యదీపం వెలుగుతుంటే

అమ్మాయి: హేమరింగ్ అంటే ఇదే!

అబ్బాయి: ఈ హేమరింగే నాకివ్వరాదా

అమ్మాయి: ఎందుకూ?

అబ్బాయి: నా ప్రేమరింగూ నీవందుకోవా

అమ్మాయి: ఆశ!

అబ్బాయి: నే వేచి ఉన్నా ప్రేమలా!

అమ్మాయి: ఉపయోగం లేదు నాయనా!

|| కడలి అలలకు ||

 

చరణం 2

అమ్మాయి: కాకీ – కోకిల

అబ్బాయి: ఈ కోకిలే నాకుండగా

ఏకాకిలా నేనుండనా!

అమ్మాయి: దారం-దూరం, కారం-తీరం!

అబ్బాయి: పూలల్లో దారం జన్మబంధం కాకు దూరం!

మమకారమంటే మనిషికున్న మోక్షతీరం!!

అమ్మాయి: ఏమిటి నస! ఇందుకా తీసుకొచ్చావ్!

అబ్బాయి: నస కాదు హేమా, ఇది ప్రేమ పనస

అమ్మాయి: హయ్!

అబ్బాయి: వినవేల మనసా నా వేద పనస

అమ్మాయి: ఓయ్!

అబ్బాయి: శుభమస్తు అనవా చూపుతో!

అమ్మాయి: ఇక విరమిద్దూ, అలిసిపోయావు!

|| కడలి అలలకు ||

(తొలి ప్రచురణ వేటూరి వెబ్సైటులో. పాట ఆడియో కూడా అక్కడ ఉంది)