రెహ్మానుకి వేటూరి అందం!

ఈ జనవరి 6 న యాభై ఏళ్ళు పూర్తిచేసుకున్న ఏ. ఆర్. రెహ్మాన్ ఎందరో సంగీతాభిమానుల గుండెల్లో స్థిరనివాసం ఏర్పరుచుకుని తనదైన చరిత్ర సృష్టించుకున్నారు. తెలుగు పాటని పునర్నిర్వచించిన పాటల రచయితగా తెలుగుని ప్రేమించే వారి గుండెల్లో శాశ్వత స్థానాన్ని పొందిన వేటూరి జయంతి కూడా జనవరిలోనే (జనవరి 29). ఈ సందర్భంగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కొన్ని చక్కని పాటలని గుర్తుచేసుకుందాం.

వేటూరికి సంగీత దర్శకుడు రెహ్మాన్ తో సన్నిహితమైన అనుబంధం ఉందని చాలా మందికి తెలియదు. రెహ్మాన్ దిలీప్‌గా రాజ్-కోటి వంటి సంగీతదర్శకుల వద్ద సహాయకుడిగా ఉన్న రోజులనుంచే వారి పరిచయం మొదలైంది. ఒకసారి వేటూరి రెహ్మాన్‌కి ఎవరి గురించో చెప్తూ, “ఆయన పక్కా జంటిల్మేన్!” అన్నారుట. రెహ్మాన్‌కి ఈ ఎక్ష్ప్రెషన్ చాలా నచ్చి, “గురూజీ, ఇది ఏదైనా పాటలో వాడండి!” అని అడగడం “సూపర్ పోలిస్” సినిమాలో వేటూరి “పక్కా జంటిల్మేన్ ని, చుట్టపక్కాలే లేనోణ్ణి, పట్టు పక్కే వేసి చక్కా వస్తావా?” అని పల్లవించి ఆ కోరిక తీర్చడం జరిగింది. ఇలా వారిద్దరి స్వర-పద మైత్రి గొప్పది! కొత్తపుంతలు తొక్కుతున్న రెహ్మాన్ సంగీతానికి తానూ గమ్మత్తైన తెలుగు పదాలను పొదిగానని వేటూరి “కొమ్మ కొమ్మకో సన్నాయి” లో చెప్పుకున్నారు! అలా పుట్టినవే “విదియా తదియా వైనాలు”, “జంటతోకల సుందరి” వంటి ప్రయోగాలు!

రెహ్మాన్ పాటలని తెలుగులో వినడం కష్టం అనీ, లిరిక్స్ చెత్తగా ఉంటాయనీ, కాబట్టి తెలుగు గీతరచయితలకి (వేటూరితో సహా!) ఓ దణ్ణం పెట్టి, హిందీనో తమిళాన్నో నమ్ముకోవడం మంచిదనే అభిప్రాయం ఒకటి ఉంది! ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఇది ముఖ్యంగా రెహ్మాన్ డబ్బింగ్ సినిమాలతో వచ్చే చిక్కు. “సూపర్ పోలీస్”, “గ్యాంగ్ మాస్టర్”, “నాని” వంటి రెహ్మాన్ తెలుగు సినిమాల్లో ఈ సమస్య అంత కనిపించదు. అయితే రెహ్మాన్ – వేటూరి కాంబినేషన్‌లో చాలా చక్కని డబ్బింగ్ పాటలూ ఉన్నాయి. కాస్త శ్రద్ధపెట్టి వింటే సాహిత్యాన్ని బాగా ఆస్వాదించొచ్చు. వేటూరిని స్మరించుకుంటూ, రెహ్మాన్ కి అభినందనలు తెలుపుకుంటూ మచ్చుకి ఓ మూడు పాటలు చూద్దాం!

మేఘాలు గాయపడితే మెరుపల్లే నవ్వుకుంటాయ్!

వేటూరి డబ్బింగ్ పాటలని కూడా గాఢత, కవిత్వం కలిగిన తనదైన శైలిలో రాశారు. బొంబాయి సినిమాలో “పూలకుంది కొమ్మ, పాపకుంది అమ్మ” అనే పల్లవితో వచ్చే పాటలో చాలా స్పందింపజేసే భావాలు ఉన్నాయి. పెద్దలనీ, సమాజాన్నీ ఎదిరించి పెళ్ళి చేసుకున్న యువజంట, తమ జీవితాన్ని ప్రేమతో, ఆశావహ దృక్పథంతో ఎలా దిద్దుకున్నారో వివరించే పాట ఇది. పాట మొదట్లోనే వచ్చే ముద్దొచ్చే వాక్యం –

నింగీ నేలా డీడిక్కి, నీకూ నాకూ ఈడెక్కి!

ఇది నేలనీ ఆకాశాన్నీ కలిపే ప్రణయతరంగమై ఎగసిన ఆ పడుచుజంట హృదయస్పందనని ఆవిష్కరించే వాక్యం. “డీడిక్కి” అనే పదం వాడడం, దానికి “ఈడెక్కి”తో ప్రాస చెయ్యడం అన్నది వేటూరిజం! సినిమా సందర్భంలో తన శ్రీమతి గర్భవతి అయ్యిందన్న ఆనందంలో ఆ భర్త ఉంటాడు కనుక పసిపిల్లలకి వాడే “డీడిక్కి” అనే పదాన్ని వేటూరి వాడారు!

గుండెలో ఆనందం, తలపులో ఉత్సాహం నిండినప్పుడు జీవితం ఎలా ఉన్నా గొప్పగానే అనిపిస్తుంది. ఆ జంట అచ్చంగా ఇలాగే ఉన్నారు. పువ్వులు నవ్వు లేకుండా దిగులుగా ఉండవు, ఎగిరే గువ్వలు కన్నీళ్ళు పెట్టుకోవు అని చెబుతూ “సూర్యుడికి రాత్రి తెలీదు” అంటూ వచ్చే భావం గొప్పగా ఉంటుంది –

పున్నాగ పూలకేల దిగులు?
మిన్నేటి పక్షికేది కంటి జల్లు?
రవి ఎన్నడూ రాత్రి చూడలేదు
స్వర్గానికి హద్దూ పొద్దూ లేనే లేదు

జీవితమనే ప్రయాణం సుఖవంతంగా ఉండాలంటే లగేజీ తగ్గించుకోవాలి. “ఓటమి బరువు” మోసుకుంటూ వెళ్ళినవాళ్ళకి బ్రతుకంతా తరగని మోతే! మేఘాలు సైతం ఢీకొని గాయపడ్డాక మెరుపులా గలగలా నవ్వేసుకుని చకచకా సాగిపోవట్లేదూ? ఎంత బావుంటుందో ఈ ఎక్స్ప్రెషన్!

కవ్వించాలి కళ్ళు, కన్నెమబ్బు నీళ్ళు
మేఘాలు గాయపడితే మెరుపల్లెయ్ నవ్వుకుంటాయ్
ఓటమిని తీసెయ్ జీవితాన్ని మోసెయ్
వేదాలు జాతిమత భేదాలు లేవన్నాయ్

ఈ పాటలో వచ్చే ఇంకా కొన్ని లైనులు చాలా బావుంటాయి. “ఎగరెయ్యి రెక్కలు కట్టి ఎదనింక తారల్లోకి” అనడంలో కవిత్వం, ఆశావహ దృక్పథం కనిపిస్తాయి. “అనురాగం నీలో ఉంటే ఆకాశం నీకు మొక్కు!” అనడం ఎంత గొప్ప భావం! ప్రేమమూర్తులకు ప్రకృతి సమస్తం ప్రణతులర్పించదూ?

 

విరబూసెను విరజాజే ఏ మంత్రం వేశావో!

ఇద్దరు సినిమా అనగానే “శశివదనే” పాట చప్పున గుర్తుకు వస్తుంది. కానీ అదే సినిమాలో ఉన్న “పూనగవే పూలది” పాట కూడా ఆణిముత్యమే. ఎంతో సున్నితంగా, అందంగా, స్త్రీలకి మాత్రమే సాధ్యమయ్యేలా ఒక అమ్మాయి తన మౌన ప్రణయారాధనని నివేదించుకునే పాట! పల్లవిలో వినిపించే పదాలు ఎంతో లలితంగా, ట్యూన్‌కీ భావానికి తగ్గట్టు ఉంటాయి –

పూనగవే పూలది
లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ, నీ కౌగిలి పూజకి!

“మౌనంగా కౌగిలి పూజకి నవ్వడం” – ఎంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్! సుమబాల నవ్వునీ, సెలయేటి పాటనీ, (బైటపడలేని) చినదాని మౌన ప్రేమనీ గమనించే పురుషుడు ధన్యుడు!

ఇంతకీ ఆ అమ్మాయికి తను ప్రేమలో పడ్డానని ఎలా తెలిసింది? అతను చెంత ఉన్నప్పుడు విరబూసిన విరజాజై తన కన్నెతనం గుబాళించినప్పుడు, చేమంతుల పూరేకులు ప్రేమలేఖలై అతన్నే గుర్తుచేసినప్పుడు! ఎంత కవిత్వం! ఇంత ప్రేమ తనలో ఉన్నా గ్రహించని ప్రియునికి అభ్యర్ధనగా “ఒక్క సారి నన్ను చూడు, నువ్వే ఉసురై (ప్రాణమై) నా అణువణువూ నిండి ఉన్నావని తెలియక పోదు” అని జాలిగా అడగడం కదిలిస్తుంది –

విరబూసెను విరజాజే ఏ మంత్రం వేశావో
చేమంతుల నీడలలో తెలుసుకుంటి నీ వలపే
ఒకనాడైనా శోధించవా అణువణువు ఉసురవుతాలే!

“నాలోని తీయని అనుభూతులన్నీ నీ వల్లనే!” అనడం నుంచి, “నువ్వు లేక నేను లేను” అంటూ తనలోని ప్రేమ తీవ్రతని కూడా ఎంతో అందంగా వ్యక్తీకరించడం రెండో చరణంలో కనిపిస్తుంది. తమిళ భావాన్ని ఎంత అందంగా వేటూరి తెలుగు చేశారో ఇక్కడ. “తొలిదిశకు తిలకమెలా” అనడంలో శబ్దంపై వేటూరి పట్టు తెలుస్తుంది. ఈ వాక్యమనే కాదు, మొత్తం పాటలోనే ఎంతో శబ్దసౌందర్యం కనిపిస్తుంది!

నీలవర్ణం సెలవంటే ఆకసమే గాలి కదా?
సూర్యుడినే వేకువ విడితే తొలిదిశకు తిలకమెలా
నన్నికపై విడిచావా నా ఉసురిక నిలవదులే

ఈ పాటని యూట్యూబులో చూడొచ్చు (50:30 నుంచి) – 

వానొస్తే నీవే దిక్కు!

దాశరథి రంగాచార్య గారు ఓ వ్యాసంలో ఒక అందమైన ఉర్దూ షాయరీ గురించి చెప్పారు. ఇద్దరు ప్రేయసీ ప్రియులు రాత్రి రహస్యంగా కలుస్తారు. బైట వర్షం పడుతోంది. ప్రియుడు వర్షంలోకి వెళ్ళి తడిసి ఆనందిద్దామంటాడు. మగవాళ్ళింతే! ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆడవాళ్ళకి స్పృహ ఉంటుంది కాస్త! సరసానికి గోప్యం ఉండద్దూ? అందుకే ప్రియురాలు అంటుంది – “వర్షం వర్షం అంటావ్. ఏముంది అక్కడ? నా కళ్ళలోకి చూడు – నీలి మేఘం ఉంది, మెరుపు ఉంది, తడి ఉంది. హాయిగా నా కళ్ళల్లో కొలువుండు! ఎంతమందికి ఈ అదృష్టం వస్తుంది?”

వేటూరికి (లేదా తమిళ రచయితకి) ఈ కవిత తెలుసో లేదో కానీ, రిథం సినిమాలోని “గాలే నా వాకిటకొచ్చె” పాట మొదటి చరణంలో పంక్తులు విన్నప్పుడల్లా ఆ ఉర్దూ కవితే గుర్తొస్తుంది నాకు!

అతడు: ఆషాఢ మాసం వచ్చి వానొస్తే నీవే దిక్కు
నీ ఓణీ గొడుగే పడతావా?
ఆమె: అమ్మో నాకొకటే మైకం అనువైన చెలిమే స్వర్గం
కన్నుల్లో క్షణమే నిలిపేవా?

ఈ పాటలో “గాలిని” ప్రేమగా వర్ణిస్తాడు కవి. గాలి మెల్లగా వచ్చి తలుపు తట్టిందిట. “ఎవరోయ్ నువ్వు?” అంటే “నేను ప్రేమని!” అందిట. “ఆహా! మరి నిన్నామొన్నా ఎక్కడున్నావ్? ఇన్నాళ్ళూ ఏమయ్యావ్?” అని అడిగితే – “నీ శ్వాసై ఉన్నది ఎవరనుకున్నావ్, నేనే!” అందిట. ఇదో చమత్కారం!

గాలే నా వాకిటకొచ్చె, మెల్లంగా తలుపే తెరిచె
ఐతే మరి పేరేదన్నా, లవ్వే అవునా?
నీవూ నిన్నెక్కడ ఉన్నావ్, గాలీ అది చెప్పాలంటే
శ్వాసై నువు నాలో ఉన్నావ్ అమ్మీ అవునా?

తెమ్మెరలా హాయిగా సాగే ఈ ప్రేమపాటలో రెండో చరణంలో చక్కని శృంగారం కనిపిస్తుంది. ప్రియురాలు ముత్యంలా పదిలంగా దాచుకున్న సొగసుని పరికిస్తూ తన్మయుడై ఉబ్బితబ్బిబైపోతున్న ప్రియుని మనస్థితికి “ఎద నిండా మథనం జరిగినదే!” అంటూ ఎంత చక్కని అక్షరరూపం ఇస్తారో వేటూరి!

ఆమె: చిరకాలం చిప్పల్లోన వన్నెలు చిలికే ముత్యం వలెనే
నా వయసే తొణికిసలాడినదే!
అతడు: తెరచాటు నీ పరువాల తెరతీసే శోధనలో
ఎదనిండా మథనం జరిగినదే!

ఈ చరణం చివరలోనే వేటూరి చిలిపితనాన్ని చూపెట్టే ఓ రెండు వాక్యాలు ఉంటాయి. ఆ వాక్యాలని ఎవరికి వారు అర్థం చేసుకుని ఆనందించాల్సిందే, వివరిస్తే బాగుండదు!

అతడు: కిర్రుమంచమడిగె కుర్ర ఊయలంటే సరియా సఖియా?
ఆమె: చిన్నపిల్లలై మనం కుర్ర ఆటలాడితే వయసా వరసా!

దైవపదం – దివ్యపదం

“బొంబాయి” చిత్రంలోని “అరబిక్ కడలందం” పాటలో లైను ఇది:

అందం దాని మతం అంతే లేని విధం, అయ్యో దివ్యపదమో!

తమిళ పాటలో “దైవపదం” అని ఉంటుంది. మరి వేటూరి దానిని “దివ్యపదం” అని ఎందుకు మార్చాడు? అది సంస్కృతపదమే, లిప్-సింక్ కోసం అలాగే వదిలెయ్యొచ్చు కదా! “ఎందుకంటే వేటూరి భక్తుడు కనుక!” అన్నాడు సోదరుడు సందీప్. “దివ్య, దైవ రెండూ పదాలకీ మూలం ఒకటే అయినా, “దివ్యము” అంటే స్వర్గానికి సంబంధించినదని వ్యవహారార్థం. ప్రియురాలితో సరససల్లాపాలు ఎంత తియ్యగా ఉన్నా ఆ అనుభవం “దేవుని సన్నిధి” (దైవపదం) లా ఉందని భక్తుడు ఎవడూ అనడు! అది “స్వర్గంలా” ఉందని (దివ్యపదం) అనొచ్చు కావాలంటే. అందుకే దివ్యపదం అన్నాడు వేటూరి, దైవపదం అనకుండా!”

దటీజ్ వేటూరి!

కన్నానులే, కలయికలు ఏనాడు ఆగవులే!

రెహ్మాన్ పాటల్లో నాకు ఎంతో ఇష్టమైన పాట “బొంబాయి” చిత్రంలోని “కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే అన్నది. నా దృష్టిలో ఇది వేటూరి రాసిన గొప్ప పాటల్లో ఒకటి. కానీ చిత్రంగా ఈ పాట సాహిత్యం చాలా అపార్థాలకి దారితీసింది. ఓ మూడు సంఘటనలు చెప్తాను. 

  1. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మా కాలేజీ ఫంక్షన్‌లో ఓ అమ్మాయి ఈ పాట తమిళ్‌లో పాడుతూ ఉంటే నా వెనుక కూర్చున్న ఇద్దరు కుర్రాళ్ళు ఆ అమ్మాయి గురించి కామెంట్ వేస్తూ చులకనగా అన్న మాటలు –  “తెలుగులో పాడితే పాటలోని బూతులు తెలిసిపోతాయని తమిళ్‌లో పాడుతోందిరా!”. సినిమాలో కొత్తగా పెళ్ళైన స్నేహితురాలిని సరసంగా ఆటపట్టిస్తూ అమ్మాయిలు పాడే లైన్లు ఈ పాటకి కోరస్‌గా వస్తాయి. “మామకొడుకు రాతిరికొస్తే వదలకు రేచుక్కో!” వంటి వాక్యాల వల్ల కాబోలు ఇది “బూతు పాట” గా తీర్మానించారు నా వెనుకసీటు అబ్బాయిలు! ఇది పూర్తిగా తప్పు! నిజానికి పాటలోని అంశానికీ ఈ కోరస్‌కి సంబంధం లేదు. అందుకే ప్రస్తుత వ్యాసంలో కోరస్ ని చర్చించకుండా వదిలేస్తున్నాను.
  2. కోరస్ శృంగారపరంగా ఉంది కాబట్టి పాట కూడా శృంగార గీతమే అని చాలామంది పొరబడతారు. నేను చెన్నై I.I.T.లో చదివే రోజుల్లో ఏటా జరిగే సంగీత ఉత్సవం “సారంగ్” లో ఒక అమ్మాయి ఈ పాటని తమిళ్‌లో చాలా ఫీల్ అయ్యి హావభావాలతో శృంగార తాదాత్మ్యంతో పాడింది. సాహిత్యంలో కొన్ని వాక్యాలు శృంగారంతో ఉండడం వల్ల కాబోలు ఆ అమ్మాయి ఈ పాటని శృంగార గీతం అనుకుంది. కానీ నా దృష్టిలో ఇది శృంగార గీతం కాదు. ఒక ముస్లిం అమ్మాయి, ఒక హిందూ అబ్బాయిపై పడ్డప్పుడు తనలో తాను ఎదుర్కొనే సంఘర్షణ ఈ పాట. సామాజిక కట్టుబాట్లకి తలొగ్గాలా, ప్రేమ వైపు ఒగ్గాలా అన్న ఆలోచన సరదా విషయం కాదు, తీవ్రమైనది. ప్రేమలో పడిన ఆ అమ్మాయి తనని తాను అద్దంలో చూసుకుంటూ తనలోని భావాలన్నిటినీ (ప్రేమా, శృంగారం, విరహం, శోకం వగైరా) నిజాయితీగా పరామర్శించుకునే సీరియస్ పాట ఇది! అందుకే గాయని చిత్ర ఈ పాటలోని “జారె జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం” అని పాడేటప్పుడు నవ్వే నవ్వు రసభంగంగా అనిపిస్తుంది నాకు!
  3. చాలా రోజుల వరకూ నాకీ పాటలోని కొన్ని లైన్లు అర్థమయ్యేవి కావు. ఓ రోజు “పాడుతా తీయగా” చూస్తుంటే ఎవరో ఈ పాట పాడారు. SPB ఈ పాట సాహిత్యం గురించి వివరిస్తాడేమో అని నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాను. తీరా చూస్తే SPB, “ఏమిటో! వేటూరి ఇష్టం వచ్చినట్టు పదాలు కూర్చేశాడు. నాకో ముక్క అర్థం కాలేదు!” అని తేల్చేశాడు! వేటూరి అర్థంపర్థం లేని పాటలు రాసిన మాట నిజమే కానీ మంచి సంగీతం, సందర్భం కుదిరినప్పుడు మనకి అర్థం కాకపోయినా ఆయన అర్థవంతంగానే రాస్తాడు అని నా నమ్మకం. కొంచెం పరిశ్రమిస్తే ఈ పాట నాకు బాగానే అర్థమైంది. చాలా గొప్పగా ఉందనిపించింది. నాకు అర్థమైనది మీతో పంచుకోవాలనే ఈ వ్యాసం!

 పల్లవిలోనే కనిపించే కవిత్వం, పాటంతా తర్వాత దట్టంగా పరుచుకుంటుంది – 

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే

నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే

అందాల వయసేదొ తెలితామరై, విరబూసె వలపేదో నాలో

నీ పేరు నా పేరు తెలుసా మరీ, హృదయాల కథ మారె నీలో

వలపందుకే కలిపేనులే, ఒడిచేరె వయసెన్నడో

 

ఈ ప్రేమ “తొలిచూపు ప్రేమ”, హృదయాలను సూటిగా తాకిన ప్రేమ. అందుకే “తొలిచూపు కలయికలు” అంతటితో ఆగిపోవు అంటోంది. ఆ అబ్బాయికి తనపైగల ఆరాధన అమ్మాయికి చెప్పకనే తెలిసిపోయింది! మగవాడి కళ్ళలోని భావాలని (నీ కళ్ళలో పలికినవి…) ఆడవాళ్ళు ఇట్టే పసిగట్టగలుగుతారు – అది ప్రేమ అయినా, కాంక్ష అయినా! కాబట్టి ఇద్దరూ ఒకే స్థితిలో ఉన్నారు. తెల్లని తామరలా విరిసిన ఆమె వయసుకి సుగంధంలా దరిచేరిందీ ప్రేమ! ఎవరెవరో తెలియకపోయినా అతని హృదయం గల్లంతైంది! ఊరూ, పేరూ, వివరాలు తెలుసుకుని ప్రేమించేది ప్రేమవ్వదు! వయసు వచ్చి చేరాకా, వలపు గుండె తట్టాకా, ఝల్లుమనని జన్మ ఉంటుందా? 

ఉరికే కసివయసుకు శాంతం శాంతం తగిలితె తడబడె అందం

జారె జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం

అందం తొలికెరటం; చిత్తం తొణికిసలై నీటి మెరుపాయె

చిత్తం చిరుదీపం; రెపరెప రూపం తుళ్ళి పడసాగె

పసి చినుకే ఇగురు సుమా, మూగిరేగే దావాగ్ని పుడితే

మూగె నా గుండెలో నీలి మంట 

ఉరికే వయసుని ప్రేమ చల్లగా తాకింది. కానీ దాని వల్ల కుదురు రాకపోగా తడబాటు పెరిగింది. ఏదో కొత్త ధైర్యం కూడా వచ్చింది. అందుకే ప్రాయం కోసం, ప్రణయం కోసం పరదాని కొంచెం పక్కకి జరిపే చొరవొచ్చి చేరింది. “అందం తడబడింది” అన్న అందమైన ప్రయోగం వేటూరిలోని కవిని చూపెడుతోంది. అమ్మాయి పెరిగిన మహమ్మదీయ వాతావరణాన్ని సూచించడానికి “పరదా” అని వాడాడు. 

ప్రేమలో పడ్డాక, అందం తొలికెరటమై ఉప్పొంగింది. తీయని ఊహల్లో తుళ్ళే మనసు ఆ కెరటానికి నీటి మెరుపులా అమరింది! ఎంత అందమైన ఊహ! అయితే వాస్తవంలోకి వస్తే ఈ ప్రేమ ఫలించడం ఎంత కష్టమో తెలిసి అదే మనసు సంఘర్షణకి గురౌతోంది.  అది ఎలా ఉందంటే గాలికి రెపరెపలాడుతున్న దీపం లాగ! ఇలా మనసు ఊగిసలాటని పాజిటివ్‌గా నెగిటివ్‌గా రెండు అద్భుతమైన ఉపమానాలతో చెప్పాడు. వెంటనే ఇంకో అందమైన ఉపమానం – గుండెలో నీలిమంట మూగిందట, తానొక పసిచినుకట, ఆ నీలిమంట దావాగ్నిలా మారితే ఆ పసిచినుకు గతేం కానూ? అని ప్రశ్న. ఇక్కడ మంట శృంగారపరమైన ప్రతీక కావొచ్చు, లేదా వేదనా/సంఘర్షణా కావొచ్చు. “మూగె నా గుండెలో నీలిమంట..” అని అర్థోక్తిలో వదిలెయ్యడం మంచి ఫీల్ ఇచ్చింది. ఈ మూడు ఉపమానాలనీ మనం ఇంకొన్ని విధాలుగా కూడా అన్వయించుకోవచ్చు, అదే ఇక్కడి అందం. 

శ్రుతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలలూగింది నీలో

తొలిపొంగుల్లొ దాగిన తాపం తాపం సయ్యాటలాడింది నాలో

ఎంత మైమరపో ఇన్ని ఊహల్లో తెల్లారె రేయల్లే

ఎడబాటనుకో ఎర్రమల్లెలో తేనీరు కన్నీరే

ఇది నిజమా కల నిజమా, గిల్లుకున్న జన్మనడిగా

నీ నమాజుల్లో ఓనమాలు మరిచా 

మొదటి చరణంలో ఆ అమ్మాయి తన అనుభూతినీ, పరిస్థితినీ వివరిస్తే రెండో చరణంలో “ఎందుకు ఇలా అయ్యింది”, “ఇప్పుడేం చెయ్యాలి” అన్న ఆలోచన కనిపిస్తుంది. ప్రేమ భావం ఎందుకు ఇంత తీవ్రంగా ఉంది అంటే – వయసు ప్రభావం అని సమాధానం! వయసు మాయలాడి, జగత్కిలాడి! అది అబ్బాయిని శ్రుతి మించి ఉయ్యాలలూగిస్తే, అమ్మాయిని గిలిగింతలు పెట్టి తాపాన్ని ఎగదోస్తోంది! ఈ తీయని ఊహల మైమరపులో, పగలు కూడా రేయిలా మారుతోందట. “తెల్లారె రేయల్లే” అన్న ప్రయోగం ఎంత చక్కగా ఉందో! అదే సమయంలో ఒకవేళ వియోగమే వస్తే బ్రతుకు విఫలమే కదా అన్న స్పృహ కలుగుతోంది. దీనిని “ఎర్రమల్లెల్లో తేనీరు కన్నీరవ్వడం” అన్నాడు! ఎంత కవిత్వం అండి. ప్రస్తుత మాధుర్యం పూలలో తేనె అయితే ప్రేమ వైఫల్యం రాలే పూల కన్నీరే కదా! “ఎర్రమల్లెలు” అంటే “ఎరుపు రంగులో ఉన్న ఓ రకం మల్లెలు” అన్న అర్థం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ “ఎరుపు” ని రక్తం/వేదనకీ లేక సిగ్గు/శృంగారానికి సూచికగా వాడినట్టు అనిపిస్తోంది. వేటూరి పాటల్లో తవ్వుకున్న వారికి తగినంత నీరు!

పాటని ముగించే ఆఖరి లైన్లు నాకు చాలా ఇష్టం. తరచి చూస్తే ఇదంతా కలా నిజమా అని ఆ అమ్మాయికి అనిపిస్తోంది. లేకపోతే తానేమిటి ఇలా అయిపోవడం ఏమిటి? ఈ ప్రేమని జయించి తీరకపోతే బ్రతుకు వృథా అనిపించేంత మాయ ఎలా జరిగింది? స్పృహలో ఉన్నామా కలలో ఉన్నామా తేల్చుకోడానికి చేతిని గిల్లి చూసుకుంటాం. అయితే ఆ అమ్మాయి తన బ్రతుకుని గిల్లి అడిగిందట! “గిల్లుకున్న జన్మనడిగా” – ఎంత అద్భుతమైన ప్రయోగం! ఇంకా ఈ తీయని ఊహల మైమరపులో భాషనే మరిచిపోయిందిట! ఈ భావాన్ని కూడా ఎంత అద్భుతంగా చెప్పాడండి – “నీ నమాజుల్లో ఓనమాలు మరిచా”. “నమాజు” అనడం ద్వారా అమ్మాయి ముస్లిం అన్న విషయం గుర్తు చేస్తూ, తనది కేవలం తీయని ఊహ కాదు, ఓ ఆరాధన, ఓ ప్రార్థన అని తెలియజేస్తున్నాడు! ఓనమాలు – అంటే అక్షరాలు అనే కాదు, “ఓం నమః” ని గుర్తుచెయ్యడం ద్వారా అబ్బాయి హైందత్వాన్ని కూడా స్ఫురింపజెయ్యడం. అంటే ఈ మతాల వైషమ్యాలు మరిచి, ఈ అడ్డుగోడలు దాటి ప్రేమని సాధించుకుందాం అని చెప్పడం! ఈ రెండు వాక్యాలకీ వేటూరికి దణ్ణం పెట్టొచ్చు అనిపిస్తుంది నాకు!

ఒక్కసారి ఈ పాటలో వాడిన ఉపమానాలు, పదచిత్రాలు అన్నీ ఊహించుకుంటూ ఈ పాట సాహిత్యాన్ని మళ్ళీ చదవండి. ఎంత గొప్ప సాహిత్యమో తెలుస్తుంది. నిజానికి ఇది డబ్బింగ్ పాట. తమిళ కవి వైరముత్తుకి కొంత క్రెడిట్ దక్కాలి. అయితే పాట తమిళ సాహిత్య అనువాదం చూస్తే వేటూరి తనదైన ఊపమానాలు, ప్రయోగాలు చేస్తూ అనుసృజన చేసాడు కానీ, అనువాదం చెయ్యలేదని తెలుస్తుంది. పైగా డబ్బింగ్ పాటల్లో సైతం చక్కని భాషా, చిక్కని కవిత్వం పలికించడం వేటూరికే తెలిసిన విద్య! వేటూరి గొప్ప డబ్బింగ్ పాటల రచయిత కాకపోవచ్చు కానీ, డబ్బింగ్ పాటలకి కూడా గొప్పతనం దక్కేలా చాలా మంచి రచనలు చేసాడనడానికి ఈ పాటే ఉదాహరణ!

(తొలి ప్రచురణ వేటూరి వెబ్సైటులో)