“పుచ్చా పువ్వుల విచ్చే తావుల” పాట గురించి వేటూరి

వేటూరి హాసం పత్రికలో “కొమ్మకొమ్మకో సన్నాయి” శీర్షికన కొన్ని వ్యాసాలు రాశారు. తర్వాత ఈ వ్యాసాలు అదే పేరుతో పుస్తకంగా వచ్చాయి (అయితే హాసంలో వేటూరి రాసిన కొన్ని వ్యాసాలు పుస్తకంలో లేవు). గంగోత్రి సినిమాలోని “గలగలగల గంగోత్రి” పాట వివరణతో మొదలుపెట్టిన వేటూరి, మరికొన్ని గీతాలనూ వివరించారు. అయితే ఓ 3-4 సంచికల తర్వాత ఎందుకో తన గీతాల గురించి ఇక రాయడం మానేసి సినీప్రముఖులపై తన అభిప్రాయాలనీ, అనుబంధాన్ని గురించి రాయసాగారు. అది జూన్ సంచికైతే ఆ నెలలో పుట్టిన ఓ ప్రముఖుని గురించి రాయడం, ఇలా సాగింది. నా వరకూ అయితే వేటూరి పాటల గురించి రాస్తేనే ఎంతో ఆసక్తిగా ఉండేది, అయినా ఏం చేస్తాం పత్రికకు సంపాదకులూ, ఎడిటర్లూ ఉంటారు కదా, వారు నిర్దేశించిన పథంలో సాగాలి మరి!

వేటూరి హాసం వ్యాసాల్లో తన పాటల గురించి రాసుకున్న వ్యాసాలని నేను స్కాన్ చేసి సినీసాహితీ అభిమానులకోసం వారం వారం అందించే ప్రయత్నం చేస్తున్నాను. “కొమ్మకొమ్మకో సన్నాయి” పుస్తకంలో లేని కొన్ని వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ వారం “మనోహరం” చిత్రంలోని “పుచ్చా పువ్వుల” అనే పాట గురించి వేటూరి రాసిన సమగ్ర వ్యాసం.

స్వయంగా వేటూరి వారే తన పాట గురించి వివరిస్తుండగా మధ్యలో నా గోల అనవసరమే. అయితే ఉబలాటం కొద్దీ కొన్ని విషయాలు పంచుకుంటాను –

  1. వేటూరి ఈ పాటని తన “గాలి పాటల్లో” ఒకటంటారు. గాలి పాటకే ఇంత ఘుమఘుమ ఉంటే మరిక ఏమనాలి? పైగా ఈ పాట బాణీ వేటూరిదే అన్నది మరో విషయం.
  2. వేటూరికి ఉన్న గొప్ప విషయపరిజ్ఞానం ఈ వ్యాసంలో కనిపిస్తుంది. కవికి, అదీ సినిమా కవికి, కొంత ప్రతిభా, పదసంపదా ఉంటే చాలా, లేక అన్ని విషయాలపై కొంత సమగ్ర అవగాహన ఉండాలా అని ఒక ప్రశ్న. ఎక్కువ తెలుసుకుంటే ఆ తెలుసుకున్న దాన్లోనే పడి తిరగడం తప్ప సృజనాత్మకతకి పెద్ద స్థానం ఉండదని కొందరి అభిప్రాయం. ఇందులో కొంత నిజం లేకపోలేదు. అయితే దీనర్థం ఏమీ తెలుసుకోకూడదనీ కాదు. రెంటినీ బ్యాలన్స్ చెయ్యడం ఎలాగో వేటూరి వంటి వారు ఎలాగూ దారి చూపించారు.
  3. వచనంలో కూడా వేటూరి దిట్టని ఈ వ్యాసం మళ్ళీ నిరూపిస్తుంది. ప్రకృతి వర్ణన ఎంతో రమణీయంగా చేశారు.
  4. ఈ పాటని అనుభూతి చెందాలి. ఆ భావంలో నిమగ్నమవ్వాలి. పల్లెలూ, ప్రకృతి సౌందర్యాలతో అంతగా పరిచయం లేని నాబోటి వారు ఊహల్లోనే ఈ పాటని ఎంతో కొంత మరి అనుభూతి చెందాలి. అందుకే వేటూరి గర్వంగా ఈ అద్భుతచిత్రాలన్నీ దర్శించిన జన్మ నాది అని చాటుకున్నారు. అవును వేటూరి గారూ, మీరు ధన్యులు!

Google docs లో ఈ స్కాన్ చేసిన PDFని షేర్ చేస్తున్నాను – మనోహరమైన పాట . డౌన్లోడ్ చేసుకోండి, చదవండి, ఆస్వాదించండి, మిత్రులకి పంచండి!