దేహం తిరి!

దేహం తిరి? ఏమిటీ కిరి కిరి! ఈ అర్థం పర్థం లేని పాటేంటి? ఒక వేళ అర్థముంటే అర్థం కాకుండా చెయ్యడానికే అన్నట్టు disco tune ఏమిటి? అర్థం కావడం మాట దేవుడెరుగు, కనీసం మాటలు కూడా సరిగ్గా వినబడ్డం  లేదే!

ఇవీ “యువ” చిత్రంలో “దేహం తిరి” పాట మొదటిసారి విన్నప్పుడు నాలో మెదిలిన భావాలు. ఈ భావాలు ఇప్పటికీ పెద్ద మారలేదు. అయినా ఈ పాట గురించి ఎందుకు రాస్తున్నాను అంటే, సంగీతపు రొదల మధ్య ఒక సెలయేటి గీతం ఉంది కాబట్టి. గొప్ప భావం ఉంది కాబట్టి.

ముందుగా ఈ పాట గురించి కొంత చెప్పుకోవాలి. ఇది తమిళ కవి వైరముత్తు రాసిన ఒక కవితా సంకలనంలోని కవిత. అంశం ప్రేమ. ఈ కవిత “యువ” సినిమా దర్శకుడు మణిరత్నానికి నచ్చి సినిమాలో వాడుకున్నారు. ఈ తమిళ పాట గురించీ, ఆ పాట భావం గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ చూడొచ్చు – yakkai tiri

Vairamuthu

సరే ఇప్పుడు తెలుగుకి వద్దాం. వేటూరి దాదాపు వైరముత్తు భావాలనే అనువదించారనీ, ఇందులో కొంత భావాన్ని వధించారని కూడా తెలుస్తోంది! కానీ చాలా వేటూరి పాటల్లో లాగే ఈ వధింపుని దాటి మథిస్తూ పోతే అమృతం దొరుకుతుంది!

ముందుగా పాట సాహిత్యం (చాలా సార్లు వినగా వినగా నాకు వినిపించినది!) –

దేహం తిరి వెలుగన్నది, చెలిమే

జీవం నది యద నీరధి, నెనరే

పుటకే పాపం కడుగు అమృతం, చెలిమే

హృదయం శిల శిలలో శిల్పం, చెలిమే

తాకుతాం రగులుతాం భరిస్తాం స్మరిస్తాం వదులుకోం

తాకుతాం రగులుతాం భరిస్తాం స్మరిస్తాం చెదిరిపోం

జన్మాంకురం కాంక్షే ఫలం

లోకం ద్వైతం కాంక్షే అద్వైతం

సర్వం శూన్యం శీర్షం ప్రేమ

మనిషి మాయ చెలిమి అమరం

లోకానికి కాంతిధార ఒకటే

ఒకటే ప్రతి ఉదయానికి వేకువైన వెలుగు ఒకటే

veturi-sundararama-murthy

ఈ పాట ప్రేమ గురించి అని చెప్పుకున్నాం. ప్రేమ కన్నా అపార్థం అయ్యే పదం ప్రపంచంలో ఇంకేది లేదు కనుక, అసలు ఈ ప్రేమ ఏ ప్రేమో ముందు తెలుసుకోవాలి! ఇక్కడ ప్రేమ, ప్రేయసీ ప్రియుల ప్రేమ కాదు. దైవత్త్వం నిండిన ప్రేమ. సార్వజనీనమైన ప్రేమ. ప్రపంచాన్ని కడిగే ప్రేమ. ఇప్పుడు పాటలోకి వెళ్దాం.

“దేహం తిరి” అన్నారు. తిరి అంటే? తమిళ పాటలో భావం ప్రకారం ఈ పదానికి “దీపపు వత్తి” (wick, in English) అని అర్థం చెప్పుకోవచ్చు. కానీ బ్రౌన్ డిక్షనరీ చూస్తే ఈ పదం కనిపించలేదు. సో, తమిళ పదాన్నే వాడేశారా? మా అమ్మని అడిగితే ఒక సమాధానం దొరికింది. వైజాగ్ ప్రాంతంలో ఈ పదం వాడుకలో ఉండేదట. “తిరి పెట్టు” అంటే “దీపం వెలిగించడం” అని అర్థమట. కాబట్టి ఈ మరిచిపోయిన/మరిచిపోతున్న తెలుగు పదాన్ని మళ్ళీ పరిచయం చేసినందుకు వేటూరిని అభినందించొచ్చు.

దేహం తిరి వెలుగన్నది చెలిమే

అంటే, దేహం (body) కేవలం వత్తి. వెలుగు అంతా ప్రేమ! ఇక్కడ “చెలిమి” అంటే ప్రేమ అని అర్థం తీసుకోవాలి.

జీవం నది యద నీరధి నెనరే

జీవం అంటే ఇక్కడ “జీవితం” (Life) అని అర్థం చెప్పుకోవాలి. నీరధి అంటే సముద్రం. నెనరు అంటే ప్రేమ. ఈ వాక్యానికి అర్థం – ” జీవితమనే నదికి పరమార్థమైన సాగరం ప్రేమ”. నదులుగా కనిపించే భిన్నత్వం లోంచి సాగరం అనే ఏకత్వం సిద్ధింపజేయడం ప్రేమ లక్షణం.

పుటకే పాపం కడుగు అమృతం చెలిమే

మన హైందవ సిద్ధాంతం ప్రకారం పాప ఫలం అనుభవించే వరకూ పుట్టుక తప్పదు. ఈ జనన మరణ వలయం నుంచి విముక్తి కలిగించే మోక్షం ప్రేమ. ఇదొక అర్థం. ఇలా కాకుండా – “మనకి పుట్టకనుంచీ ఉన్న కల్మషాలని కడిగే అమృతం ప్రేమ” అని simpleగా అర్థం చెప్పుకోవచ్చు.

హృదయం శిల శిలలో శిల్పం చెలిమే

మనసు ఒక శిల లాటిది, జీవం లేకుండా. ఆ శిలలో దాగిన శిల్పం ప్రేమ. అంటే ప్రేమని సిద్ధించుకుంటే శిల్పాలమౌతాం. లేదంటే శిలల్లా పడిఉంటాం. తమిళ భావంలో “శిలని శిల్పంగా మలిచే శిల్పి ” ప్రేమ అని ఉంది. కానీ వేటూరి శిల్పమే ప్రేమ అని మరింత గొప్పగా చెప్పారు!

తాకుతాం రగులుతాం భరిస్తాం స్మరిస్తాం వదులుకోం

తాకుతాం రగులుతాం భరిస్తాం స్మరిస్తాం చెదిరిపోం

ప్రేమ నిజానికి ఒక abstract concept. Concrete objects నే  స్పర్శించగలం. కాబట్టి ప్రేమని స్పర్శించడం అంటే ప్రేమని పక్కనే ఉన్న ప్రాణానిగా, స్నేహానిగా ఆత్మీయంగా స్పర్శించగలిగేంతగా నింపుకోగలగడం. ప్రేమలో రగలాలి, ప్రేమని భరించాలి కూడా. మోక్షాన్నిచ్చే ప్రేమ అంత సులువుగా రాదుగా మరి! ఏదేమైనా ప్రేమని వదులుకోకుండా, చెదిరిపోకుండా ఉంటామని ఇక్కడ భావన. తద్వారా ప్రేమ గొప్పతనాన్ని చెప్పడం.

జన్మాంకురం కాంక్షే ఫలం

ఇక్కడ “కాంక్ష” అంటే ప్రేమ. మరి, ప్రేమే ఫలం అని రాయొచ్చుగా, tune కూడా సరిపోతుంది? తమిళంలో “కాదల్” అన్న పదానికి lip sync కోసం “కాంక్షే” అని రాసినట్టు తోస్తోంది. అంకురం అంటే విత్తనం. మానవ జన్మ ఒక విత్తనమైతే, ప్రేమ సంపూర్ణమైన ఫలం (fruit). విత్తనంగానే ఉండిపోకు, ఎదిగి పరిపక్వత పొందు అని సందేశం.

లోకం ద్వైతం కాంక్షే అద్వైతం

అద్వైతం అంటే “వేరుగా చూడకపోవడం” అని simple గా అర్థం చెప్పుకోవచ్చు. జిడ్డు కృష్ణమూర్తి లాంటి తాత్త్వికులు చెప్పిన విషయం ఏమిటంటే – When Ego ends, Love begins. “నేను” అని ఒకటుంటే నేను కానిది, నానుంచి వేరైనది ఇంకోటి ఉండి తీరాలి. అసలు నేనే లేకపోతే అంతా నేనే. అప్పుడు తేడాలన్నీ మాసిపోతాయి. శంకరుల అద్వైత సిద్ధాంతం ఇదే. లోకంలోని అణువణువులోనూ, కనిపించే ప్రతి మనిషిలోనూ నిన్నే చూసుకున్న నాడు, నీలో ఒక సరికొత్త ప్రపంచం ఆవిష్కరింపబడుతుంది.

సర్వం శూన్యం శీర్షం ప్రేమ

మనిషి మాయ చెలిమి అమరం

ఈ రెండు వాక్యాలకీ దాదాపు అర్థం ఒకటే. శీర్షం అంటే సమున్నతం అని అర్థం చెప్పుకోవచ్చు ఇక్కడ. అంతా శూన్యం (సున్నా), ప్రేమ మాత్రం సమున్నతం (అనంతం). జగమే మాయ అంటే అసలు అర్థం ఇదే. తెలుసుకుంటే ప్రేమ తప్ప ఇంకేది లేదని తెలుస్తుంది అని వేదాంతుల వాక్కు. మనిషీ, మరణం మాయైతే మరణం లేనిది ప్రేమ ఒక్కటే.

లోకానికి కాంతిధార ఒకటే

ఒకటే ప్రతి ఉదయానికి వేకువైన వెలుగు ఒకటే

ఇప్పటి దాకా వేటూరి తమిళ భావాలనే అనువదించినా, ఈ రెండు వాక్యాల్లో మాత్రం తన గొంతు వినిపించారు. తమిళ పాటలో – “ఉన్నది ప్రేమ ఒకటే. తనువులు మారీ మారీ ఈ ప్రేమలోనే పుడుతూ పోతూ ఉంటాయ్” అన్న భావం ఉంది. మరి వేటూరికి ఈ భావం నచ్చలేదో, Tune సరిపోలేదో ఇంకో గొప్ప భావం రాశారు. లోకానికి కాంతిధార కేవలం ప్రేమ ఒకటే అన్నారు. ధారగా కురుస్తున్న ప్రేమని ఊహించుకోండి. వెలుగు వెలుగు వెలుగు. అనంతమైన వెలుగు కురుస్తోంది. కానీ మనం కళ్ళు మూసుకున్నాం. చీకట్లో ఉన్నాం. మన ఉదయానికి వేకువనిచ్చే (ఉదయం అంటే ఇక్కడ జన్మ (birth) అని అర్థం చెప్పుకోవాలి) ఆ వెలుగుని చూడలేకున్నాం. కళ్ళు తెరవండి, మేల్కోండి, వెలుగుని కనరండి!!

ఇంత గొప్ప పాటని రాసిన వైరముత్తుకి ముందు ధన్యవాదాలు చెప్పుకోవాలి. కొంత కష్టపెట్టినా, గొప్పగా అనువదించిన వేటూరికి “భరిస్తాం స్మరిస్తాం” అంటూ ఆయన ఈ పాటలోనే రాసిన వాక్యాన్ని అర్పించుకుంటూ నమస్సులు తెల్పుకుంటున్నాను!