ఆడవే హంసగమన

కొన్ని వాక్యాలు వింటే చాలా మాములుగా అనిపిస్తాయ్. పెద్ద గొప్ప అర్థం ఏమీ కనిపించదు. అలాటి మామూలు వాక్యాల్లో కూడా కొన్ని సార్లు మనకి తెలియని గొప్ప అర్థాలు ఉండచ్చు, ముఖ్యంగా వేటూరి లాంటి కవుల విషయంలో.

ఈ కింది వాక్యాలు చూడండి:

ఆడవే హంసగమన
నడయాడవే ఇందువదన

“విరాట పర్వం” అనే సినిమాలో NTR బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడిగా నటించారు. విరాటుని కొలువులో ఉంటూ “ఉత్తర”కి నాట్యం నేర్పిస్తున్నప్పుడు పాడే పాట ఇది.

చూస్తే “హంసలా ఆడు ఓ చంద్రుని వంటి మోము కలదానా” అనే మామూలు అర్థమే కనిపిస్తుంది నాలాటి సామాన్యులకి… వేటూరి విడమర్చి చెప్పేదాకా –

“నేను (వేటూరి) పాట రాసి ఇస్తే అది చూసి NTR గారు పక్కనే ఉన్న వెంకటకవి గారికి ఇచ్చారు.

ఆడవే హంసగమన, నడయాడవే ఇందువదన

అనే పల్లవి చూసి కవిగారు హంసగమనా ఆడవే అన్నారు, హంస నాట్యానికి ప్రసిద్ధి కాదు కదా అని అడిగారు.

వెంటనే నేను – అక్కడ మాట అంటున్నది పేడి అయిన బృహన్నల కాదు! అతనిలో దాగి ఉన్న నాట్యకోవిదుడైన అర్జునుడు. అతను హంసలనూ, నెమళ్ళనూ కాక అంతకన్న ఉదాత్తమైన, తన స్థాయికి తగిన ఉపమానోపమేయాలు తేవాలి కదా – అందుకే ఇక్కడ “హంస” శబ్దం సూర్యపరంగా వాడాను. క్రమం తప్పని గమనంలో సూర్యుడంతటి సమగమనం కలదానా అని అర్థం. అక్కడ హంస సూర్యపరంగా వాడాను కాబట్టే “నడయాడవే ఇందువదనా” అనడం! గమనశ్రమ ఎంత కలిగినా ఆహ్లాదకరమైన చంద్రుడి వదనమే కలదానా అనే అర్థంలో చెప్పడం జరిగింది” అన్నాను.

వెంకటకవి గారు ఆశువుగా ఏదో పద్యపాదం చదివి లేచి నన్ను కౌగిలించుకున్నారు. నా విషయంలో NTR గారు  ఆనాడు ఎంత తృప్తి వెల్లడించారో అక్కడే ఉన్న సంగీత దర్శకులు శ్రీ సుసర్ల దక్షిణామూర్తిగారు పదే పదే చాలా కాలంగా ఆ సంఘటనే ప్రస్తావించేవారు. ”

అదండీ సంగతి! “ఊరక రాయరు మహానుభావులు” అని ఊరికే అన్నారా!

(వేటూరి “హాసం” అనే పత్రికలో రాసిన ఒక పాత వ్యాసం నుండి ఈ విషయం సంగ్రహించబడింది. ఈ వ్యాసాలు కొన్ని తర్వాత “కొమ్మ కొమ్మకో సన్నాయి” అనే పుస్తకంగా కూడా వచ్చాయి).