శుభసంకల్పం చిత్రంలోని “చినుకులన్నీ కలిసి చిత్రకావేరి అన్న పాట వేటూరి కవిత్వపు లోతులని తెలిపే గొప్ప పాటని సిరివెన్నెల సీతారామశాస్త్రే స్వయంగా మెచ్చుకున్నారు -(హాసంలోని వ్యాసం ఇక్కడ)
“చినుకులన్నీ కలిసి చిత్రకావేరి, చివరికా కావేరి కడలి దేవేరి” అని కనురెప్పల చెలియలికట్టని దాటని కన్నీటిపొర వెనుకనున్న గుండెకడలి కల్లోలాన్ని చూపించారు”
ఓహో, గొప్ప పాటన్న మాట అనుకోవడమే తప్ప పాటలో గొప్పతనమేమిటో, ఆ మాటకొస్తే అసలు పాటకు అర్థం ఏమిటో నాకు మొదట అర్థం కాలేదు. ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు, కానీ గొప్పతనాన్ని కొంత గ్రహించాను అని చెప్పగలను. Veturi is a poet’s poet కనుక సిరివెన్నెల వంటి వారికి అర్థమైనంత నాబోటి వారికి అర్థం కాదు. ఐనా నాకర్థమైనంతలో ఈ పాట గురించి వివరిస్తాను.
సినిమాలో కథానాయకుడు (కమల్ హాసన్) ఓ జాలరి. అతనికో చక్కని భార్య (ఆమని), వారిదో ముచ్చైటైన జంట. అనుకోని పరిస్థితులలో అతని భార్య తీవ్రమైన అపాయానికి లోనై ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి చేరుతుంది. కొన్నాళ్ళు మృత్యువుతో పోరాడి, తుదిశ్వాస విడుస్తుంది. అప్పుడు కథానాయకుడు, భార్య శవాన్ని పడవలో వేసుకుని, నది మధ్యకి తీసుకెళ్ళి, పడవని ఆపి భోరున విలపిస్తుండగా వచ్చే నేపథ్య గీతం ఇది. కాబట్టి ఇదొక శోక గీతం అనుకోవాలి.
అయితే సినిమా ట్రైలర్స్ చూసినప్పుడు నాకు బాగా జ్ఞాపకం – సముద్రపు ఒడ్డున కథానాయకుడు భార్యతో ఆనందంగా కనిపిస్తాడు. భార్య అతని పైన వాలి, ప్రేమగా అతని ఎద నిమురుతూ ఇదే పాట పాడుతుంది. ఈ సన్నివేశం మరి చిత్రంలో ఉందో లేదో గుర్తులేదు. అయితే వేటూరి ఈ పాటని శోకగీతంగా మాత్రమే కాక, ఇంకో అర్థం స్ఫురించేలా కూడా రాశారని అనుకోవచ్చు. అంటే ఈ పాటకి రెండు అర్థాలు ఉన్నాయన్న మాట. అదే మరి వేటూరి గొప్పతనం అంటే.
మొదటి అర్థం:
కథానాయకుడు జాలరి కాబట్టి చేపలు పట్టడానికి రోజుల తరబడి సముద్రంకేసి పోవడం సహజం. పెళ్ళాం పిల్లలని వదిలి ఇలా ఉండడం కొంత ఒంటరితనాన్ని వారిలో కలగజేస్తుందనీ, అందుకే వారు పాడుకునే పాటల్లో శృంగారం ఎక్కువ కనిపిస్తుందని యండమూరి వీరేంద్రనాథ్ ఒకచోట రాశారు. కాబట్టి సముద్రం కేసి వెళుతున్న మొగుడుని, ప్రేమగా సముదాయిస్తూ అతని భార్య ఈ పాట పాడుతోందని అనుకోవచ్చు. ఈ కోణంలో ఈ పాట అర్థాన్ని పరిశీలిద్దాం.
చినుకులన్నీ కలిసి చిత్రకావేరి
చివరికా కావేరి కడలి దేవేరి
కడలిలో వెతకొద్దు కావేరి నీరు
కడుపులో వెతకొద్ది కన్నీరు కారు
గుండెలోనే ఉంది గుట్టుగా గంగ, నీ గంగ
ఎండమావుల మీద ఎందుకా బెంగ?
రేవుతో నావమ్మ కెన్ని ఊగిసలో
నీవుతో నాకన్ని నీటి (కన్నీటి) ఊయలలు
“చిత్రకావేరి” అంటే తనే, కడలి అంటే జాలరి ఐన భర్త. నేను నీకు భార్యనయ్యాను. సముద్రంలో ఉన్నప్పుడు నన్ను గుర్తుచేసుకుని, నేను చెంత లేనని కలతపడకు. నేను నీ గుండెలోనే ఉన్నాను, నీకు తెలియదా ? (సినిమాలో కథానాయిక పేరు కూడా “గంగ”). నేను నీ చెంతనుండగా, ఏ ఎండమావులూ మన దరిజేరవు. రేవుతో నావకిమల్లే నీతో నాకు ఎన్నో నీటి ఊయల సయ్యాటలు!
రెండవ అర్థం:
ఇలా ఆనందంగా, సరస సల్లాపాలతో సాగుతున్న వారి జీవితాన్నీ, వారి అనుబంధాన్ని ప్రతిబింబిస్తుందీ పాట. అయితే విధివశాత్తూ భార్య చనిపోతుంది. అప్పుడు కథానాయకుడు భార్య పాడిన పాటని గుర్తు చేసుకుంటున్నాడు. ఇప్పుడు అతనికి అదే పాటలో కొత్త అర్థాలు స్ఫురిస్తున్నాయి.
కావేరి చివరికి కడలిలో కలిసిపోయినట్టే, ప్రతి మనిషీ కాలగర్భంలో కలిసిపోక తప్పదు. కడలిలో కలిశాక ఇంక కావేరి అంటూ ఏముంది? (కడలిని కలిసే వరకే కావేరికి రూపు ఉన్నది అన్నారు వేటూరి ఇంకో పాటలో). నేను ఒక కరిగిపోయిన జ్ఞాపకం. నన్నే తలుచుకుంటూ శోకంలో కూరుకుపోకు. ఐనా నేను ఎక్కడికీ వెళ్ళిపోలేదు, నీ గుండెలోనే సజీవంగా ఉన్నాను. రేవుతో నావకి ఉన్న బంధంలాగే, నీకూ నాకూ మధ్య ఎన్నో కన్నీటి ఊయల పాటలు.
“నీటి ఊయలలు” అని మొదట పాడి, రెండో సారి “కన్నీటి ఊయలలు” అని బాలు పాడడం వల్ల మనకి మొదటి సందర్భం కూడా గుర్తొచ్చి, భావాన్ని గుండెకి హత్తుకుపోయేలా చేస్తుంది. మొదటి సందర్భంలో ఈ పాట శైలజ పాడినట్లు గుర్తు.
ఈ పాటని వ్యాఖ్యానించడం చాలా కష్టం. పాటకి అర్థం మనలో మనమే వెతుక్కోవాలి. ఈ పాట సాహిత్యాన్ని చదివి (లేదా పాటను విని), అంతర్ముఖులమై మౌనంలోకి ఒదిగిపోగలిగితే ఎంతో కొంత అర్థమౌతుంది. “భాష ఉన్నది మనకి మౌనాన్ని పరిచయం చెయ్యడానికే” అని సీతారామశాస్త్రి గారు ఒకసారి మా మిత్రబృందంతో అన్నది ఇదే కావొచ్చు.
అసలు ఈ పాటకి ఇంత అర్థం ఏమీ లేదు, మనమే కల్పించాం అని కొందరు అనవచ్చు. సృజన అన్నది కవి హృదయంలోనే కాక, పాఠకుడి హృదయంలోనూ కలిగేలా ప్రేరేపించడమే కవిత్వం ఉద్దేశ్యం. కవి సృజనా, చదువరి సృజనా ఒకటే కానక్కరలేదు, కాలేదు కూడా. “నాలో ఉన్న నీరు నాకు కాక ఇంకెవరికి తెలుసు? అన్న ఆత్రేయ/కణ్ణదాసన్ వాక్యాలు ఇదే చెబుతాయి. నీలోని మరో నిన్ను నిదురలేపేదే కవిత్వం. అందుకే వేటూరి నిస్సందేహంగా మహాకవి.