హాసంలో వేటూరి “కొమ్మ కొమ్మకో సన్నాయి” శీర్షికన రాసిన వ్యాసాల్లో తన పాటల గురించి రాసుకున్నవి ప్రచురించాను ఇప్పటి దాకా. ఇవన్నీ తర్వాత వచ్చిన “కొమ్మ కొమ్మకో సన్నాయి” పుస్తకంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రచురించబోతున్న మూడు వ్యాసాల ప్రత్యేకత ఏమిటంటే అవి పుస్తకంలో లేవు. కాబట్టి ఈ వ్యాసాలు బహుశా తక్కువ మంది చదివి ఉంటారు. (Correction: ఈ రోజే సరిచూసుకున్నాను. ఈ వ్యాసం కొమ్మకొమ్మకో సన్నాయి పుస్తకంలో ఉంది. నేను పొరబడ్డాను.)
ETV లో బాపూ రమణల భాగవతానికి వేటూరి కొన్ని పాటలు అందించారు. ఆ పాటల గురించి రాసినదీ వ్యాసం. చాలా మంచి వ్యాసం ఇది. ఎలాంటి వస్తువుకి ఎలాంటి భాష వాడాలి, తద్వారా రసపోషణ ఎలా సాధించాలి అన్నది వేటూరి వివరిస్తారు. రసపోషణ అంటే ఒక పాట విన్నప్పుడు మనలో కలిగే స్పందనగా నిర్వచించుకోవచ్చు. ఈ రసపోషణ సరిగా పాటించబడని పాటలు ఎన్నో ఉన్నాయి. నాకు గీతరచయిత చంద్రబోస్‌లో కనిపించే ప్రధానమైన లోపమే ఇది. ఆయన రాసిన కొన్ని పాటల్లో విన్నూతనంగా రాసే ప్రయత్నం వలన పాట వింటే చమత్కారం చేశాడు, కొత్తగా రాశాడు అనిపిస్తుందే తప్ప తగిన రసస్ఫూర్తి కలగదు.
శ్రీ భాగవతం పాటలు ఎక్కడైనా లభ్యమైతే తెలపగలరు. వేటూరి రాసిన వ్యాసం ఇక్కడ: Veturi on Bhagavatam songs