“స్నేహితుడా స్నేహితుడా” (సఖి) పాట గురించి

మణిరత్నం “సఖి” సినిమా తెలుగు లిరిక్స్ చెత్తగా ఉంటాయని చాలామంది భావన. ఆ సినిమా విడుదలైన కొత్తల్లో టీవీ ఏంకర్ ఝాన్సీ ఓ ప్రోగ్రాంలో “పాటలు బాగున్నాయి, అర్థమైతే ఇంకా బాగుండేది” అని వ్యంగ్యంగా అనడం నాకు బాగా గుర్తు. “పచ్చందనమే పచ్చందనమే నీ చిరునవ్వుల పచ్చదనమే” అన్నప్పుడు “ఏం పాపం, హీరోయిన్ పళ్ళుతోముకోలేదా” అని వెటకారం చేసినవాళ్ళు ఉన్నారు. ఇక రహ్మాన్ అభిమానులైతే, “మా రహ్మాన్‌కి ఎప్పుడూ ఇదే ఖర్మ తెలుగులో” అని వాపోయి తమిళ ఆల్బంకి స్విచ్చైపోయారు.

ఈ పరిస్థితికి గీతరచయిత వేటూరిని తప్పుపట్టొచ్చు. అయితే వేటూరినే పూర్తిగా నిందించడం సరికాదనిపిస్తుంది. పాట సాహిత్యం కొన్ని చోట్ల అంతగా వినబడకపోవడానికి, పాడిన వాళ్ళకి తెలుగు తెలియకపోవడం వల్ల జరిగిన పొరబాట్లకి రహ్మాన్‌ని తప్పుపట్టొచ్చు. వేటూరి మరీ క్లిష్టమైన తెలుగు వాడకపోయినా, “మునిమాపు” లాంటి తెలుగుపదాలు కూడా అర్ధం కానంతగా దిగజారిన మన తెలుగు భాషాసామర్ధ్యానికి మనని మనం నిందించుకోవాలి!

ఈ పాటని అర్థం చేసుకునే ముందు కొన్ని విషయాలు గమనించాలి. ఇదొక శృంగార గీతం. పెద్దలకి తెలియకుండా పెళ్ళిచేసుకున్న ఓ యువజంట రహస్యంగా కలుసుకున్నప్పుడు సాగే చిన్న చిన్న ముచ్చట్లన్నీ చిలిపిగా ఆ అమ్మాయి పాడుతోంది. తమిళంలో ఈ పాట రాసినది వైరముత్తు. వైరముత్తు సాహిత్యానికి translation ఇక్కడ చదవొచ్చు. వేటూరి తమిళపాట భావాన్నే దాదాపు అనుసరించినా తనదైన సొబగులని అద్దాడు.

సాకీ:

నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ ఒళ్ళో
గాలల్లే తేలిపొతానో ఇలా డోలలూగేనో
ఆనందాల అర్ధరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా
మనం చెదిరి విలపించా
కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో
గర్వమణిచెనులే నా గర్వమణిగెనులే

“మునిమాపు” అంటే సాయంసంధ్య వేళ. “డోల” అంటే “ఊయల”. “అందాల గుర్తులు” అంటే “శృంగార చిహ్నాలు” కావొచ్చు. “వలపించు” అంటే మోహింపజేయడం (fascinate).

భావం: నిన్న సాయంత్రపు వేళ మసకవెన్నెల్లో మనం కలుసుకున్నప్పుడు నా ఆనందానికి అంతులేదు. ఎంతో హాయిగా ప్రేమలో మునిగితేలాం. కానీ విడిపోవడం ఎంత బాధగా ఉంది! నీ కురుల నొక్కులో మెరిసే చుక్కలు సైతం నల్లబడ్డాయి సుమా. నీ సోయగానికి నేను దాసోహం!

భావపరంగా కొంత అస్పష్టత ఉంది. “మనం చెదిరి (నేను) విలపించా” అన్న వాక్య నిర్మాణం వేటూరిలో తరచూ కనిపించే నిర్లక్ష్యాన్ని చూపిస్తుంది.

పల్లవి:

స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా!
చిన్నచిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా!
ఇదే సకలం సర్వం, ఇదే వలపూ గెలుపు,
శ్వాస తుదివరకూ వెలిగే వేదం వాంఛలన్ని వరమైన ప్రాణబంధం

భావం: ఓ ప్రియమైన రహస్య స్నేహితుడా! నాకు కొన్ని చిన్నచిన్న సరదా కోరికలున్నాయి, నీతో తీర్చుకుంటాలే! మన ప్రేమే మన గెలుపు, అదే సమస్తం. ప్రాణసమానమైన మన బంధం వేదంలాగ కడదాకా వెలుగుతూనే ఉంటుంది.

మొత్తం పాటలో పల్లవే మెరుస్తుంది. “పల్లవికి వేటూరి” అని మరోసారి నిరూపిస్తుంది. “కోరికలే అల్లుకున్న స్నేహితుడా”, “వాంచలన్ని వరమైన ప్రాణబంధం” వంటి expressions వేటూరిలోని కవిని, అతని పదాలపొందికని చూపిస్తాయి. కథాపరంగా ప్రేమకోసం పెద్దలకి తెలియకుండా పెళ్ళిచేసుకుని, రహస్యంగా కలుసుకుంటూ ఉంటారు కనుక – “ఇదే వలపూ గెలుపు” అనడం, “రహస్య స్నేహితుడా” అనడం పొసగుతుంది.

చరణం 1:

చిన్నచిన్న హద్దు మీర వచ్చునోయ్
ఈ జీవితాన పులకింత వెయ్యవోయ్
మనసే మధువోయ్
పువ్వు కోసే భక్తుడల్లే మెత్తగా
నేను నిద్రపోతే లేతగోళ్ళు గిల్లవోయ్
సందెల్లో తోడువోయ్
ఐదు వేళ్ళు తెరిచి, ఆవువెన్న పూసి సేవలు శాయవలెగా
ఇద్దరమొకటై కన్నీరైతే తుడిచే వేలందం!

మధువు అంటే తేనె. సందె అంటే సాయంకాలం.

భావం: ఓ ప్రియుడా! కొంచెం శ్రుతిమించి తియ్యతియ్యగా పులకింత కలిగించవోయ్. నేను నిద్రపోయినప్పుడు ప్రేమగా నా కాలిగోళ్ళు గిల్లాలి నువ్వు. ఇంకా నా అరచేతికి ఆవువెన్న రాసి నన్ను సేవించుకోవాలి మరి! ఎప్పుడైనా మనిద్దరం కన్నీరైనప్పుడు ఒకరినొకరం మృదువుగా ఓదార్చుకుందాం లే!

గాయని “పూల కొంత వెయ్యవోయ్” అని పాడింది కానీ, నాకు అది “పులకింత” అనిపిస్తుంది. “నా జీవితంలో ఆనందాన్ని నింపు” అనడానికి వేటూరి “జీవితాన పులకింత వెయ్యవోయ్” అని ప్రయోగించి ఉంటాడని నా ఊహ. “చెయ్యాలిగా” అనడానికి “శాయవలెగా” అనడం, ఎంతో లలితంగా, పాట మూడ్‌కి సరిపోయేలా ఉంది. ఈ ప్రయోగానికి “మా గురువుగారు పింగళి ప్రేరణ ఉందని” వేటూరే చెప్పారు (ఇక్కడ చూడండి).

“ఇద్దరమొకటై కన్నీరైతే తుడిచే వేలందం” అనడం మొదట్లో ఎబ్బెట్టుగా అనిపించినా తర్వాత తర్వాత నాకు చాలా నచ్చింది. “ఒకరికొకరై, మన బాధలని మనసు విప్పి చెప్పుకుని  సాంత్వన పొందుదాం” అన్న అర్థం వచ్చేలా గొప్పగా రాశాడనిపిస్తుంది. ముందులైనుతో కలిపి తీసుకుంటే ఇంకో భావమూ ధ్వనిస్తుంది. ఆవువెన్న మెత్తదనాన్నీ, మృదుత్వాన్నీ సూచిస్తోంది అనుకుంటే, “వెన్నతో నిండిన వేలితో కన్నీరు తుడవడం” అంటే అందంగా, మృదువుగా, సామరస్యంగా ఒకరి కన్నీరు ఒకరు తుడుద్దాం అన్న అర్థమూ వస్తుంది.

చరణం 2:

శాంతించాలి పగలేంటి పనికే
నీ సొంతానికి తెచ్చేదింక పడకే
వాలేపొద్దు వలపే
ఒళ్ళెంచక్కా ఆరబోసె వయసే
నీటి చెమ్మచెక్కలైనా నాకు వరసే
ఉప్పుమూటే అమ్మైనా
ఉన్నట్టుండి ఎత్తేస్తా, ఎత్తేసి విసిరేస్తా, కొంగుల్లో నిన్నే దాచేస్తా
వాలాక పొద్దు విడుదల చేసి వరమొకటడిగేస్తా

“చెమ్మచెక్కలు” అంటే అమ్మాయిలు ఆడుకునే ఓ ఆట. “నీటి చెమ్మచెక్కలు” అనడం వేటూరిజం. అంటే నీళ్ళల్లో ఆడుకునే సరసమైన ఆటలు అనుకోవచ్చు.

భావం: శ్రీవారూ, శాంతించాలి! పగటిపూట సరసాలు చాలించాలి! పొద్దు వాలి చీకటి పడ్డాక మనకి సొంతమైన సమయం ఉంది కదా! ఎంతైనా నా అందాల ఆరబోత తమరికేగా! నీళ్ళల్లో ఆటలకైనా నేను సై అంటాగా! మన ఉప్పుమూట ఆటల్లో నేను తమరిని ఎత్తిపడేసి, నా చీరకొంగులో దాచేస్తాను. చీకటి పడ్డాకే తమరికి విడుదల, అదీ నేనడిగిన వరాన్ని తీరిస్తేనే!

వేటూరి చిలిపిదనాన్ని ఈ చరణంలో చూడొచ్చు. “పని” అంటే వేటూరి పాటలోనే చెప్పాలంటే – “మీ పని, మీ చాటుపని, రసలీలలాడుకున్న రాజసాల పని”! (అన్నమయ్య చిత్రంలోని “అస్మదీయ మగటిమి” పాట).  “సొంతానికి తెచ్చేదింక పడకే” అనడం అందమైన తెలుగు నుడికారం. వయసు ఒంటిని ఎంచక్కా ఆరబోసింది అనడం, నీటి చెమ్మచెక్కలు నాకు వరసే అనడం ఎంత గడుసు ప్రయోగాలు! నిజానికి గాయని “ఉల్లంచొక్కా” అని పాడింది. తమిళగీతంలో కూడా “నీ చొక్కాలు నేను వేసుకుని నిన్ను అల్లరి పెడతాగా” అన్న భావం కనిపిస్తోంది. ఉల్లం అంటే “మనసు” కాబట్టి, “మనసనే చొక్కాని” నేను ఆరబోసాను అని ఒక అర్థం చెప్పుకోవచ్చు గానీ, నాకది అస్సలు సమంజసంగా అనిపించలేదు. చివరి లైనులో “వాలాక పొద్దు” అన్నది ట్యూనులో అంత సరిపడకపోవడంతో “వాలక పొద్దు” అని వినిపించి మనని అర్థం తెలియని గందరగోళంలోకి నెడుతుంది.

రెహ్మాన్ సంగీతం ఈ పాటకి గొప్పగా ఉంటుంది. “సాధనా సర్గం” కూడా బాగా పాడింది. ఈ వ్యాఖ్య వలన పాట సాహిత్యం కొంత మెరుగ్గా అర్థమయ్యి, పాటని మరింతగా ఆస్వాదిస్తారని ఆశిస్తాను.