ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి!

“సీతారామయ్యగారి మనవరాలు” చిత్రంలో “కలికి చిలకల కొలికి” పాట చాలా ప్రాచుర్యం పొందింది. అందులో మొదటి చరణంలో లైన్లపై పెద్ద చర్చే జరిగింది ఈ మధ్య:

ఆ చేయి ఈ చేయి అద్దగోడలకి
ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి!

గాయని చిత్ర “అద్దగోడలికి” అని పాడినట్టు వినిపించడం వల్ల (“అడ్డగోడలికి” అని కొందరికి వినిపించింది) కొంత అస్పష్టత ఏర్పడింది. అది “అత్తకోడలికి” అని ఉండాలని, చిత్ర తప్పు పాడారని కొందరు అన్నారు. అయితే అది “అద్దగోడే” అనిపిస్తోంది. సరే అలాగే అనుకుందాం! అయితే అద్దగోడ అంటే ఏమిటి? ఆ అద్దగోడకి పెద్దకోడలికి సంబంధం ఏమిటి?

కొత్తావకాయ గారి G+ పోస్టుపై జరిగిన చర్చలో కొన్ని వివరాలు దొరికాయి. మిత్రురాలు మానస చెప్పిన తెలుగు సామెతా, తెలుగు వికీపీడియాలో ఆ సామెత గురించిన వివరాలు అన్నీ సంగ్రహిస్తే తెలిసినది ఇది:

పూర్వకాలంలో వంటశాలలో తూర్పువైపు గోడకు చేర్చి పొయ్యిలు ఉండేవి. ఆ పొయ్యిలకు కుడి ప్రక్కగా భోజనాలశాలకు చేరి మూడు అడుగుల గోడ. ఈ గోడని “అర్థగోడ/అద్దగోడ/అడ్డగోడ” అంటారు. వంట చేసేటప్పుడు చేతుల మురికి రాయటం వల్ల సహజంగా ఇంటిలోని అన్ని గోడల కన్నా అడ్డగోడలకు మురికి బాగా ఉంటుంది. అలాగే ఇంటిలో ఏ తప్పు జరిగినా పెద్ద కోడలికే మాట వస్తుంది. అందుకే ఒక సామెత పుట్టింది – “ఆ మరకా ఈ మరకా అడ్డగోడకి, ఆ మాటా ఈ మాటా పెద్దకోడలకి” అని.

అదీ సంగతి! వేటూరి ట్యూన్ కోసం “మరక” బదులు “చేయి” వాడారన్నమాట! ఇప్పుడు ఈ పాట మొదటి చరణం పరికిద్దాం:

ఆ చేయి ఈ చేయి అద్దగోడలకి
ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి!
నేటి అత్తమ్మా నాటి కోడలివి
తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి!
తలలోని నాలికై తల్లిగా చూసే
పూలల్లో దారమై పూజలే చేసే
నీ కంటి పాపలా కాపురం చేసే
మా చంటి పాపను మన్నించి పంపు!

సినిమాలో నిజానికి ఆ కోడలు చేసిన తప్పు ఏమీ లేదు. పెద్దరికాల మధ్య, అహంకారాల మధ్య నలిగిపోయి అత్తవారింటినే ఉండిపోయి పుట్టింటిని నోచుకోని పరిస్థితి. అయినా ఆమె మేనకోడలు తన మేనత్త అత్తతో చేసే రాయబారంలో “మా మేనత్తని మన్నించి పంపు” అంటుంది! పని సాధించుకోడానికి, పక్కవాళ్ళ అహాన్ని సంతృప్తి పరచడానికి ఇదో సాధనం! తన మేనత్త మంచితనాన్ని పొగిడే ముందు, “కోడలికి అద్దగోడకి మరకలా మాటలు తప్పవు! నువ్వూ ఒకప్పుడు కోడలివే, మరిచిపోకు” అనడం ఎందుకంటే ఆ అత్తగారు “నేనూ ఒకప్పుడు కోడలినే, నేనూ పాట్లు పడ్డాను” అనుకున్నప్పుడు తీవ్రమైన కోపద్వేషాలు ఉండవు. అలా ఆ అత్తగారు “అవును కదా!” అని కొంత కరుగుతూ ఉండగానే, తన మేనత్తని పొగిడి, “ఆ! అంత గొప్పదేమిటి నా కోడలు!” అని అత్తగారి అహం పైకొచ్చే లోపే “మన్నించి పంపు” అని మెత్త చేసుకోవడం! అదీ లౌక్యం అంటే! మనుషుల మనస్తత్త్వాలని ఎరిగి వేటూరి అత్యంత సమర్థవంతంగా రాసిన పాట ఇది!

సిరివెన్నెల చెప్పినట్టు – “వేటూరి గారి గీతరచనా వ్యాసంగం గురించి సమగ్రంగా తెలుసుకోవటం, సినిమా పాట గురించి మాత్రమే గాక, తెలుగుభాష, వాజ్ఞ్మయం, సంస్కృతి, ఇత్యాది అత్యావశ్యక అంశాల గురించి అధ్యయనం చేసినట్టవుతుంది.” ఎవరూ పట్టించుకోని తెలుగు పలుకుబళ్ళు, సామెతలు మొదలైనవి లాక్కొచ్చి మరీ సినిమాల్లో ప్రయోగించిన వాడు వేటూరి. ఆయనకు వందనాలు!