“రంజని” సాహితీ సంస్థ వారు వేటూరి స్మృతిగా “పాటల పూదోట వేటూరి” అని ఒక పుస్తకం వెలువరించారు. వేటూరికి నివాళిగా రాసిన వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. కొన్ని వ్యాసాల్లో వేటూరి పాటలకి ఇచ్చిన వివరణలు వేటూరి జన్మదినం సందర్భంగా అందరితో పంచుకునే ప్రయత్నమే ఈ వ్యాసం.
ఫ్రెంచి ఫిడేలు
ఒకసారి తనికెళ్ళ భరణి గారితో కలిసి నేనూ కొంతమంది మిత్రులం కార్లో రాజమండ్రి వెళుతున్నాం. వేటూరి గారి ప్రస్తావన వచ్చింది. “ఆ అంటే అమలాపురం” పాట పైకి వ్యాంప్ సాంగ్‌లా ఉన్నా లోపల ఎంతో చరిత్ర ఉందని నేనన్నాను. ఉదాహరణకి రాజమండ్రిని ప్రస్తావిస్తూ “చిత్రాంగి మేడల చీకట్ల వాడలో” అని ప్రయోగించారు వేటూరి. ఇది సారంగధ కథకు సంబంధించిన ప్రయోగం. అట్లే అదే పాటలో యానాం దగ్గర ఫ్రెంచి ఫిడేలు అనే పదం ప్రయోగించారు వేటూరి.
చారిత్రకంగా యానాం క్రీ.శ.1720లో ఫ్రెంచి వారి పాలనలోకి వెళ్ళింది కాబట్టి దాని ఆధారంగా వేటూరి “ఫ్రెంచి ఫిడేలు” అనే పదాన్ని ప్రయోగించారని నేనన్నాను. “అది కాకపోవచ్చయ్యా” అంటూ తనికెళ్ళ భరణి ఫోనందుకుని వేటూరి గారికే స్వయంగా ఫోన్ చేసి “గురువుగారూ, మీరు వాడిన ఫ్రెంచి ఫిడేలుకి అర్థమేంటి? మా వాడేదో చరిత్ర అంటున్నాడు” అని అడిగారు. భరణి గారు లౌడ్ స్పీకర్ ఆన్ చేశారు. అటునుండి మెల్లగా మార్దవంగా ఆ పుంభావ సరస్వతి మంద్ర స్వరంతో – “ఏముంది నాయనా. మనం చిన్నప్పుడు బళ్ళో చదువుకొనేటప్పుడు జేబుల్లో చేతులు పెట్టుకుని ఇబ్బందిగా చూస్తే “ఫిడేలు వాయిస్తున్నాడ్రా” అంటూ ఉండేవారు కదా” అంటూ చల్లగా చెప్పారు వేటూరి. ఇదీ వేటూరి విశ్వరూపమంటే
– ఆకెళ్ళ రాఘవేంద్ర, “గోదారమ్మ కుంకుంబొట్టు” వ్యాసం
(సారంగధ కథ ఏమిటో, ఈ ఫ్రెంచి ఫిడేలు అర్థం ఏమిటో నాకు ఇంకా తెలియలేదు. మీకు తెలిస్తే కామెంట్లో చెప్పగలరు)
నవమి నాటి వెన్నెల
నవమి నాటి వెన్నెల నీవు
దశమి నాటి జాబిలి నేను
కలుసుకున్న ప్రతి రేయీ
కార్తీక పున్నమి రేయి
ఈ చిత్రంలో కథాపరంగా హీరోయిన్ జయసుధ కొత్త కుర్రాడైన హీరో కంటే పెద్దది కాబట్టి ఆమెను ముందుపుట్టిన నవమి నాటి వెన్నెలతో పోల్చి గూఢార్థంతో గుండెలకు అద్దారు వేటూరి.
– వడ్డేపల్లి కృష్ణ, “సాటిలేని మేటి భావాల స్ఫూర్తి వేటూరి సుందరరామమూర్తి” వ్యాసం
యంగోత్రి, ఖంగోత్రి
ఒక విద్యార్థిని ప్రశ్న: మీరొక పాటలో యంగోత్రి, ఖంగోత్రి అనే కొత్త మాటలు ఉపయోగించారు. వాటిని ఎందుకు ఉపయోగించారు. వాటి అర్థం ఏమిటి?
వేటూరి: ఇవి అర్థం కాని పదాలు కావు. “యంగోత్రి” అంటే కుర్రదనీ, “ఖంగోత్రి” అంటే “కంగారుపడే యువతి” అనీ అర్థం. కొత్తపదాలు సృజించకుండా ఉంటే భాష ఎలా వృద్ధి చెందుతుంది? “మాయాబజారు”లో పింగళి గారు ఘటోత్కచుడి చేత “వెయ్యండయ్యా వీరతాడు” అనిపిస్తాడు. అలా కొత్తమాటలు పుట్టిస్తూ ఉండాలి. ఇప్పుడొస్తున్న కొత్త ట్యూన్లకి, కొత్త పద్ధతులకీ కొన్ని విన్యాసాలు తప్పనిసరి. “సావిత్రి” అనే పదం ఉందనుకోండి, ఆ పదాన్ని ఉపయోగించుకుని, “చలి సావిత్రి”, “సందిట్లో చలిసావిత్రి” అనే ప్రయోగాలు చేశాం. ఘన సంస్కృతికి సంబంధించిన నామవాచకంతో కొన్ని పదాలు కలిసినప్పుడు ఆ చమత్కారాలు నిలబడతాయి. యంగోత్రి, ఖంగోత్రి అంటే అక్కడ “త్రి” అనేది అంత్యప్రాసగా వస్తోంది. నడక కలిసిన నవరాత్రి అని వస్తుందనుకుంటాను – త్రి, త్రి అని రావడం వల్ల చమత్కారంగా ఉంటుంది కాబట్టి కొత్త పదాలు పడ్డాయి.
– వేటురితో కళాశాల విద్యార్థినుల ఇంటర్వ్యూ వ్యాసం
బావరో బావర్చి
ఒకసారి నేను గురువుగారితో కలిసి హైదరాబాద్‌లో కారులో వెళ్తున్నాను. “ఇంద్ర” సినిమాకు అర్జెంటుగా పాట రాసివ్వాలి. అవతల ఒత్తిడి. ఈ ట్రాఫిక్ నుంచి బయటపడేదెప్పుడు? గురువు గారు పాట రాసేదెప్పుడు? నాకు ఒకటే టెన్షన్. నల్లకుంట నుంచి చిక్కడపల్లి మా ప్రయాణం. “తేజ గారూ (నన్ను అలాగే పిలిచేవారు), పాట ఫస్ట్ లైన్ రాసుకోండి అంటూ “అమ్మడూ అప్పచ్చీ, నువ్వంటేనే పిచ్చి” అన్నారు. నేను స్టన్ అయ్యాను. రెండో లైను చెబుతారేమోనని నేను ఆసక్తిగా చూస్తున్నాను. బావర్చీ హోటల్ దగ్గర ట్రాఫిక్ స్తంభించిపోయింది. గురువుగారు అటువైపు చూస్తూ “బావర్చి అంటే తెలుసా?” అన్నారు. “తెలియదు గురువుగారు” అన్నాను. బావర్చి అంటే వంటవాడు అన్నారాయన. ఇప్పుడెందుకు ఈ ప్రస్తావన అనుకున్నాను. అంతలోనే ఆయన – ఇప్పుడు రెండో లైను రాసుకోమంటూ “బావరో బావర్చి, వడ్డించు వార్చి” అనేశారు. నాకు నోట మాట రాలేదు. ఆ పాట ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే పాట రాయడానికి ఆయన ప్రత్యేకించి సమయం తీసుకోరు. ఎంతమందిలో ఉన్నా, ఎక్కడున్నా ఆయన మనసంతా పాటై పరవళ్ళు తొక్కుతున్నప్పుడు, మళ్ళీ ప్రత్యేకించి సమయం కావాలా? అనుకున్నాను.
– వేటూరి శిష్యుడు ధర్మతేజ, “దొరకునా ఇటువంటి సేవ” వ్యాసం
“ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమె నీవు” అని అన్నమయ్య ఒక కీర్తనలో అన్నాడు. ఇది వేటూరికీ వర్తిస్తుంది. కొన్ని సార్లు ఆయన చాలా అల్పుడనిపిస్తాడు, అంతలోనే మహోన్నతుడనిపిస్తాడు. “గంగిగోవు పాలు గరిటెడైనా చాలు” అనుకుని ఆయన గొప్ప గీతాలని మనసుకి హత్తుకున్నప్పుడల్లా కలిగే స్పందన అనిర్వచనీయం. అందుకే ఆయన మహాకవి. ఆయనకి అంజలి ఘటిస్తూ, ఆయన్నుంచి ప్రేరణ పొందుతూ, “పాటై బ్రతుకైన పసివాడికి” వినమ్రంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.