వేటూరి విశ్వనాథ్ గారితో తన పాటల అనుభవాల గురించి, “ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను” పాట ఉత్పత్తి గురించి, బాపు-రమణలతో అనుబంధం గురించి, మణిరత్నంతో తన సాన్నిహిత్యం గురించి ఇలా పలువురి సినీప్రముఖులతో తన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ రాసిన వ్యాసం ఇక్కడ.
వేటూరి రచనలు
ఘనరాగరసాల ఘంటసాల
వేటూరి హాసం పత్రికలో ఘంటసాల వర్ధంతి సందర్భంగా ఫిబ్రవరి 2003లో రాసిన వ్యాసాన్ని ఇక్కడ చదవొచ్చు.
వేటూరి – పాటసారి డైరీలోంచి 2
“సీతారామయ్యగారి మనవరాలు” తరువాత నేను రాసిన తెలుగు పాటల్లో నేనే తెలుగుతనాన్ని వెతుక్కోవలసిన స్థితిలో పడ్డాను – వేటూరి
వేటూరి రాసిన కొన్ని పాటల్లో నిజాయితీ కనిపించకపోవచ్చు, కానీ ఆయన మాటల్లో ఎప్పుడూ నిజాయితీ ధ్వనిస్తుంది. ఇలా నిజాయితీ నిండిన వ్యాసం ఇది. ఇందులో తెలుగు భాషపై వేటూరికున్న మమకారం, “సినీ తెలుగు భాష” గురించి ఆవేదనా కనిపిస్తాయ్. ఆయన తన కోసం రాసుకున్న పాటలూ, ఆత్మసంతృప్తి కలిగించిన పాటలూ కొన్ని మన మనసులని పలకరిస్తాయి. ఆయన అభిప్రాయాలతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా స్పందించకుండా ఉండలేము. సాహితీ అభిమానులూ, వేటూరి అభిమానులూ తప్పక చదవవలసిన ఈ చక్కని వ్యాసం ఇక్కడ – http://goo.gl/j6Uz2
పాటసారి డైరీలోంచి – 1 (ETV శ్రీ భాగవతం పాటలు)
హాసంలో వేటూరి “కొమ్మ కొమ్మకో సన్నాయి” శీర్షికన రాసిన వ్యాసాల్లో తన పాటల గురించి రాసుకున్నవి ప్రచురించాను ఇప్పటి దాకా. ఇవన్నీ తర్వాత వచ్చిన “కొమ్మ కొమ్మకో సన్నాయి” పుస్తకంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రచురించబోతున్న మూడు వ్యాసాల ప్రత్యేకత ఏమిటంటే అవి పుస్తకంలో లేవు. కాబట్టి ఈ వ్యాసాలు బహుశా తక్కువ మంది చదివి ఉంటారు. (Correction: ఈ రోజే సరిచూసుకున్నాను. ఈ వ్యాసం కొమ్మకొమ్మకో సన్నాయి పుస్తకంలో ఉంది. నేను పొరబడ్డాను.)
ETV లో బాపూ రమణల భాగవతానికి వేటూరి కొన్ని పాటలు అందించారు. ఆ పాటల గురించి రాసినదీ వ్యాసం. చాలా మంచి వ్యాసం ఇది. ఎలాంటి వస్తువుకి ఎలాంటి భాష వాడాలి, తద్వారా రసపోషణ ఎలా సాధించాలి అన్నది వేటూరి వివరిస్తారు. రసపోషణ అంటే ఒక పాట విన్నప్పుడు మనలో కలిగే స్పందనగా నిర్వచించుకోవచ్చు. ఈ రసపోషణ సరిగా పాటించబడని పాటలు ఎన్నో ఉన్నాయి. నాకు గీతరచయిత చంద్రబోస్‌లో కనిపించే ప్రధానమైన లోపమే ఇది. ఆయన రాసిన కొన్ని పాటల్లో విన్నూతనంగా రాసే ప్రయత్నం వలన పాట వింటే చమత్కారం చేశాడు, కొత్తగా రాశాడు అనిపిస్తుందే తప్ప తగిన రసస్ఫూర్తి కలగదు.
శ్రీ భాగవతం పాటలు ఎక్కడైనా లభ్యమైతే తెలపగలరు. వేటూరి రాసిన వ్యాసం ఇక్కడ: Veturi on Bhagavatam songs
అన్నమయ్య గురించి వేటూరి
అన్నమయ్య గురించి ఎక్కువగా, అన్నమయ్య చిత్రంలో తను రాసిన పాటల గురించి తక్కువగా వివరిస్తూ వేటూరి హాసంలో రాసిన వ్యాసం ఇది. ఈ చిత్రానికి వేటూరి రాసిన పాటలు మూడే – తెలుగు పదానికి జన్మదినం, ఏలే ఏలే మరదలా, అస్మదీయ మగటిమి (అప్పట్లో ఆడియో కేసెట్‌తో పాటూ ఇచ్చిన రంగుల పాటల పుస్తకంలో "ఫాలనేత్రానల" అన్న అన్నమాచార్య కీర్తన కూడా వేటూరి రచనే అని తప్పుగా పేర్కొన్నారు).
అన్నమయ్య ప్రయోగాలపై వేటూరికి ఉన్న అవగాహన వలనే "ఏలే ఏలే మరదలా" పాటని అంత సమర్థవంతంగా రాయగలిగారని ఈ వ్యాసం చదివితే అనిపిస్తుంది (ఈ పాటకి ప్రేరణ ఏదో అన్నమయ్య కీర్తన ఉన్నట్టు గుర్తు, ఏమిటో మీకు తెలిస్తే చెప్పగలరు. అలాగే "వేణువై వచ్చాను భువనానికి" అన్న పాటకి ప్రేరణ కూడా).
"అస్మదీయ మగటిమి" పాట పానకంలో పుడకని అప్పట్లో కొందరు విమర్శించారు. అసలు సినిమాలో సాళవనరసింహరాయలు పాత్రే సరిగా చిత్రించలేదని వేటూరే ఈ వ్యాసంలో – "బాక్సాఫీస్ సూత్రాలకి, అన్నమయ్య చిత్రానికి మధ్యపడి నలిగింది" అనడం ద్వారా ఒప్పుకున్నారు. ఈ పాటని సినిమానుండీ విడదీసి ఒక శృంగార గీతంగా భావిస్తే చాలా మంచి రచనే అని అనిపిస్తుంది నాకు.
ఇక తెలుగుపదానికి జన్మదినం పాట గురించి చెప్పేదేముంది?
ఈ వ్యాసాన్ని ఇక్కడ చదవండి – http://goo.gl/Pmx4w
స్వరరాగ గంగాప్రవాహమే పాట గురించి వేటూరి
వేటూరి గొప్ప పండితులనీ, సంగీత జ్ఞానం బాగా ఉన్నవారనీ తెలిసిన విషయమే. ఒక ఉదాహరణ కావాలంటే "సరిగమలు" చిత్రంలోని "స్వరరాగ గంగా ప్రవాహమే" పాట గురించి వేటూరి హాసంలో రాసిన వ్యాసం చదివితే చాలు. ఈ వ్యాసం ఇప్పటికి నేను చాలా సార్లు చదివినా, నాకు చదివిన ప్రతిసారీ కొత్త విషయం ఒకటి బోధపడడం, అర్థం కానిది కొంత మిగిలిపోవడం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా రెండవ చరణానికి ఇచ్చిన వివరణ అబ్బురపరుస్తుంది.
మంచి బాణీలు ఉంటే, రచయితకి ప్రేరణా, ప్రాణం వచ్చి గొప్ప సాహిత్యం పుట్టే అవకాశం ఎక్కువ ఉంది. ఈ సినిమాలో అన్ని పాటలూ మథురాలే. అన్నీ గొప్ప రచనలే. వేటూరికి 1993 తర్వాత నందీ పురస్కారాలు కానీ, మనస్విని పురస్కారాలు కానీ ఏమీ రాలేదు. చివరి రెండు దశకాల్లో ఆయన అవార్డులివ్వదగ్గ పాటలు ఎన్నో రాశారనడానికి 1994 లో వచ్చిన ఈ సినిమా ఒక ఉదాహరణ.
ఈ పాటపై వేటూరి వ్యాసం ఇక్కడ చదవండి – http://goo.gl/3R7Dt
YouTube లో ఈ పాట ఉన్న ఒక లింక్ –
గలగలగల గంగోత్రి పాట గురించి వేటూరి
సౌలభ్యం కోసం ఈ పాట పూర్తి సాహిత్యం కింద ఇస్తున్నాను:
సాకీ:
జీవనవాహినీ పావనీ
కలియుగమున కల్పతరువు నీడ నీవని
కనులు తుడుచు కామధేను తోడు నీవని
వరములిచ్చి భయముతీర్చి శుభముకూర్చు గంగాదేవి
నిను కొలిచిన చాలునమ్మ సకల లోకపావనీ
భువిని తడిపి దివిగ మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రి
పల్లవి:
గలగలగల గంగోత్రి హిమగిరిజని హరిపుత్రి
పసుపు కుంకుమతో
పాలు పన్నీటితో
శ్రీగంధపు ధారతో
పంచామృతాలతో
అంగాంగం తడుపుతూ
దోషాలను కడుగుతూ
గంగోత్రికి జరుపుతున్న
అభ్యంగన స్నానం
చరణం 1:
మంచు కొండలో ఒక కొండవాగుగా
ఇల జననమొందిన విరజావాహిని
విష్ణుచరణమే తన పుట్టినిల్లుగా
శివగిరికి చేరిన సురగంగ నీవని
అత్తింటికి సిరులనొసగు అలకనందవై
సగరకులము కాపాడిన భాగీరధివై
బదరీవన హృషీకేశ హరిద్వార ప్రయాగముల
మణికర్ణిక తనలోపల వెలసిన శ్రీవారణాసి గంగోత్రి
|| గలగలగల గంగోత్రి హిమగిరిజని హరిపుత్రి ||
అమ్మా గంగమ్మా
కృష్ణమ్మకి చెప్పమ్మా
కష్టం కలిగించొద్దని…
యమునకి చెప్పమ్మా
సాయమునకి వెనకాడొద్దని…
గోదారికి కావేరికి
ఏటికి సెలయేటికి
కురిసేటి జడివానకి
దూకే జలపాతానికి
నీ తోబుట్టువులందరికీ
చెప్పమ్మా మా గంగమ్మా
చరణం 2:
జీవనదివిగా ఒక మోక్షనిధివిగా
పండ్లుపూలుపసుపుల పారాణిరాణిగా
శివునిజటలనే తన నాట్యజతులుగా
జలకమాడు సతులకు సౌభాగ్యదాత్రిగా
గండాలను పాపాలను కడిగివేయగా
ముక్తినదిని మూడుమునకలే చాలుగా
జలదీవెన తలకుపోసె జననీ గంగాభవాని
ఆమె అండ మంచుకొండ వాడని సిగపూదండ
|| గలగలగల గంగోత్రి హిమగిరిజని హరిపుత్రి ||
“పుచ్చా పువ్వుల విచ్చే తావుల” పాట గురించి వేటూరి
వేటూరి హాసం పత్రికలో “కొమ్మకొమ్మకో సన్నాయి” శీర్షికన కొన్ని వ్యాసాలు రాశారు. తర్వాత ఈ వ్యాసాలు అదే పేరుతో పుస్తకంగా వచ్చాయి (అయితే హాసంలో వేటూరి రాసిన కొన్ని వ్యాసాలు పుస్తకంలో లేవు). గంగోత్రి సినిమాలోని “గలగలగల గంగోత్రి” పాట వివరణతో మొదలుపెట్టిన వేటూరి, మరికొన్ని గీతాలనూ వివరించారు. అయితే ఓ 3-4 సంచికల తర్వాత ఎందుకో తన గీతాల గురించి ఇక రాయడం మానేసి సినీప్రముఖులపై తన అభిప్రాయాలనీ, అనుబంధాన్ని గురించి రాయసాగారు. అది జూన్ సంచికైతే ఆ నెలలో పుట్టిన ఓ ప్రముఖుని గురించి రాయడం, ఇలా సాగింది. నా వరకూ అయితే వేటూరి పాటల గురించి రాస్తేనే ఎంతో ఆసక్తిగా ఉండేది, అయినా ఏం చేస్తాం పత్రికకు సంపాదకులూ, ఎడిటర్లూ ఉంటారు కదా, వారు నిర్దేశించిన పథంలో సాగాలి మరి!
వేటూరి హాసం వ్యాసాల్లో తన పాటల గురించి రాసుకున్న వ్యాసాలని నేను స్కాన్ చేసి సినీసాహితీ అభిమానులకోసం వారం వారం అందించే ప్రయత్నం చేస్తున్నాను. “కొమ్మకొమ్మకో సన్నాయి” పుస్తకంలో లేని కొన్ని వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ వారం “మనోహరం” చిత్రంలోని “పుచ్చా పువ్వుల” అనే పాట గురించి వేటూరి రాసిన సమగ్ర వ్యాసం.
స్వయంగా వేటూరి వారే తన పాట గురించి వివరిస్తుండగా మధ్యలో నా గోల అనవసరమే. అయితే ఉబలాటం కొద్దీ కొన్ని విషయాలు పంచుకుంటాను –
- వేటూరి ఈ పాటని తన “గాలి పాటల్లో” ఒకటంటారు. గాలి పాటకే ఇంత ఘుమఘుమ ఉంటే మరిక ఏమనాలి? పైగా ఈ పాట బాణీ వేటూరిదే అన్నది మరో విషయం.
- వేటూరికి ఉన్న గొప్ప విషయపరిజ్ఞానం ఈ వ్యాసంలో కనిపిస్తుంది. కవికి, అదీ సినిమా కవికి, కొంత ప్రతిభా, పదసంపదా ఉంటే చాలా, లేక అన్ని విషయాలపై కొంత సమగ్ర అవగాహన ఉండాలా అని ఒక ప్రశ్న. ఎక్కువ తెలుసుకుంటే ఆ తెలుసుకున్న దాన్లోనే పడి తిరగడం తప్ప సృజనాత్మకతకి పెద్ద స్థానం ఉండదని కొందరి అభిప్రాయం. ఇందులో కొంత నిజం లేకపోలేదు. అయితే దీనర్థం ఏమీ తెలుసుకోకూడదనీ కాదు. రెంటినీ బ్యాలన్స్ చెయ్యడం ఎలాగో వేటూరి వంటి వారు ఎలాగూ దారి చూపించారు.
- వచనంలో కూడా వేటూరి దిట్టని ఈ వ్యాసం మళ్ళీ నిరూపిస్తుంది. ప్రకృతి వర్ణన ఎంతో రమణీయంగా చేశారు.
- ఈ పాటని అనుభూతి చెందాలి. ఆ భావంలో నిమగ్నమవ్వాలి. పల్లెలూ, ప్రకృతి సౌందర్యాలతో అంతగా పరిచయం లేని నాబోటి వారు ఊహల్లోనే ఈ పాటని ఎంతో కొంత మరి అనుభూతి చెందాలి. అందుకే వేటూరి గర్వంగా ఈ అద్భుతచిత్రాలన్నీ దర్శించిన జన్మ నాది అని చాటుకున్నారు. అవును వేటూరి గారూ, మీరు ధన్యులు!
Google docs లో ఈ స్కాన్ చేసిన PDFని షేర్ చేస్తున్నాను – మనోహరమైన పాట . డౌన్లోడ్ చేసుకోండి, చదవండి, ఆస్వాదించండి, మిత్రులకి పంచండి!
సుందరమో సుమథురమో!
(వేటూరి “హాసం” అనే ఒక పత్రికలో కొమ్మ కొమ్మకో సన్నాయి అనే శీర్షికన కొన్ని వ్యాసాలు రాశారు. ఈ వ్యాసాలలో కొన్ని తర్వాత ఇదే పేరు గల ఒక పుస్తకంగా కూడ వెలువడ్డాయి. ఆ పుస్తకంలో కొన్ని విషయాలు అందరికీ తెలియాలని చేస్తున్న ప్రయత్నం ఇది.)
రాజపార్వై అనే తమిళ చిత్రాన్ని తెలుగులో కూడా ఏకకాలంలో తీయడం జరిగింది. ఇళయరాజాతో నాకు అదే తొలి పరిచయం. అప్పుడే తమిళ కవి వైరముత్తుకు ట్యూన్ ఇచ్చాననీ, అప్పుడే ఆయన (అంటే నేను) వస్తే బాగుండేది కదా అన్న పుల్లవిరుపుతో ప్రారంభమైంది ఈ పరిచయం. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుగారు ఏదో సర్ది చెప్పబోయారు. ఇదేదో బ్రతిమాలుడు వ్యవహారంగా తోచి నేను లేచి వెళ్ళబోయాను. తాను చాలా బిజీగా ఉన్నాననీ, తమిళ కవి ట్యూన్ ఇవ్వగానే అలా పల్లవి రాసిచ్చాడనీ, ఇప్పటికే తనకు లేటయ్యిందనీ – ఇదీ వరస….విరసంగా సాగింది.
“నేనూ చాలా బిజీయే…అలా చెప్పుకోవడం పద్ధతి కాదు….వస్తాను” అన్నాను.
“ఎన్నా సార్ – కవింగర్ కి కోపం వందదు పోలె ఇరిక్కే….సారీ సార్!” అంటూ ఆ ట్యూన్ వినిపించాడు ఇళయరాజా.
వినగానే ఆనందం కలిగింది. “ఇలా వినగానే తమిళకవి అలా రాసిచ్చాడు” అన్న మాట మదిలో మెదిలింది. “ఎళుదుకురాంగళా” అన్నాను….”పల్లవి రాసుకుంటారా” అని.
“ఇప్పుడే చెప్పేస్తారా? అయితే చెప్పండి” అన్నాడు
సుందరమో సుమధురమో
చందురుడందిన చందన శీతలమో
మలయజ మారుత శీకరమో
మనసిజ రాగవశీకరమో
అని పల్లవి చెప్పాను. అది పాడుకుని చూసి, బయటకు పాడి వినిపించి, “ఎంత మధురంగా ఉంది. ఆహా! సుందరత్తెలుంగు అని భారతి మహాకవి ఎందుకున్నాడో ఇప్పుడు తెలిసింది” అని నన్ను కూడా మెచ్చుకున్నాడు.
ఆ ముహూర్తమెటువంటిదో మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలీ కుసుమాలు వికసించాయి…
— “ఇద్దరూ ఇద్దరే! శృతి సుఖ సారే, రస నదీ తీరే” వ్యాసం. పే: 87-88
(ఈ పాట మొదట్లో వినిపించే “సరిగమపదని సప్తస్వరాలు మీకు, అవి ఏడు రంగుల ఇంద్రధనుస్సులు మాకు” అనే అద్భుతమైన అంధబాలుల ప్రార్థనా గీతం పల్లవి కూడా వేటూరి ఆశువుగా 5 నిమిషాల్లో రాసెయ్యడం తనకు ఎంతో ఆశ్చర్యం కలిగించిందని సింగీతం వారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ పాట సంగీతం కూడా అద్భుతమే. ఇక్కడ చూడండి – )
ఏరెల్లి పోతున్నా నీరుండిపోయింది!
(వేటూరి “హాసం” అనే ఒక పత్రికలో కొమ్మ కొమ్మకో సన్నాయి అనే శీర్షికన కొన్ని వ్యాసాలు రాశారు. ఈ వ్యాసాలలో కొన్ని తర్వాత ఇదే పేరు గల ఒక పుస్తకంగా కూడ వెలువడ్డాయి. ఆ పుస్తకంలో కొన్ని విషయాలు అందరికీ తెలియాలని చేస్తున్న ప్రయత్నం ఇది.)
ముందుగా వేటూరి స్మృతిగీతంగా తోచే ఈ పాట. దీనికి ఇక్కడ వినొచ్చు: ఏరెల్లి పోతున్నా
ప్రముఖ దర్శకుడు శ్రీ తాతినేని ప్రకాశరావు తీసిన “ఆశా జ్యోతి” చిత్రానికి పడవ పాట ఒకటి కావలసి వచ్చింది. సన్నివేశం చాలా ఉదాత్తమైనది. తన ప్రియుడు పడవలో గోదావరి దాటి వెళ్ళిపోతుంటే తన మనసు అతనికి చెప్పాలని పరుగు పరుగున వచ్చిన కన్నెపిల్ల. మాటకందని దూరంలో వెళ్ళిపోతున్న పడవలో ప్రియుడు. ఇదీ సన్నివేశం. ఇక్కడ పడవవాడు ఆ సన్నివేశంలో తను పాడుకునే ఓ పడవపాట. ఆ సన్నివేశానికీ, ఆ కన్నెపడుచు మనోభావానికి అద్దం పట్టే పాటగా ఉండాలి.
ఒకరిద్దరి చేత దర్శకుడు రాయించి రమేష్ నాయుడు గారికి ఇచ్చారు. కానీ నాయుడు గారికి ప్రేరణ కలగలేదు. కంపోజింగు ఆగిపోయింది. “ఏం చేద్దాం?” అన్నారు దర్శకులు. వెంటనే నాయుడుగారు విజయా గార్డెన్సుకు వచ్చి – “నాకో పాట కావాలి. సన్నివేశం నేను చెబుతాను. రాసి పెట్టండి” అన్నారు. ఆ తరువాత నేను చెబుతుంటే ఆయనే రాసుకున్నారు.
ఏరెల్లి పోతున్నా నీరుండిపోయింది
నీటిమీద రాత రాసి నావెల్లిపోయింది
కోటిపల్లి రేవుకాడ సిలకమ్మ గొడవ
కోరంగి దాటింది గోరింక పడవ
ఇదీ పల్లవి! ఈ పల్లవి నేను చెప్పగానే ఆయన – “చరణాలు రాసి పంపండి. మనిషిని పంపుతాను. నా మటుకు నాకు పాట వచ్చేసింది” అని హుటాహుటిని వెళ్ళిపోయారు. ఆ పాట రికార్డింగుకి కూడా నేను వెళ్ళలేదు. అది వినిపించడానికి నాయుడు గారూ, ప్రకాశరావు గారు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. చాలా ఆనందంతో ప్రకాశరావు గారు నన్ను ఆలింగనం చేసుకున్నారు. ఆ పాట వింటే రమేష్ స్వరకల్పనా శిల్పం రేఖామాత్రంగా శ్రోతలకు దర్శనమిస్తుంది.
— “నాయుడు గారూ, నవమి నాటి వెన్నెల మీరు – దశమి నాటి జాబిలి నేను” వ్యాసం, పే: 104-105.
…ఆయన భౌతికంగా దూరమయ్యాక నేను ఆయనకు రాసిన పడవ పాటలోని ఈ చరణం ఆయనకు గుర్తుగా మిగిలిపోయింది –
ఏటిపాప శాపమ్మ ఎగిసి తాను సూసింది
ఏడినావోడంటే ఏటిలోన మునిగింది
శాపమునిగినా కాడ శతకోటి సున్నాలు
శాపమైన గుండెలోన సెప్పలేని సుడిగుండాలు…
ఏరెల్లి పోతున్నా నీరుండిపోయింది
నీటిమీద రాత రాసి నావెల్లిపోయింది!!
— పే: 113