వేటూరిని ఎలా స్మరించుకోవాలి? – సిరివెన్నెల సీతారామ శాస్త్రి

(ఈ రోజు (మే, 22, 2011) వేటూరి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా, సిరివెన్నెల వేటూరి పోయినప్పుడు రాసిన ఓ ప్రచురితం కాని వ్యాసం నుంచి కొన్ని వాక్యాలు గ్రహించి ఇది చేశాను. ఈ టైటిల్ నాది. మాటలన్నీ సిరివెన్నెలవి!)

ఈనాడు మన తెలుగుసమాజంలో అనేకమంది పండితసమానులూ, మహామహులమనుకుంటున్న వారి దృష్టిలో “ఆఫ్ట్రాల్” అనిపించే సినీగేయ రచన ద్వారా శ్రీ వేటూరి వారు (ఆయన పేరు ముందు కీ.శే అని చేర్చడం నాకు ఇష్టం లేదు. ఆయన తన గీతాల ద్వారా శాశ్వతుడు) ఎంతో స్ఫూర్తి కలిగించారు…

నేనైనా, మరెవరైనా, ఎంత వారైనా సాహిత్యాన్ని “ఉద్దరించ”గలిగేంత అవతారపురుషులు ఎవరూ ఉండరు. కాలప్రవాహంలో ఎంతోమంది వస్తూ ఉంటారు, వెళుతుంటారు. అతి కొద్దిమంది మాత్రం శ్రీ వేటూరి గారిలా కాలాన్ని అధిగమించి శాశ్వత స్థానాన్ని శాసిస్తారు. ఆయన తర్వాత తరానికి చెందిన నాబోటి వాళ్ళు ఆయన సాధించిన ఆ ఘనతని ఆదర్శంగా, గమ్యంగా భావించి ఆ మార్గంలో ప్రయాణించడానికి ప్రయత్నించాలి…

…ఎవరెస్టు శిఖరం ఒక్కటే ఉంటుంది. మొదట ఎవరు అధిరోహించారు అన్నదే చరిత్ర. తరువాత మరికొందరు ఆ శిఖరాన్ని అధిరోహించడం అన్నది చరిత్ర కాదు. శ్రీ వేటూరి గారు తొలిసారి ఎవరెస్టుని అధిరోహించారు…

వ్యక్తుల పట్ల కన్నా వారు నెలకొల్పిన “విలువల” పట్ల దృష్టి మళ్ళించాలి. సాహిత్యం శాశ్వతం, సాహితీకారుడు కాదు. పాట శాశ్వతం, “పాటసారి” కాదు.

వేటూరి జన్మదిన కానుక – ఒక పాత ఇంటర్వ్యూ పరిమళం

వేటూరి సుందరరామమూర్తి గారి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పోయిన తర్వాత మొదటిది. తప్పు ,తప్పు! సిరివెన్నెల గారు అన్నట్టు – “వేటూరి పేరు ముందు కీ.శే అని తగిలించడం నాకు ఇష్టం లేదు. ఆయన తన గీతాల ద్వారా శాశ్వతుడు”. కాబట్టి వేటూరి పోయారనుకోడానికి లేదు.
అసలు వేటూరి ఏం గొప్పగా రాసాడని, చెత్త తప్ప, ఆయన గురించి అతి చేస్తున్నారు అన్న వాళ్ళని నేను చాలా మందిని చూసాను. సముద్రాన్ని పిల్ల కాలువలు కొలవలేవు. అసలు ఆయన సముద్రమా కాదా అన్న డౌట్ ఉంటే తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. నాకు తెలియదు, confusion లో ఉన్నాను అన్నది మంచి స్థితి, నాకు తెలుసు అనుకోడం కన్నా.
ఆయన గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి “జయంతి చక్రవర్తి” గారు Phd పట్టా కోసం రాసిన థీసిస్, “వేటూరి పాట” పుస్తకంలో ఉన్న 1999 లో చేసిన interview బాగా ఉపకరిస్తుంది. 114 ప్రశ్నలతో ఉన్న interview లో ఒక 11 ప్రశ్నలని తీసుకుని ఇక్కడ అందిస్తున్నాను.  ఇది ఆయనకి నేను అందించే ఒక చిరునివాళి.

1. మీరు చదివిన విద్యలో మీకు నచ్చినది ఆంధ్రసాహిత్యమా లేక ఆంగ్లసాహిత్యమా?

రెండూనండీ. రెండూ గొప్పవే. నేను చదివింది, విన్నది ఎంత? నా చదువు చాలా కొద్ది కానీ ఒక కీట్స్ వంటి మహాకవిని కన్న ఆంగ్లసాహితీ సరస్వతి ఎంత గొప్పదో. జాన్ కీట్స్ – ఆయన ప్రభావం నామీద చాలా ఉంది. ఆ రోజుల్లో మా గురువులు శ్రీ మల్లాది గారితో చెప్తూ ఉంటాను. ఇదే విషయాన్ని ఆయన ఒకసారి నాతో అన్నారు – “నాయనా, అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం” అనే పాట నాదే అనుకుంటున్నావేమో, కాదు కాదు ఆ భావన కీట్స్ ది అన్నారాయన.

(వేటూరి గారి ఆంగ్ల సాహితీ పరిజ్ఞానం గురించి చాలా మందికి తెలియదు. ఆయన పాటల్లో కొన్న భావాలు ఆంగ్ల సహితీ ప్రభావం నుంచి వచ్చినవని గ్రహించాలి)

2. సినిమా పాటల రచయితకి ఉండాల్సిన ప్రాథమిక అర్హతలు?

సినిమాపాటల రచయితకి ప్రపంచజ్ఞానం ముఖ్యంగా ఉండాలి. ఏదైనా రాయగలిగిన శక్తి కలిగి ఉండాలి. ఇంకా సాహితీపరిచయం బాగా ఉండాలి. అలాగే సంగీత పరిచయం కూడా ఉండాలి. అప్పుడు కానీ పాట రాయడానికి అర్హుడు కాడేమో అని నా అభిప్రాయం.

(ఈ లెక్కన నాబోటి వారు అసలు పాటలు రాయకూడదు! ఇవన్నీ వేటూరి కి ఉన్నాయి. ఇవి ఈ కాలం వారికి కొంత కష్టసాధ్యమే ఏమో కాని ఒక ideal గా పనికివస్తాయ్)

3. సినిమా పాట ఎలా ఉండాలి?

గేయము అంటే పాడటానికి వీలైనది, పాడితే ఆస్వాద్యంగా ఉండేది. ప్రతి రచనా గేయం కాదు, ఆ గేయం గానానికి అనుగుణంగా ఉండడానికి కొన్ని చందోనియమాలున్నాయి. యతిప్రాసలు, స్వరపద సంధానం చెయ్యగలిగిఉండటం, చక్కని ఊహాశక్తి, పాటలో వాడిన చందస్సు తాళానికి అనుగుణంగా ఉండడం, ఇలా. యతిప్రాసలు లేనట్టి పాటలను నేను అంగీకరించను.

(వేటూరి పాటలు ఎప్పుడైనా భావం వదిలేసి కేవలం musical గా విని చూడండి. ఎంత అందమగా అనిపిస్తాయో. డబ్బింగ్ సినిమాలకి రాసిన పాటలు కూడా. ఈ ప్రతిభను ఈ కాలం రచయితలు గమనించి తామూ నేర్చే ప్రయత్నం చెయ్యాలి)

4. ఇతర భాషా రచయితల్లో మీకు ఇష్టమైన వారు?

హిందీ – శైలేంద్ర, శైలేంద్ర, శైలేంద్ర. ముగ్గురి పేర్లు చెప్పమంటే ఒక్క శైలేంద్ర పేరే మూడు సార్లు చెబుతాను. “జీనా యహా మర్నా యహా ఇస్కే సివా జానా కహా” అన్న శైలేంద్రని మించిన కవి హిందీలో లేడు, నా అభిప్రాయంలో….
తమిళ్ – కణ్ణదాసన్. నిస్సందేహంగా కణ్ణదాసన్. కాళిదాసు తమిళుడుగా పుట్టి తమిళ సినిమా పాటలు రాయటానికి వచ్చాడేమో అని నా అభిప్రాయం. అంతటి వేదాంతి, ప్రవక్త, కవి ఇంకొకర్ని నేను చూడలేదు.

(వేటూరి గారికి హిందీ, తమిళ పాటల గురించి చాలా తెలుసన్న విషయం గ్రహించాలి. ఇది ఖచ్చితంగా ఆయనికి పాటలు రాయడంలో ఉపకరించింది)

5. సినిమాపాటల రచయితకి సంగీత పరిజ్ఞానం అవసరమా?

సంగీత పరిజ్ఞానం లేనిదే ఎవరైనా పాట రాయడానికి అనర్హుడని నా అభిప్రాయం. భావం ఎటువంటిది, దాన్ని ఏ రాగంలో, ఏ స్థాయిలో చెబితే బాగుంటుందో, ఇచ్చిన ట్యూన్ ఏ స్థాయిలో ఉందో, ఏ రాగంలో ఉందో, దానికు అణుగుణంగా సాహిత్యం రాయాలనేది నా నమ్మకం. అలా రాసినప్పుడే ఆ లిరిక్‌కి ఒక atmosphere ఏర్పడుతుంది. దానివల్ల దానికి ఒక మంత్రశక్తి ఏర్పడి, అది వినే శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అట్లా జరగనప్పుడు తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అన్నట్లు, unmusical words తో రాసే లిరిక్స్ నాకు అట్టే ఇష్టముండదు

(పాటకి, కవితకి ఉన్న ఈ తేడా గీతరచయితలు తప్పక గమనించాల్సింది. చాలా సార్లు చదవడానికి బానే ఉన్నా వినడానికి బావులేని పాటలు చూస్తాం. అలాగే చదవడానికి మాములుగా ఉన్నా వింటున్నప్పుడు సమ్మోహపరిచే సాహిత్యం లేకపోలేదు)

6. మీ దృష్టిలో సినిమా పాటకి భాష ముఖ్యమా లేక భావం ముఖ్యమా?

మౌనభాష భావం, వ్యక్తభావమే భాష. ఈ రెండూ “వాగర్ధావివసంపృక్తౌ” అన్నట్లు, అర్థం-మౌనం, వాక్కు – శబ్దం. అర్థానికి శబ్దం కావాలి, శబ్దానికి అర్థం కావాలి. భాష ముఖ్యమా భావం ముఖ్యమా అంటే భాషాభావం వేరుకాదు. భావంలేని భాష లేదు అని చెప్పాలి.

(అర్థంపర్థం లేని పాటలు చాలా రాసారని వేటూరి పై ఒక విమర్శ ఉంది. ఇందులో కొన్ని పాటలకి “అర్థం లేకపోవడం” కన్నా “అర్థం కాకపోవడం” ఉన్నది. ఊరికే లొల్లాయిగా రాసిన పాటలకి కూడా అర్థంలేకపోదు, రాసినప్పుడు రచయిత మదిలో మెదులుతుంది అది. అయితే పాట అల్లాటప్పా కనుక తీసుకున్న చొరవ వల్ల రచయిత భావం అంత స్పష్టంగా తెలియకపోవచ్చు)

7. మీరు రాసిన పాటల్లో బాగా కష్టపడి రాసినవి?

సినిమాపాట situation చెప్పగానే ఒక రైటర్‌కి కలిగే reflex అని నా అభిప్రాయం. అందుకనే ఒక పల్లవి మనం ఎందుకు రాసామో అవతలివాడికి అర్థంకాక గానీ, నిజంగా అతనికి నచ్చకగానీ, ఇంకేమైనా రాయండి గురువుగారు అని అడుగుతుంటే రాస్తాం గానీ – “The first will be best always because it is a natural reflex”. ప్రతిస్పందన. అదే సాహిత్యం.

నేను అతికష్టపడి రాసినవి కొన్ని ఉన్నాయ్. అంటే ఆ situation కి ఎలా రియాక్ట్ అవటం అనే సందేహం వస్తుంది. We can react which is the best of the way, it all depends on reflectivity. అప్పుడు ఇంకొకళ్ళు కావాలి, ఇది బాగుంది అని మనకి మనం సంతృప్తి పడితే సరిపోదు, అవతలివాళ్ళకి నచ్చుతుందా లేదా అని చూడాలి….

(ఈ మాటల్లో నిండిన అనుభవం, జ్ఞానం అందరు రచయితలకీ పనికివచ్చేదే కదా. ఇక్కడ reflex గురించి వేటూరి చెప్పడం ఆయనకి ఉన్న surrealistic భావాలకి దర్పణం. surrealism గురించి ఇంకో ప్రశ్నలో)

8. ఈ పరిశ్రంలో మీకు తగిన గుర్తింపు వచ్చిందని భావిస్తున్నారా?

గుర్తింపు లభించవలసినదానికంటే ఎక్కువే లభించిందని ఒకో సారి అనిపిస్తుంది. కాని నా మిత్రులు SPB లాంటి వారు నాకు తగిన గుర్తింపు రాలేదని బాధపడతారు. వీరు బాధపడటమే నాకు తగిన గుర్తింపు అని భావిస్తాను నేను.

(వేటూరి బహుశా రాని అవార్డుల గురించి, పురస్కారాల గురించి అంతగా మథనపడి ఉండి ఉండరు ఎప్పుడూ. ఒక విధంగా ఆయన కర్మయోగి. తన పని, తనకి తోచిన పద్ధతిలో చేసుకు పోయారు అంతే)

9. మీ ప్రకృతి వర్ణనలపై ఏ సాహిత్య ప్రభావం ఎక్కువ ఉంది? ఆంధ్రమా, ఆంగ్లమా, ఆర్షమా?

ఒకరకంగా చెప్పాలంటే ఆంగ్లమే. కీట్స్, షెల్లీ, వర్డ్స్ వర్త్ వంటి వారు చేసిన ప్రయోగాలు కొన్ని నేనూ చేసాను. ఆ ప్రయోగాల్లో ఒక అస్పష్టమైన “రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై” అని ఒక పాటలో రాసాను. ఏమిటిది అంటే అది నాకు అర్థం కావలసిందే, మీకర్థమైనవే రాస్తే ఇతరులకి ప్రయోజనం ఏమిటని? అంటే అక్కడ భావుకత, ఆ కేరెక్టర్‌ని నిలబెట్టే మాటలు అవే – “రాలిపోయిన పువ్వుల్లో తేనెని వెతికే రాతితుమ్మెదా ఉంటుంది. ఈ తుమ్మెద ఇక్కడనుంచి కదలలేదు. ఆ రాలినపూలలోంచి తేనిపొంగి పైకిరాదు” అనే భావం కోసం రాసాను. దీనికి మరో పేరు సర్రియలిజం, అధివాస్తవికత. అది నాకు చాలా ఇష్టం. ఈ అధివాస్తవికత ఉన్నదే కవిత్వం అనిపించుకుంటుంది.

(వేటూరి రాసిన అర్థం కాని ఎన్నో భావాలు అధివాస్తవికత వల్ల అని ఇది చదివితే తెలుస్తుంది. అధివాస్తవికతలో అస్పష్టత ఉన్నా, అది కలిగించే “భావ సాంద్రత” గొప్పగా ఉంటుంది)

10. మీరు పాటల రచయితగా తొలిరోజుల్లో పోటీనీ గానీ ఇబ్బందిని గానీ ఎదుర్కొన్నారా?

ఏనాడూ నేను ఎదుర్కోనిది ఏదన్నా ఉంటే ఇదొక్కటే. నాకు ఎవర్నీ పోటిగా నేను భావించలేదు. అసలు ఆ దృష్టి ఉండేది కాదు. నా పని నేను చేసుకుపోయేవాణ్ణి.

(వేటూరి గారిని కర్మయోగి అన్నది ఇందుకే)

11. సినిమారంగంలో రచనాపరంగా వారసులుగా ఎవరిని భావిస్తారు?

వారసుల్ని గురించిన ఆలోచన లేదు. నాకన్నా ఎక్కువ విలువలు పాటిస్తున్న వాళ్ళు కూడా ఉండొచ్చు పరిశ్రమలో. నేనేదో పెద్ద విలువలు పాటించానని, అది నిలబెట్టే వారసులకోసం నేను ఆ లెవల్లో ఆలోచించను. ఈ నా వారసత్వమే రానక్కరలేదు, ఇంతకన్నా బెటర్ వారసత్వమూ రావచ్చు. ఆత్రేయ గారు నన్ను తన వారసునిగా చెప్పుకోటానికి, అంతగా నన్నాయన ప్రేమించాడు, అభిమానించాడు, తులనాత్మకంగా చూసాడు. ఒక కవిగా నన్ను observe చేసాడు. నాకా ధోరణి లేదు. ఒంటరిగా నా పని నేను తలొంచుకుని చేసుకుంటూ పోవడమే తప్ప…

(వేటూరి వారిలో ఉన్న ఒక మంచి లక్షణం – తన పరిమితుల గురించి, తప్పుల గురించి తాను ఎరిగి ఉండడం. ఈ లక్షణాన్ని పుణికిపుచ్చుకోవడం కూడా ఈనాటి రచయితలకి అవసరమేమో)

జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః

నాస్తి యేషాం యశః కాయే జరామరణజం భయం

 

వేటూరి గురించి సిరివెన్నెల

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన వ్యాసాలు చదివినవారికి ఆయన ఎంత బాగా విశ్లేషించి రాస్తారో తెలిసిన విషయమే. హాసం పత్రికలో చాలా రోజుల క్రితం వేటూరి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన రాసిన వ్యాసం బహుశా వేటూరి గారిపై వచ్చిన వ్యాసాల్లోకెల్లా గొప్పది. ఈ వ్యాసం గతంలో సిరివెన్నెల website లో ఉండేది. ఇప్పుడు ఆ సైట్ లేకపోవడం వల్ల నేను ఈ వ్యాసాన్ని స్కాన్ చేసి అందిస్తున్నాను.

Sirivennela on Veturi 

మరుమల్లెల్లో ఈ జగమంతా

అమృత సినిమా శ్రీలంకలోని తమిళుల ఆవేదనకి అద్దం పట్టిన సినిమా. తమ సొంత గూటి నుంచి వలసి వచ్చి, భయంతో బిక్కుబిక్కుమంటూ, శాంతినీ, సుఖాన్నీ కోల్పొయినవాళ్ళ దయనీయ పరిస్థితిని మణిరత్నం అద్భుతంగా ఆవిష్కరించాడు. రోజూ హింసా, రక్తపాతాల నడుమ నలిగిపొతున్న జీవితంలో ఏదో ఒక రోజు శాంతిని పంచే ఉషోదయం రావాలని అభిలషిస్తూ ఒక కవి పాడే గీతమే “మరుమల్లెల్లో” అనే పాట. సినిమానుంచి తీసి చూస్తే శాంతిని కాంక్షించే ఒక చక్కని భావగీతంలా కనిపిస్తుంది.

 

తమిళ గీతరచయిత వైరముత్తుకి జాతీయ అవార్డ్ తెచ్చి పెట్టిన ఈ సినిమా పాటలు తెలుగులో వేటూరి రాశారు. వేటూరి అనువాదాలు జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం బోధపడుతుంది – తమిళ భావం మాత్రమే ఆయన తీసుకుని తెలుగు చేస్తారు, కొన్ని సార్లు మారుస్తారు కూడా, అంతే కానీ మక్కికిమక్కీ దించరు. ఈ పాటకి అదే ఆయన చేశారు. వేటూరి అనువాదాల్లో ఉండే క్లిష్టత ఈ పాటలో కనిపించదు. ఈ చక్కని పాట గురించి క్లుప్తంగా –

 

మరుమల్లెల్లో ఈ జగమంతా విరియగా

ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా

పారాణేదో భుమికి వెలుగుగా

మందారాలే మత్తును వదలగా

కనుల తడి తుడిచే ఒడిలో పసి పాపాయి

చిలికే చిరునగవే చీకటితల్లికి వేకువ

 

శాంతి నిండిన జగాన ఉదయం ఎంత మనోహరంగా ఉంటుందో కవి ఊహిస్తున్నాడు. “పారాణి, మందారాలు” – ఇవి వేటూరి పెట్టిన తెలుగింటి సందెదీపాలు. పసి పాపలు హాయిగా నవ్వినప్పుడే నిజమైన వేకువ అంటూ, “చీకటితల్లి” అని వాడడం ఎంత గొప్ప ప్రయోగం!

 

గాలిపాటల జడివాన జావళి, అది మౌనంలా మధురం అవునా?

వేలమాటలే వివరించ లేనిది, తడి కన్నుల్లా అర్థం, అవునా?

 

రెహ్మాన్ పదాలు సరిగ్గా పాడకుండా మింగెయ్యడంతో ఈ చరణం ఎవరికీ అర్థం కాకుండా పోయింది. సరే చూద్దాం. “జడివాన జావళి” – ఆహా ఇదో వేటూరి చమత్కారం. ఈ జడివాన జావళి ఎంత బాగున్నా మౌనం అంత ఆనందం కలిగించదు అంటున్నాడు. అలాగే తడి కన్నులు ఇట్టే చెప్పగలిగే విషయాన్ని వేలమాటలు వివరించలేవన్నాడు. ఈ రెండు వాక్యాలకీ అర్థం ఎవరికి వారు తమ అంతరంగమౌనంలో తెలుసుకోవలసిందే కానీ నేను వివరించలేను.

 

లేతపాపల చిరునవ్వుతోటకే దిగివస్తావా సిరులవెన్నెలా

వీరభూమిలో సమరాలు మానితే వినిపించేనా స్వరమే కోయిలా

 

“లేతపాపల చిరునవ్వుతోట” అనడం ఎంత కవిత్వం! పసిపాపలు హాయిగా నవ్విన నవ్వుల్లో వెన్నెల కురుస్తుందని ఎంత బాగా చెప్పారు. యుద్ధాలు మానిన రోజు కోయిల స్వరాలు వినిపిస్తాయ్ అంటున్నాడు.

 

ఈ పాటని రెహ్మాన్ గొప్పగా స్వరిపరిచాడు. మనసులోతులు తాకుతుందీ స్వరరచన. గొప్ప సాహిత్యం తోడైన ఈ పాట టీవిలో, పేపర్లో ఎప్పుడు తీవ్రమైన హింస గురించి చదివినా నా మనసులో మెదులుతూ ఉంటుంది, పెదవిపై పలుకుతూ ఉంటుంది.

 

 

సుందరమో సుమథురమో!

(వేటూరి “హాసం” అనే ఒక పత్రికలో కొమ్మ కొమ్మకో సన్నాయి అనే శీర్షికన కొన్ని వ్యాసాలు రాశారు. ఈ వ్యాసాలలో కొన్ని తర్వాత ఇదే పేరు గల ఒక పుస్తకంగా కూడ వెలువడ్డాయి. ఆ పుస్తకంలో కొన్ని విషయాలు అందరికీ తెలియాలని చేస్తున్న ప్రయత్నం ఇది.)

రాజపార్వై అనే తమిళ చిత్రాన్ని తెలుగులో కూడా ఏకకాలంలో తీయడం జరిగింది. ఇళయరాజాతో  నాకు అదే తొలి పరిచయం. అప్పుడే తమిళ కవి వైరముత్తుకు ట్యూన్ ఇచ్చాననీ, అప్పుడే ఆయన (అంటే నేను) వస్తే బాగుండేది కదా అన్న పుల్లవిరుపుతో ప్రారంభమైంది ఈ పరిచయం. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుగారు ఏదో సర్ది చెప్పబోయారు. ఇదేదో బ్రతిమాలుడు వ్యవహారంగా తోచి నేను లేచి వెళ్ళబోయాను. తాను చాలా బిజీగా ఉన్నాననీ, తమిళ కవి ట్యూన్ ఇవ్వగానే అలా పల్లవి రాసిచ్చాడనీ, ఇప్పటికే తనకు లేటయ్యిందనీ – ఇదీ వరస….విరసంగా సాగింది.

“నేనూ చాలా బిజీయే…అలా చెప్పుకోవడం పద్ధతి కాదు….వస్తాను” అన్నాను.

“ఎన్నా సార్ – కవింగర్ కి కోపం వందదు పోలె ఇరిక్కే….సారీ సార్!” అంటూ ఆ ట్యూన్ వినిపించాడు ఇళయరాజా.

వినగానే ఆనందం కలిగింది. “ఇలా వినగానే తమిళకవి అలా రాసిచ్చాడు” అన్న మాట మదిలో మెదిలింది.  “ఎళుదుకురాంగళా” అన్నాను….”పల్లవి రాసుకుంటారా” అని.

“ఇప్పుడే చెప్పేస్తారా? అయితే చెప్పండి” అన్నాడు

సుందరమో సుమధురమో
చందురుడందిన చందన శీతలమో
మలయజ మారుత శీకరమో
మనసిజ రాగవశీకరమో

అని పల్లవి చెప్పాను. అది పాడుకుని చూసి, బయటకు పాడి వినిపించి,  “ఎంత మధురంగా ఉంది. ఆహా! సుందరత్తెలుంగు అని భారతి మహాకవి ఎందుకున్నాడో ఇప్పుడు తెలిసింది” అని నన్ను కూడా మెచ్చుకున్నాడు.

ఆ ముహూర్తమెటువంటిదో మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలీ కుసుమాలు వికసించాయి…

— “ఇద్దరూ ఇద్దరే! శృతి సుఖ సారే, రస నదీ తీరే” వ్యాసం. పే: 87-88

(ఈ పాట మొదట్లో వినిపించే “సరిగమపదని సప్తస్వరాలు మీకు, అవి ఏడు రంగుల ఇంద్రధనుస్సులు మాకు” అనే అద్భుతమైన అంధబాలుల ప్రార్థనా గీతం పల్లవి కూడా వేటూరి ఆశువుగా 5 నిమిషాల్లో రాసెయ్యడం తనకు ఎంతో ఆశ్చర్యం కలిగించిందని సింగీతం వారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ పాట సంగీతం కూడా అద్భుతమే. ఇక్కడ చూడండి – )

ఏరెల్లి పోతున్నా నీరుండిపోయింది!

(వేటూరి “హాసం” అనే ఒక పత్రికలో కొమ్మ కొమ్మకో సన్నాయి అనే శీర్షికన కొన్ని వ్యాసాలు రాశారు. ఈ వ్యాసాలలో కొన్ని తర్వాత ఇదే పేరు గల ఒక పుస్తకంగా కూడ వెలువడ్డాయి. ఆ పుస్తకంలో కొన్ని విషయాలు అందరికీ తెలియాలని చేస్తున్న ప్రయత్నం ఇది.)

ముందుగా వేటూరి స్మృతిగీతంగా తోచే ఈ పాట. దీనికి ఇక్కడ వినొచ్చు: ఏరెల్లి పోతున్నా

ప్రముఖ దర్శకుడు శ్రీ తాతినేని ప్రకాశరావు తీసిన “ఆశా జ్యోతి” చిత్రానికి పడవ పాట ఒకటి కావలసి వచ్చింది. సన్నివేశం చాలా ఉదాత్తమైనది. తన ప్రియుడు పడవలో గోదావరి దాటి వెళ్ళిపోతుంటే తన మనసు అతనికి చెప్పాలని పరుగు పరుగున వచ్చిన కన్నెపిల్ల. మాటకందని దూరంలో వెళ్ళిపోతున్న పడవలో ప్రియుడు. ఇదీ సన్నివేశం. ఇక్కడ పడవవాడు ఆ సన్నివేశంలో తను పాడుకునే ఓ పడవపాట. ఆ సన్నివేశానికీ, ఆ కన్నెపడుచు మనోభావానికి అద్దం పట్టే పాటగా ఉండాలి.

ఒకరిద్దరి చేత దర్శకుడు రాయించి రమేష్ నాయుడు గారికి ఇచ్చారు. కానీ నాయుడు గారికి ప్రేరణ కలగలేదు. కంపోజింగు ఆగిపోయింది. “ఏం చేద్దాం?” అన్నారు దర్శకులు. వెంటనే నాయుడుగారు విజయా గార్డెన్సుకు వచ్చి – “నాకో పాట కావాలి. సన్నివేశం నేను చెబుతాను. రాసి పెట్టండి” అన్నారు. ఆ తరువాత నేను చెబుతుంటే ఆయనే రాసుకున్నారు.

ఏరెల్లి పోతున్నా నీరుండిపోయింది
నీటిమీద రాత రాసి నావెల్లిపోయింది
కోటిపల్లి రేవుకాడ సిలకమ్మ గొడవ
కోరంగి దాటింది గోరింక పడవ

ఇదీ పల్లవి! ఈ పల్లవి నేను చెప్పగానే ఆయన – “చరణాలు రాసి పంపండి. మనిషిని పంపుతాను. నా మటుకు నాకు పాట వచ్చేసింది” అని హుటాహుటిని వెళ్ళిపోయారు. ఆ పాట రికార్డింగుకి కూడా నేను వెళ్ళలేదు. అది వినిపించడానికి నాయుడు గారూ, ప్రకాశరావు గారు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. చాలా ఆనందంతో ప్రకాశరావు గారు నన్ను ఆలింగనం చేసుకున్నారు. ఆ పాట వింటే రమేష్ స్వరకల్పనా శిల్పం రేఖామాత్రంగా శ్రోతలకు దర్శనమిస్తుంది.

— “నాయుడు గారూ, నవమి నాటి వెన్నెల మీరు – దశమి నాటి జాబిలి నేను” వ్యాసం, పే: 104-105.

…ఆయన భౌతికంగా దూరమయ్యాక నేను ఆయనకు రాసిన పడవ పాటలోని ఈ చరణం ఆయనకు గుర్తుగా మిగిలిపోయింది –

ఏటిపాప శాపమ్మ ఎగిసి తాను సూసింది
ఏడినావోడంటే ఏటిలోన మునిగింది
శాపమునిగినా కాడ శతకోటి సున్నాలు
శాపమైన గుండెలోన సెప్పలేని సుడిగుండాలు…
ఏరెల్లి పోతున్నా నీరుండిపోయింది
నీటిమీద రాత రాసి నావెల్లిపోయింది!!

— పే: 113

నిత్యం ఏకాంత క్షణమే అడిగా – 1

ఎప్పటినుంచో నేను అనుకున్నది ఒకటి ఉంది – అద్భుతం సినిమాలోని వేటూరి రాసిన “నిత్యం ఏకాంత క్షణమే” పాట గురించి చెప్పాలని. అది ఇన్నాళ్ళకి జరిగి, నేను ఇప్పుడే నవతరంగం లో part-1 పోస్ట్ చేశాను – Part 1

పాటల విశ్లేషణలు సీరియస్‌గానే ఎందుకు ఉండాలని ప్రశ్నించుకుని సరదాగా రాసిన వ్యాసం ఇది. మీకు నచ్చుతుందని ఆశిస్తాను. తమిళ పాట గురించి ఎన్నో విషయాలు తెలిపి ఈ వ్యాసం రాయడానికి తోడ్పడిన అవినేని భాస్కర్ గారికి ఈ సందర్భంలో thanks చెప్పుకుంటున్నాను!

మీ కామెంట్లూ అవీ నవతరంగం లోనే రాయగలరు!

దేహం తిరి!

దేహం తిరి? ఏమిటీ కిరి కిరి! ఈ అర్థం పర్థం లేని పాటేంటి? ఒక వేళ అర్థముంటే అర్థం కాకుండా చెయ్యడానికే అన్నట్టు disco tune ఏమిటి? అర్థం కావడం మాట దేవుడెరుగు, కనీసం మాటలు కూడా సరిగ్గా వినబడ్డం  లేదే!

ఇవీ “యువ” చిత్రంలో “దేహం తిరి” పాట మొదటిసారి విన్నప్పుడు నాలో మెదిలిన భావాలు. ఈ భావాలు ఇప్పటికీ పెద్ద మారలేదు. అయినా ఈ పాట గురించి ఎందుకు రాస్తున్నాను అంటే, సంగీతపు రొదల మధ్య ఒక సెలయేటి గీతం ఉంది కాబట్టి. గొప్ప భావం ఉంది కాబట్టి.

ముందుగా ఈ పాట గురించి కొంత చెప్పుకోవాలి. ఇది తమిళ కవి వైరముత్తు రాసిన ఒక కవితా సంకలనంలోని కవిత. అంశం ప్రేమ. ఈ కవిత “యువ” సినిమా దర్శకుడు మణిరత్నానికి నచ్చి సినిమాలో వాడుకున్నారు. ఈ తమిళ పాట గురించీ, ఆ పాట భావం గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ చూడొచ్చు – yakkai tiri

Vairamuthu

సరే ఇప్పుడు తెలుగుకి వద్దాం. వేటూరి దాదాపు వైరముత్తు భావాలనే అనువదించారనీ, ఇందులో కొంత భావాన్ని వధించారని కూడా తెలుస్తోంది! కానీ చాలా వేటూరి పాటల్లో లాగే ఈ వధింపుని దాటి మథిస్తూ పోతే అమృతం దొరుకుతుంది!

ముందుగా పాట సాహిత్యం (చాలా సార్లు వినగా వినగా నాకు వినిపించినది!) –

దేహం తిరి వెలుగన్నది, చెలిమే

జీవం నది యద నీరధి, నెనరే

పుటకే పాపం కడుగు అమృతం, చెలిమే

హృదయం శిల శిలలో శిల్పం, చెలిమే

తాకుతాం రగులుతాం భరిస్తాం స్మరిస్తాం వదులుకోం

తాకుతాం రగులుతాం భరిస్తాం స్మరిస్తాం చెదిరిపోం

జన్మాంకురం కాంక్షే ఫలం

లోకం ద్వైతం కాంక్షే అద్వైతం

సర్వం శూన్యం శీర్షం ప్రేమ

మనిషి మాయ చెలిమి అమరం

లోకానికి కాంతిధార ఒకటే

ఒకటే ప్రతి ఉదయానికి వేకువైన వెలుగు ఒకటే

veturi-sundararama-murthy

ఈ పాట ప్రేమ గురించి అని చెప్పుకున్నాం. ప్రేమ కన్నా అపార్థం అయ్యే పదం ప్రపంచంలో ఇంకేది లేదు కనుక, అసలు ఈ ప్రేమ ఏ ప్రేమో ముందు తెలుసుకోవాలి! ఇక్కడ ప్రేమ, ప్రేయసీ ప్రియుల ప్రేమ కాదు. దైవత్త్వం నిండిన ప్రేమ. సార్వజనీనమైన ప్రేమ. ప్రపంచాన్ని కడిగే ప్రేమ. ఇప్పుడు పాటలోకి వెళ్దాం.

“దేహం తిరి” అన్నారు. తిరి అంటే? తమిళ పాటలో భావం ప్రకారం ఈ పదానికి “దీపపు వత్తి” (wick, in English) అని అర్థం చెప్పుకోవచ్చు. కానీ బ్రౌన్ డిక్షనరీ చూస్తే ఈ పదం కనిపించలేదు. సో, తమిళ పదాన్నే వాడేశారా? మా అమ్మని అడిగితే ఒక సమాధానం దొరికింది. వైజాగ్ ప్రాంతంలో ఈ పదం వాడుకలో ఉండేదట. “తిరి పెట్టు” అంటే “దీపం వెలిగించడం” అని అర్థమట. కాబట్టి ఈ మరిచిపోయిన/మరిచిపోతున్న తెలుగు పదాన్ని మళ్ళీ పరిచయం చేసినందుకు వేటూరిని అభినందించొచ్చు.

దేహం తిరి వెలుగన్నది చెలిమే

అంటే, దేహం (body) కేవలం వత్తి. వెలుగు అంతా ప్రేమ! ఇక్కడ “చెలిమి” అంటే ప్రేమ అని అర్థం తీసుకోవాలి.

జీవం నది యద నీరధి నెనరే

జీవం అంటే ఇక్కడ “జీవితం” (Life) అని అర్థం చెప్పుకోవాలి. నీరధి అంటే సముద్రం. నెనరు అంటే ప్రేమ. ఈ వాక్యానికి అర్థం – ” జీవితమనే నదికి పరమార్థమైన సాగరం ప్రేమ”. నదులుగా కనిపించే భిన్నత్వం లోంచి సాగరం అనే ఏకత్వం సిద్ధింపజేయడం ప్రేమ లక్షణం.

పుటకే పాపం కడుగు అమృతం చెలిమే

మన హైందవ సిద్ధాంతం ప్రకారం పాప ఫలం అనుభవించే వరకూ పుట్టుక తప్పదు. ఈ జనన మరణ వలయం నుంచి విముక్తి కలిగించే మోక్షం ప్రేమ. ఇదొక అర్థం. ఇలా కాకుండా – “మనకి పుట్టకనుంచీ ఉన్న కల్మషాలని కడిగే అమృతం ప్రేమ” అని simpleగా అర్థం చెప్పుకోవచ్చు.

హృదయం శిల శిలలో శిల్పం చెలిమే

మనసు ఒక శిల లాటిది, జీవం లేకుండా. ఆ శిలలో దాగిన శిల్పం ప్రేమ. అంటే ప్రేమని సిద్ధించుకుంటే శిల్పాలమౌతాం. లేదంటే శిలల్లా పడిఉంటాం. తమిళ భావంలో “శిలని శిల్పంగా మలిచే శిల్పి ” ప్రేమ అని ఉంది. కానీ వేటూరి శిల్పమే ప్రేమ అని మరింత గొప్పగా చెప్పారు!

తాకుతాం రగులుతాం భరిస్తాం స్మరిస్తాం వదులుకోం

తాకుతాం రగులుతాం భరిస్తాం స్మరిస్తాం చెదిరిపోం

ప్రేమ నిజానికి ఒక abstract concept. Concrete objects నే  స్పర్శించగలం. కాబట్టి ప్రేమని స్పర్శించడం అంటే ప్రేమని పక్కనే ఉన్న ప్రాణానిగా, స్నేహానిగా ఆత్మీయంగా స్పర్శించగలిగేంతగా నింపుకోగలగడం. ప్రేమలో రగలాలి, ప్రేమని భరించాలి కూడా. మోక్షాన్నిచ్చే ప్రేమ అంత సులువుగా రాదుగా మరి! ఏదేమైనా ప్రేమని వదులుకోకుండా, చెదిరిపోకుండా ఉంటామని ఇక్కడ భావన. తద్వారా ప్రేమ గొప్పతనాన్ని చెప్పడం.

జన్మాంకురం కాంక్షే ఫలం

ఇక్కడ “కాంక్ష” అంటే ప్రేమ. మరి, ప్రేమే ఫలం అని రాయొచ్చుగా, tune కూడా సరిపోతుంది? తమిళంలో “కాదల్” అన్న పదానికి lip sync కోసం “కాంక్షే” అని రాసినట్టు తోస్తోంది. అంకురం అంటే విత్తనం. మానవ జన్మ ఒక విత్తనమైతే, ప్రేమ సంపూర్ణమైన ఫలం (fruit). విత్తనంగానే ఉండిపోకు, ఎదిగి పరిపక్వత పొందు అని సందేశం.

లోకం ద్వైతం కాంక్షే అద్వైతం

అద్వైతం అంటే “వేరుగా చూడకపోవడం” అని simple గా అర్థం చెప్పుకోవచ్చు. జిడ్డు కృష్ణమూర్తి లాంటి తాత్త్వికులు చెప్పిన విషయం ఏమిటంటే – When Ego ends, Love begins. “నేను” అని ఒకటుంటే నేను కానిది, నానుంచి వేరైనది ఇంకోటి ఉండి తీరాలి. అసలు నేనే లేకపోతే అంతా నేనే. అప్పుడు తేడాలన్నీ మాసిపోతాయి. శంకరుల అద్వైత సిద్ధాంతం ఇదే. లోకంలోని అణువణువులోనూ, కనిపించే ప్రతి మనిషిలోనూ నిన్నే చూసుకున్న నాడు, నీలో ఒక సరికొత్త ప్రపంచం ఆవిష్కరింపబడుతుంది.

సర్వం శూన్యం శీర్షం ప్రేమ

మనిషి మాయ చెలిమి అమరం

ఈ రెండు వాక్యాలకీ దాదాపు అర్థం ఒకటే. శీర్షం అంటే సమున్నతం అని అర్థం చెప్పుకోవచ్చు ఇక్కడ. అంతా శూన్యం (సున్నా), ప్రేమ మాత్రం సమున్నతం (అనంతం). జగమే మాయ అంటే అసలు అర్థం ఇదే. తెలుసుకుంటే ప్రేమ తప్ప ఇంకేది లేదని తెలుస్తుంది అని వేదాంతుల వాక్కు. మనిషీ, మరణం మాయైతే మరణం లేనిది ప్రేమ ఒక్కటే.

లోకానికి కాంతిధార ఒకటే

ఒకటే ప్రతి ఉదయానికి వేకువైన వెలుగు ఒకటే

ఇప్పటి దాకా వేటూరి తమిళ భావాలనే అనువదించినా, ఈ రెండు వాక్యాల్లో మాత్రం తన గొంతు వినిపించారు. తమిళ పాటలో – “ఉన్నది ప్రేమ ఒకటే. తనువులు మారీ మారీ ఈ ప్రేమలోనే పుడుతూ పోతూ ఉంటాయ్” అన్న భావం ఉంది. మరి వేటూరికి ఈ భావం నచ్చలేదో, Tune సరిపోలేదో ఇంకో గొప్ప భావం రాశారు. లోకానికి కాంతిధార కేవలం ప్రేమ ఒకటే అన్నారు. ధారగా కురుస్తున్న ప్రేమని ఊహించుకోండి. వెలుగు వెలుగు వెలుగు. అనంతమైన వెలుగు కురుస్తోంది. కానీ మనం కళ్ళు మూసుకున్నాం. చీకట్లో ఉన్నాం. మన ఉదయానికి వేకువనిచ్చే (ఉదయం అంటే ఇక్కడ జన్మ (birth) అని అర్థం చెప్పుకోవాలి) ఆ వెలుగుని చూడలేకున్నాం. కళ్ళు తెరవండి, మేల్కోండి, వెలుగుని కనరండి!!

ఇంత గొప్ప పాటని రాసిన వైరముత్తుకి ముందు ధన్యవాదాలు చెప్పుకోవాలి. కొంత కష్టపెట్టినా, గొప్పగా అనువదించిన వేటూరికి “భరిస్తాం స్మరిస్తాం” అంటూ ఆయన ఈ పాటలోనే రాసిన వాక్యాన్ని అర్పించుకుంటూ నమస్సులు తెల్పుకుంటున్నాను!

ఓరుగల్లుకే పిల్లా!

కొంత కాలం తర్వాత ఒక సినిమా పాట గురించి వ్యాఖ్యానం రాస్తున్నాను. ఈ సారి ఎంచుకున్న పాట ప్రత్యేకమైనది. ఇది గొప్ప సాహితీ రచన కాదు సరి కదా చాలా మందికి ఇది అసలు ఏ విశేషమూ లేని ఒక mass song అనిపిస్తుంది. కాని తరచి చూస్తే ఈ పాటలో చాలా విశేషాలు ఉన్నాయ్. ఈ పాట సైనికుడు చిత్రం లోని – “ఓరుగల్లుకే పిల్లా”

చాలా మంది అనుకున్నట్టు ఇదొక మాస్ గీతం కాదు, సందర్భోచిత గీతం – ప్రతినాయకుడిని ప్రేమించే హీరోయిన్ ని హీరో kidnap చేస్తాడు. వారిద్దరి మధ్య సంభాషణగా సాగే పాట ఇది. అయితే folk tune కాబట్టి కొంత mass పోకడలు ఉన్నాయి. దీనిని కూడా గీత రచయిత సమర్థవంతంగా బేలన్స్ చెయ్యాలి.

Note: “లంకేశా లవ్ చేశా” అన్న వాక్యానికి అర్థం వివరించడం ద్వారా ఈ పాట మొత్తాన్ని అర్థం చేసుకునేందుకు దోహదపడిన మిత్రుడు సందీప్ కి many thanks!

ఓరుగల్లుకె పిల్లా పిల్లా వెన్నుపూస ఘల్లుఘల్లుమన్నాదే

ఓరచూపులే రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే

జవనాల ఓ మథుబాలా

ఇవి జగడాలా ముద్దు పగడాలా

ఆ అమ్మాయిని చూసి ఓరుగల్లు ఊరుకే ఉత్సాహం వచ్చి నాట్యం చెయ్యాలనిపించింది అట. “వెన్నుపూస ఘల్లుఘల్లుమంది” అనడం అతి చక్కని పదచిత్రం. ఓరుగల్లుకి ప్రాసగా “ఓర చూపులు” అనడమూ బాగుంది. “ఏకవీర” ఎవరో నాకు తెలియలేదు. బహుశా వరంగల్లు చరిత్రకి సంబంధించిన నాయికో దేవతో అయ్యి ఉండాలి. విశ్వనాథ వారి “ఏక వీర” ఇదో కాదో తెలియదు. మీకు తెలిస్తే comments లో చెప్పగలరు. ఇక పల్లవిలో వినిపించే “జగడాలు” ఒక స్పర్థని సూచిస్తోంది. ఈ స్పర్థనే పాటలో సరదాగా రచయిత చిత్రించారు. జగడాలకి, పగడాలు ప్రాస పాతదే అయినా, “ముద్దు పగడాలు” అనడం నవ్యం. అంటే నీ బుంగమూతి జగడం కూడా ముద్దుగా ఉంది అనడం.

లా లా లా పండు వెన్నెలా

ఇకనైనా కలనైనా జతకు చేరగలనా

తొలి వలపు పిలుపులే వెన్నలా

ఆ అమ్మాయి ప్రేమలో ఉంది. అందుకే వెన్నెల వలపు పిలుపులా వెన్నగా తోచింది. కాని తన ప్రియునికి దూరంగా ఉంది ఇప్పుడు. ఎప్పటికైనా జత చేరగలనా అనడంలో “నువ్వు ప్రియుని నుంచి నన్ను దూరం చేశావ్” అని హీరోని నిందించడం కొంత కనిపిస్తోంది.

 అందాల దొండపండుకు మిసమిసల కొసలు కాకికెందుకు

అది వీడా సరి జోడా తెలుసుకొనవె తులసీ

ఆ అమ్మాయి అభిమానించే ప్రియుడు మంచి వాడూ కాదు, అందగాడూ కాదు. ఆ కాకి ముక్కుకి దొండపండు లాంటి నువ్వు ఎందుకు అంటున్నాడు. మొదటి వాక్యం చూడండి – దొండపండు కాకికి ఎందుకు అని చెప్పాలి. కాని tune length ఎక్కువుంది కాబట్టి కొంత పొడిగించాలి. ఇలాటి చోటే కవి ప్రతిభ తెలుస్తుంది. “అందాల దొండపండు”, “మిసమిసల కొసలు” (ఇక్కడ మిసమిస – కొస అంటూ మళ్ళీ ప్రాస) అనడం ఈ మామూలు వాక్యనికి ఎంతో అందం చేకూర్చింది. “తులసీ” అని ఆ అమ్మాయిని సంబోధించడం కూడా చాలా బాగుంది. అంటే ఆ ప్రతినాయకుడు గంజాయి మొక్కైనా ఈ అమ్మాయి తులసి లాటిది. హీరోయిన్ పై హీరోకి గల అభిమానం కొంత ఇక్కడ కనిపిస్తుంది.

చెలి మనసుని గెలిచిన వరుడికి మరుడికి పోటీ ఎవరు

ఈ వాక్యం మణిపూస. ట్యూన్ లో వింటే ఎంతో అందంగా ఉంటుంది. తను ప్రేమించిన ప్రియుడు ఎలాటి వాడైనా తనకి వాడే గొప్ప. ఇంక ఎవరూ పోటీ రాలేరు. ప్రేమ కలిగించే మత్తు అలాటిది. అందరూ ఎరిగిన ఈ సత్యాన్ని ఎంతో చక్కగా చెప్పారు.

కా..కా..కా కస్సుబుస్సులా

 తెగ కలలు కనకు గోరు వెచ్చగా

 తలనిండా మునిగాకా తమకు వలదు వణుకు

ఇక్కడ “కస్సుబుస్సులా” అనేది ఆ అమ్మాయికి సంబోధన. ఇదో వేటూరి చమత్కారం. “నువ్వు ప్రేమ మత్తులో నిండా మునిగిపోయావ్. అందుకే నీకు వణుకు తెలియట్లేదు” అని ఆ అమ్మయిని కాస్త మందలించడం అన్న మాట. ఎంత ముద్దుగా వేటూరి దీనిని వ్యక్తపరిచాడో చూడండి.

దా దా దా దమ్ములున్నవా

మగసిరిగ ఎదురు పడగలవా

లంకేశా లవ్ చేశా రాముడంటి జతగాణ్ణి

అయితే ఆ అమ్మాయి ఒప్పుకోదు కదా! తన ప్రియుడే రాముడు. హీరో రావణుడు తనకి (రావణుడు సీతని ఎత్తుకొచ్చాడు గా మరి). నీకు దమ్ముంటే ఇలా నన్ను ఎత్తుకు రావు, ఇప్పుడు ఏవో మాటలు చెప్తున్నావ్ గానీ అంటోంది. “లంకేశా లవ్ చేశా” లాటి పద గారడీలు వేటూరికి అలవాటే కదా.

ఎద ముసిరిన మసకల మకమక లాడిన మాయే తెలుసా

ఇది వేటూరి మాత్రమే రాయగలిగిన వాక్యం. అంటే మిగతా రచయితలు రాయగల సత్తా లేని వారని కాదు. “మకమక లాడడం” లాటి మరుగున పడిపోయిన ప్రయోగాలని ఎవరూ ఇలాటి పాటల్లో వాడాలనుకోరు, వేటూరి తప్ప. ఇక్కడ మనసుని “ముసిరిన మసకల మకమకలాడిన మాయ” అని నిర్వచించారు వేటూరి. “మకమక లాడడం” అంటే అస్పష్టంగా ఉండడం – గుడ్డి వెలుతురులా ఉండడం అన్న మాట. ఇక్కడ మకమకలాడుతున్నది ఒక మాయ. ఈ మాయ వల్ల కన్ను స్పష్టంగా విషయాలని చూడలేకపోతోంది. ఎందుకు మకకలాడుతోంది అంటే “ముసిరిన మసకల” వల్ల – మనలో కమ్ముకున్న మన అహంకారం, అజ్ఞానం వల్ల అన్న మాట. తాత్త్వికులు ఎప్పుడో చెప్పిన నిర్వచనమే ఇది. దీనిని ఇంత చమత్కారంగా ఇలాటి పాటలో చెప్పిన వేటూరిని “సాహో” అని పొగడక తప్పదు!

మొత్తానికి ఈ పాట చక్కని రచనే. కొంత mass touch తో రాస్తూనే చక్కగా, చమత్కారంగా రాయడం ఎలాగో ఈ పాట చూసి నేర్చుకోవచ్చు. వేటూరి ఇలాటి పాటలు గతంలో ఎన్నో రాసినా ఈ మధ్య కాలంలో రాయడం ఇదే అనిపిస్తుంది. ఇలాటి పాటలు ఇంకా ఆయన రాయాలని కోరుకుందాం.