రెహ్మానుకి వేటూరి అందం!

ఈ జనవరి 6 న యాభై ఏళ్ళు పూర్తిచేసుకున్న ఏ. ఆర్. రెహ్మాన్ ఎందరో సంగీతాభిమానుల గుండెల్లో స్థిరనివాసం ఏర్పరుచుకుని తనదైన చరిత్ర సృష్టించుకున్నారు. తెలుగు పాటని పునర్నిర్వచించిన పాటల రచయితగా తెలుగుని ప్రేమించే వారి గుండెల్లో శాశ్వత స్థానాన్ని పొందిన వేటూరి జయంతి కూడా జనవరిలోనే (జనవరి 29). ఈ సందర్భంగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కొన్ని చక్కని పాటలని గుర్తుచేసుకుందాం.

వేటూరికి సంగీత దర్శకుడు రెహ్మాన్ తో సన్నిహితమైన అనుబంధం ఉందని చాలా మందికి తెలియదు. రెహ్మాన్ దిలీప్‌గా రాజ్-కోటి వంటి సంగీతదర్శకుల వద్ద సహాయకుడిగా ఉన్న రోజులనుంచే వారి పరిచయం మొదలైంది. ఒకసారి వేటూరి రెహ్మాన్‌కి ఎవరి గురించో చెప్తూ, “ఆయన పక్కా జంటిల్మేన్!” అన్నారుట. రెహ్మాన్‌కి ఈ ఎక్ష్ప్రెషన్ చాలా నచ్చి, “గురూజీ, ఇది ఏదైనా పాటలో వాడండి!” అని అడగడం “సూపర్ పోలిస్” సినిమాలో వేటూరి “పక్కా జంటిల్మేన్ ని, చుట్టపక్కాలే లేనోణ్ణి, పట్టు పక్కే వేసి చక్కా వస్తావా?” అని పల్లవించి ఆ కోరిక తీర్చడం జరిగింది. ఇలా వారిద్దరి స్వర-పద మైత్రి గొప్పది! కొత్తపుంతలు తొక్కుతున్న రెహ్మాన్ సంగీతానికి తానూ గమ్మత్తైన తెలుగు పదాలను పొదిగానని వేటూరి “కొమ్మ కొమ్మకో సన్నాయి” లో చెప్పుకున్నారు! అలా పుట్టినవే “విదియా తదియా వైనాలు”, “జంటతోకల సుందరి” వంటి ప్రయోగాలు!

రెహ్మాన్ పాటలని తెలుగులో వినడం కష్టం అనీ, లిరిక్స్ చెత్తగా ఉంటాయనీ, కాబట్టి తెలుగు గీతరచయితలకి (వేటూరితో సహా!) ఓ దణ్ణం పెట్టి, హిందీనో తమిళాన్నో నమ్ముకోవడం మంచిదనే అభిప్రాయం ఒకటి ఉంది! ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఇది ముఖ్యంగా రెహ్మాన్ డబ్బింగ్ సినిమాలతో వచ్చే చిక్కు. “సూపర్ పోలీస్”, “గ్యాంగ్ మాస్టర్”, “నాని” వంటి రెహ్మాన్ తెలుగు సినిమాల్లో ఈ సమస్య అంత కనిపించదు. అయితే రెహ్మాన్ – వేటూరి కాంబినేషన్‌లో చాలా చక్కని డబ్బింగ్ పాటలూ ఉన్నాయి. కాస్త శ్రద్ధపెట్టి వింటే సాహిత్యాన్ని బాగా ఆస్వాదించొచ్చు. వేటూరిని స్మరించుకుంటూ, రెహ్మాన్ కి అభినందనలు తెలుపుకుంటూ మచ్చుకి ఓ మూడు పాటలు చూద్దాం!

మేఘాలు గాయపడితే మెరుపల్లే నవ్వుకుంటాయ్!

వేటూరి డబ్బింగ్ పాటలని కూడా గాఢత, కవిత్వం కలిగిన తనదైన శైలిలో రాశారు. బొంబాయి సినిమాలో “పూలకుంది కొమ్మ, పాపకుంది అమ్మ” అనే పల్లవితో వచ్చే పాటలో చాలా స్పందింపజేసే భావాలు ఉన్నాయి. పెద్దలనీ, సమాజాన్నీ ఎదిరించి పెళ్ళి చేసుకున్న యువజంట, తమ జీవితాన్ని ప్రేమతో, ఆశావహ దృక్పథంతో ఎలా దిద్దుకున్నారో వివరించే పాట ఇది. పాట మొదట్లోనే వచ్చే ముద్దొచ్చే వాక్యం –

నింగీ నేలా డీడిక్కి, నీకూ నాకూ ఈడెక్కి!

ఇది నేలనీ ఆకాశాన్నీ కలిపే ప్రణయతరంగమై ఎగసిన ఆ పడుచుజంట హృదయస్పందనని ఆవిష్కరించే వాక్యం. “డీడిక్కి” అనే పదం వాడడం, దానికి “ఈడెక్కి”తో ప్రాస చెయ్యడం అన్నది వేటూరిజం! సినిమా సందర్భంలో తన శ్రీమతి గర్భవతి అయ్యిందన్న ఆనందంలో ఆ భర్త ఉంటాడు కనుక పసిపిల్లలకి వాడే “డీడిక్కి” అనే పదాన్ని వేటూరి వాడారు!

గుండెలో ఆనందం, తలపులో ఉత్సాహం నిండినప్పుడు జీవితం ఎలా ఉన్నా గొప్పగానే అనిపిస్తుంది. ఆ జంట అచ్చంగా ఇలాగే ఉన్నారు. పువ్వులు నవ్వు లేకుండా దిగులుగా ఉండవు, ఎగిరే గువ్వలు కన్నీళ్ళు పెట్టుకోవు అని చెబుతూ “సూర్యుడికి రాత్రి తెలీదు” అంటూ వచ్చే భావం గొప్పగా ఉంటుంది –

పున్నాగ పూలకేల దిగులు?
మిన్నేటి పక్షికేది కంటి జల్లు?
రవి ఎన్నడూ రాత్రి చూడలేదు
స్వర్గానికి హద్దూ పొద్దూ లేనే లేదు

జీవితమనే ప్రయాణం సుఖవంతంగా ఉండాలంటే లగేజీ తగ్గించుకోవాలి. “ఓటమి బరువు” మోసుకుంటూ వెళ్ళినవాళ్ళకి బ్రతుకంతా తరగని మోతే! మేఘాలు సైతం ఢీకొని గాయపడ్డాక మెరుపులా గలగలా నవ్వేసుకుని చకచకా సాగిపోవట్లేదూ? ఎంత బావుంటుందో ఈ ఎక్స్ప్రెషన్!

కవ్వించాలి కళ్ళు, కన్నెమబ్బు నీళ్ళు
మేఘాలు గాయపడితే మెరుపల్లెయ్ నవ్వుకుంటాయ్
ఓటమిని తీసెయ్ జీవితాన్ని మోసెయ్
వేదాలు జాతిమత భేదాలు లేవన్నాయ్

ఈ పాటలో వచ్చే ఇంకా కొన్ని లైనులు చాలా బావుంటాయి. “ఎగరెయ్యి రెక్కలు కట్టి ఎదనింక తారల్లోకి” అనడంలో కవిత్వం, ఆశావహ దృక్పథం కనిపిస్తాయి. “అనురాగం నీలో ఉంటే ఆకాశం నీకు మొక్కు!” అనడం ఎంత గొప్ప భావం! ప్రేమమూర్తులకు ప్రకృతి సమస్తం ప్రణతులర్పించదూ?

 

విరబూసెను విరజాజే ఏ మంత్రం వేశావో!

ఇద్దరు సినిమా అనగానే “శశివదనే” పాట చప్పున గుర్తుకు వస్తుంది. కానీ అదే సినిమాలో ఉన్న “పూనగవే పూలది” పాట కూడా ఆణిముత్యమే. ఎంతో సున్నితంగా, అందంగా, స్త్రీలకి మాత్రమే సాధ్యమయ్యేలా ఒక అమ్మాయి తన మౌన ప్రణయారాధనని నివేదించుకునే పాట! పల్లవిలో వినిపించే పదాలు ఎంతో లలితంగా, ట్యూన్‌కీ భావానికి తగ్గట్టు ఉంటాయి –

పూనగవే పూలది
లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ, నీ కౌగిలి పూజకి!

“మౌనంగా కౌగిలి పూజకి నవ్వడం” – ఎంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్! సుమబాల నవ్వునీ, సెలయేటి పాటనీ, (బైటపడలేని) చినదాని మౌన ప్రేమనీ గమనించే పురుషుడు ధన్యుడు!

ఇంతకీ ఆ అమ్మాయికి తను ప్రేమలో పడ్డానని ఎలా తెలిసింది? అతను చెంత ఉన్నప్పుడు విరబూసిన విరజాజై తన కన్నెతనం గుబాళించినప్పుడు, చేమంతుల పూరేకులు ప్రేమలేఖలై అతన్నే గుర్తుచేసినప్పుడు! ఎంత కవిత్వం! ఇంత ప్రేమ తనలో ఉన్నా గ్రహించని ప్రియునికి అభ్యర్ధనగా “ఒక్క సారి నన్ను చూడు, నువ్వే ఉసురై (ప్రాణమై) నా అణువణువూ నిండి ఉన్నావని తెలియక పోదు” అని జాలిగా అడగడం కదిలిస్తుంది –

విరబూసెను విరజాజే ఏ మంత్రం వేశావో
చేమంతుల నీడలలో తెలుసుకుంటి నీ వలపే
ఒకనాడైనా శోధించవా అణువణువు ఉసురవుతాలే!

“నాలోని తీయని అనుభూతులన్నీ నీ వల్లనే!” అనడం నుంచి, “నువ్వు లేక నేను లేను” అంటూ తనలోని ప్రేమ తీవ్రతని కూడా ఎంతో అందంగా వ్యక్తీకరించడం రెండో చరణంలో కనిపిస్తుంది. తమిళ భావాన్ని ఎంత అందంగా వేటూరి తెలుగు చేశారో ఇక్కడ. “తొలిదిశకు తిలకమెలా” అనడంలో శబ్దంపై వేటూరి పట్టు తెలుస్తుంది. ఈ వాక్యమనే కాదు, మొత్తం పాటలోనే ఎంతో శబ్దసౌందర్యం కనిపిస్తుంది!

నీలవర్ణం సెలవంటే ఆకసమే గాలి కదా?
సూర్యుడినే వేకువ విడితే తొలిదిశకు తిలకమెలా
నన్నికపై విడిచావా నా ఉసురిక నిలవదులే

ఈ పాటని యూట్యూబులో చూడొచ్చు (50:30 నుంచి) – 

వానొస్తే నీవే దిక్కు!

దాశరథి రంగాచార్య గారు ఓ వ్యాసంలో ఒక అందమైన ఉర్దూ షాయరీ గురించి చెప్పారు. ఇద్దరు ప్రేయసీ ప్రియులు రాత్రి రహస్యంగా కలుస్తారు. బైట వర్షం పడుతోంది. ప్రియుడు వర్షంలోకి వెళ్ళి తడిసి ఆనందిద్దామంటాడు. మగవాళ్ళింతే! ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆడవాళ్ళకి స్పృహ ఉంటుంది కాస్త! సరసానికి గోప్యం ఉండద్దూ? అందుకే ప్రియురాలు అంటుంది – “వర్షం వర్షం అంటావ్. ఏముంది అక్కడ? నా కళ్ళలోకి చూడు – నీలి మేఘం ఉంది, మెరుపు ఉంది, తడి ఉంది. హాయిగా నా కళ్ళల్లో కొలువుండు! ఎంతమందికి ఈ అదృష్టం వస్తుంది?”

వేటూరికి (లేదా తమిళ రచయితకి) ఈ కవిత తెలుసో లేదో కానీ, రిథం సినిమాలోని “గాలే నా వాకిటకొచ్చె” పాట మొదటి చరణంలో పంక్తులు విన్నప్పుడల్లా ఆ ఉర్దూ కవితే గుర్తొస్తుంది నాకు!

అతడు: ఆషాఢ మాసం వచ్చి వానొస్తే నీవే దిక్కు
నీ ఓణీ గొడుగే పడతావా?
ఆమె: అమ్మో నాకొకటే మైకం అనువైన చెలిమే స్వర్గం
కన్నుల్లో క్షణమే నిలిపేవా?

ఈ పాటలో “గాలిని” ప్రేమగా వర్ణిస్తాడు కవి. గాలి మెల్లగా వచ్చి తలుపు తట్టిందిట. “ఎవరోయ్ నువ్వు?” అంటే “నేను ప్రేమని!” అందిట. “ఆహా! మరి నిన్నామొన్నా ఎక్కడున్నావ్? ఇన్నాళ్ళూ ఏమయ్యావ్?” అని అడిగితే – “నీ శ్వాసై ఉన్నది ఎవరనుకున్నావ్, నేనే!” అందిట. ఇదో చమత్కారం!

గాలే నా వాకిటకొచ్చె, మెల్లంగా తలుపే తెరిచె
ఐతే మరి పేరేదన్నా, లవ్వే అవునా?
నీవూ నిన్నెక్కడ ఉన్నావ్, గాలీ అది చెప్పాలంటే
శ్వాసై నువు నాలో ఉన్నావ్ అమ్మీ అవునా?

తెమ్మెరలా హాయిగా సాగే ఈ ప్రేమపాటలో రెండో చరణంలో చక్కని శృంగారం కనిపిస్తుంది. ప్రియురాలు ముత్యంలా పదిలంగా దాచుకున్న సొగసుని పరికిస్తూ తన్మయుడై ఉబ్బితబ్బిబైపోతున్న ప్రియుని మనస్థితికి “ఎద నిండా మథనం జరిగినదే!” అంటూ ఎంత చక్కని అక్షరరూపం ఇస్తారో వేటూరి!

ఆమె: చిరకాలం చిప్పల్లోన వన్నెలు చిలికే ముత్యం వలెనే
నా వయసే తొణికిసలాడినదే!
అతడు: తెరచాటు నీ పరువాల తెరతీసే శోధనలో
ఎదనిండా మథనం జరిగినదే!

ఈ చరణం చివరలోనే వేటూరి చిలిపితనాన్ని చూపెట్టే ఓ రెండు వాక్యాలు ఉంటాయి. ఆ వాక్యాలని ఎవరికి వారు అర్థం చేసుకుని ఆనందించాల్సిందే, వివరిస్తే బాగుండదు!

అతడు: కిర్రుమంచమడిగె కుర్ర ఊయలంటే సరియా సఖియా?
ఆమె: చిన్నపిల్లలై మనం కుర్ర ఆటలాడితే వయసా వరసా!

ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి!

“సీతారామయ్యగారి మనవరాలు” చిత్రంలో “కలికి చిలకల కొలికి” పాట చాలా ప్రాచుర్యం పొందింది. అందులో మొదటి చరణంలో లైన్లపై పెద్ద చర్చే జరిగింది ఈ మధ్య:

ఆ చేయి ఈ చేయి అద్దగోడలకి
ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి!

గాయని చిత్ర “అద్దగోడలికి” అని పాడినట్టు వినిపించడం వల్ల (“అడ్డగోడలికి” అని కొందరికి వినిపించింది) కొంత అస్పష్టత ఏర్పడింది. అది “అత్తకోడలికి” అని ఉండాలని, చిత్ర తప్పు పాడారని కొందరు అన్నారు. అయితే అది “అద్దగోడే” అనిపిస్తోంది. సరే అలాగే అనుకుందాం! అయితే అద్దగోడ అంటే ఏమిటి? ఆ అద్దగోడకి పెద్దకోడలికి సంబంధం ఏమిటి?

కొత్తావకాయ గారి G+ పోస్టుపై జరిగిన చర్చలో కొన్ని వివరాలు దొరికాయి. మిత్రురాలు మానస చెప్పిన తెలుగు సామెతా, తెలుగు వికీపీడియాలో ఆ సామెత గురించిన వివరాలు అన్నీ సంగ్రహిస్తే తెలిసినది ఇది:

పూర్వకాలంలో వంటశాలలో తూర్పువైపు గోడకు చేర్చి పొయ్యిలు ఉండేవి. ఆ పొయ్యిలకు కుడి ప్రక్కగా భోజనాలశాలకు చేరి మూడు అడుగుల గోడ. ఈ గోడని “అర్థగోడ/అద్దగోడ/అడ్డగోడ” అంటారు. వంట చేసేటప్పుడు చేతుల మురికి రాయటం వల్ల సహజంగా ఇంటిలోని అన్ని గోడల కన్నా అడ్డగోడలకు మురికి బాగా ఉంటుంది. అలాగే ఇంటిలో ఏ తప్పు జరిగినా పెద్ద కోడలికే మాట వస్తుంది. అందుకే ఒక సామెత పుట్టింది – “ఆ మరకా ఈ మరకా అడ్డగోడకి, ఆ మాటా ఈ మాటా పెద్దకోడలకి” అని.

అదీ సంగతి! వేటూరి ట్యూన్ కోసం “మరక” బదులు “చేయి” వాడారన్నమాట! ఇప్పుడు ఈ పాట మొదటి చరణం పరికిద్దాం:

ఆ చేయి ఈ చేయి అద్దగోడలకి
ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి!
నేటి అత్తమ్మా నాటి కోడలివి
తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి!
తలలోని నాలికై తల్లిగా చూసే
పూలల్లో దారమై పూజలే చేసే
నీ కంటి పాపలా కాపురం చేసే
మా చంటి పాపను మన్నించి పంపు!

సినిమాలో నిజానికి ఆ కోడలు చేసిన తప్పు ఏమీ లేదు. పెద్దరికాల మధ్య, అహంకారాల మధ్య నలిగిపోయి అత్తవారింటినే ఉండిపోయి పుట్టింటిని నోచుకోని పరిస్థితి. అయినా ఆమె మేనకోడలు తన మేనత్త అత్తతో చేసే రాయబారంలో “మా మేనత్తని మన్నించి పంపు” అంటుంది! పని సాధించుకోడానికి, పక్కవాళ్ళ అహాన్ని సంతృప్తి పరచడానికి ఇదో సాధనం! తన మేనత్త మంచితనాన్ని పొగిడే ముందు, “కోడలికి అద్దగోడకి మరకలా మాటలు తప్పవు! నువ్వూ ఒకప్పుడు కోడలివే, మరిచిపోకు” అనడం ఎందుకంటే ఆ అత్తగారు “నేనూ ఒకప్పుడు కోడలినే, నేనూ పాట్లు పడ్డాను” అనుకున్నప్పుడు తీవ్రమైన కోపద్వేషాలు ఉండవు. అలా ఆ అత్తగారు “అవును కదా!” అని కొంత కరుగుతూ ఉండగానే, తన మేనత్తని పొగిడి, “ఆ! అంత గొప్పదేమిటి నా కోడలు!” అని అత్తగారి అహం పైకొచ్చే లోపే “మన్నించి పంపు” అని మెత్త చేసుకోవడం! అదీ లౌక్యం అంటే! మనుషుల మనస్తత్త్వాలని ఎరిగి వేటూరి అత్యంత సమర్థవంతంగా రాసిన పాట ఇది!

సిరివెన్నెల చెప్పినట్టు – “వేటూరి గారి గీతరచనా వ్యాసంగం గురించి సమగ్రంగా తెలుసుకోవటం, సినిమా పాట గురించి మాత్రమే గాక, తెలుగుభాష, వాజ్ఞ్మయం, సంస్కృతి, ఇత్యాది అత్యావశ్యక అంశాల గురించి అధ్యయనం చేసినట్టవుతుంది.” ఎవరూ పట్టించుకోని తెలుగు పలుకుబళ్ళు, సామెతలు మొదలైనవి లాక్కొచ్చి మరీ సినిమాల్లో ప్రయోగించిన వాడు వేటూరి. ఆయనకు వందనాలు!

సుందరమో సుమధురమో!

“అమావాస్య చంద్రుడు” చిత్రానికి ఇళయరాజా అద్భుతంగా స్వరపరిచిన “సుందరమో సుమధురమో” అనే సుమధుర గీతానికి సుందరమైన పద భావాలను పొదిగిన కవి వేటూరి “సుందర” రామ్మూర్తి. ఈ చిత్ర కథ ఉదాత్తమైనది. స్వతంత్రంగా జీవించే ఒక అంధ వయలనిస్ట్ (కమల్ హాసన్), అతని మనసులోని వెలుగును దర్శించి అతన్ని అభిమానించిన చిత్రకారిణి అయిన ఓ అమ్మాయి (మాధవి), వీరిద్దరి అపురూప ప్రణయం ఈ చిత్రం. ఆ అమ్మాయి అతనికి తన ప్రేమని వెల్లడించిన తరువాత, ఆ ఇద్దరూ ప్రేమికులై గడుపుతున్న ఘడియలని దృశ్యంలో చూపిస్తున్నప్పుడు వచ్చే నేపథ్య గీతం ఈ పాట.

ఈ పాటకి సాకీలో “బ్లైండ్ స్కూల్” పిల్లలు పాడే గీతం వస్తుంది. దర్శకుడు సింగీతం – “అంధబాలలు తమ స్కూల్లో రోజూ పాడే పాట, వారు తమ వైకల్యానికి కుంగిపోకుండా తమ జీవితంలో పలికించుకున్న సంగీతమే ఈ గీతం” అని చెప్పి ఇళయరాజా ఇచ్చిన ట్యూన్ వినిపించారుట. వేటూరి ట్యూన్ విని వాళ్ళున్న గది కిటీకీ దగ్గరకి వెళ్ళి బయటకి చూస్తూ పాట గురించి ఆలోచించారుట. ఓ ఐదు నిమిషాలు తరువాత “రాసుకోండి” అన్నారుట! “అప్పుడే చెప్పేస్తారా!” అని అక్కడ ఉన్నవాళ్ళు ఆశ్చర్యపోతూ వేటూరి చెప్పగా రాసుకున్న సాకీ ఇది –

సాకీ:

సరిగమపదని సప్తస్వరాలు మీకు!
అవి ఏడు రంగుల ఇంధ్రధనుస్సులు మాకు!!
మనసే ఒక మార్గము
మమతే ఒక దీపము
ఆ వెలుగే మాకు దైవము

“మీకు (కళ్ళున్న వాళ్ళకి) సంగీతమంటే మధురంగా వినిపించే సప్తస్వరాల విన్యాసం మాత్రమే! మాకు సంగీతం అంటే మా అంధకారంలో మెరిసే ఏడు రంగుల ఇంద్రధనుస్సు! మా వెలుగురేఖ! మా జీవితం! ఆ సంగీతం తోడుగా, మా మనసే మార్గంగా, ప్రేమే దీపంగా, ఆ దీపపు కాంతులలోనే దైవాన్ని దర్శిస్తూ సాగే జీవనం మాది!” అయిదే నిమిషాల్లో ఇంత అద్భుతమైన భావాన్ని ట్యూన్‌లో పలికించిన జీనియస్ వేటూరి! మొదటి రెండు లైన్లలోని భావానికి స్తంభీభూతుణ్ణి అయ్యానని చెప్పుకున్నారు సింగీతం!

సాకీ తర్వాత వచ్చే పాటలో ఆ ఇద్దరి ప్రేమికుల ప్రణయాన్ని అందమైన పదాల్లో వర్ణించారు వేటూరి. ఈ పాట పల్లవికీ ఒక కథ ఉంది (ఆ కథని వేటూరి మాటల్లో ఇక్కడ చదవొచ్చు). ఇళయరాజాతో ఇదే వేటూరికి మొదటి పరిచయం. ఇళయరాజా వేటూరిని ఏదో విసుక్కోవడంతో పాటల సిట్టింగ్ అపశ్రుతితో మొదలైంది! వేటూరి లేచి వెళ్ళిపోబోయారుట. వేటూరికి సింగీతం మొదలైన వాళ్ళు సర్ది చెప్పారుట. ఇళయరాజా కూడా “సారీ” చెప్పి ట్యూన్ వినిపించాట్ట. ఆ ట్యూన్ మాధుర్యానికి వేటూరి ఉప్పొంగి, ముందు జరిగిన గొడవని ఇట్టే మరిచిపోయారు! ఇంతలో వేటూరికి ఇళయరాజా “తమిళ రచయిత (వైరముత్తు) ఇలా ట్యూన్ ఇస్తే అలా పాట రాయడం అయిపోయింది. తెలుగు పాటకి ఎంత టైం పడుతుందో ఏమో!” అనడం గుర్తొచ్చింది! వేటూరి ఏం తక్కువ! వెంటనే “రాసుకోండి” అని ఆశువుగా పల్లవి చెప్పారు వేటూరి. “అప్పుడేనా!” అని ఇళయరాజా ఆశ్చర్యపోతూ, ట్యూన్‌లో సాహిత్యాన్ని పాడి చూసి, ట్యూన్‌కి పదాలు అద్భుతంగా కుదరడంతో ఉప్పొంగి “ఆహా! అద్భుతం! ఎంత అందమైన తెలుగో!” అని మెచ్చుకున్నారుట (ఈ పాటని అర్థం పట్టించుకోకుండా శబ్ద సౌందర్యాన్నీ, ట్యూన్‌నీ ఆస్వాదిస్తూ విని చూడండి. వేటూరి స్వర-పద మైత్రిని ఎంత గొప్పగా సాధించారో అర్థమౌతుంది. ఇళయరాజా పొంగిపోవడంలో ఆశ్చర్యం లేదు!). విసుక్కున్న వాళ్ళ చేతే వీరతాళ్ళు వేయించుకోవడం వేటూరి ఘనత!

పల్లవి:

సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో
మలయజ మారుత శీకరమో, మనసిజ రాగ వశీకరమో

ఈ ప్రణయం అందమైనది (సుందరం), తీయనైనది (సుమధురం), చల్లనిది (శీతలం).  ఇక్కడ వేటూరి “చందురుడందిన చందన శీతలం” అన్నారు.  ఇది “చందురుడలదిన చందన శీతలం” (చందమామ పూసిన చందనం యొక్క చల్లదనం) కావొచ్చని కొందరి భావన. నా దృష్టిలో వేటూరి భావం – “చంద్రుణ్ణి పొందగా కలిగిన చందనపు చల్లదనం” అని. అంత చల్లనిదీ, చల్లని మనసులదీ ఈ ప్రేమ అనడం. ఈ ప్రణయం అపురూపమైనది కనుక దాన్ని చందమామని పొందడంతో పోల్చడం. నాయకుడు గుడ్డివాడు కనుక చందమామని చూడలేడు. అందుకే చందమామే ప్రేయసి రూపంలో చల్లగా దిగివచ్చింది అని కూడా సినిమా కథ పరంగా అనుకోవచ్చు.

ఇంకా ఈ ప్రేమ ఎలా ఉందంటే చందన వృక్షాల (మలయజ) నుంచి వీస్తున్న గాలి (మారుత) తుంపరలా (శీకరము) హాయిగా ఉందట. మన్మధుడు (మనసిజ) వేసిన అనురాగ బంధం (రాగ వశీకరం) ఇది! ప్రణయానుబంధాలతో శృంగార భావాలతో అల్లుకునే ఆ గాఢానుభూతి వశీకరణం కాక మరేమిటి?

చరణం 1:

ఆనందాలే భోగాలైతే, హంసానందీ రాగాలైతే
నవవసంత గానాలేవో సాగేనులే
సురవీణా నాదాలెన్నో మోగేనులే

ఆనందాలు భోగాలు అవ్వడం ఏమిటి? ఆ ప్రేమికులు ఆనందం అనే భోగంలో ఉన్నారనడం! The pleasure of happiness! చక్కని ప్రయోగమిది. రెండు కాంట్రాస్టింగ్ పదాలని తీసుకుని ఒక సరికొత్త భావాన్ని, అందమైన ఎక్స్ప్రెషన్‌ని వేటూరి సాధించారు.

ఆనందమే భోగమై, హంసానందీ రాగమైంది అని ఎందుకు అనాలి? ఈ పాట హంసానందీ రాగంలో ఉందా? కాదు, వసంత రాగంలో ఉందని ఈ వ్యాసం ద్వారా తెలుస్తోంది (సాగర సంగమం చిత్రంలోని “వేదం అణువణువున నాదం” పాట హంసానందీ రాగం, వేటూరి ఆ పాట సాహిత్యంలో ఆ రాగాన్ని ప్రస్తావించారు కూడా). మరి ఎందుకు వాడినట్టు? హంసానందీ రాగ లక్షణాన్ని ఈ ప్రేమికుల అనుభూతికి అన్వయిస్తున్నట్టు తోస్తోంది. అయితే హంసానందీ రాగ లక్షణం ఏమిటి? నెట్ లో వెతికి చదివితే (ఈ వ్యాసం చూడండి)  ఈ రాగం గురించి కొంత సమాచారం దొరికింది –

Hamsanandi is a raga that instantly sets off a meditative and intense mood. This raga gives rise to the emotion of yearning and fervent appeal!

హంసానందీ హృదయపు లోతులను చూపెట్టే రాగం. అందుకే శోకం బాగా పలుకుతుంది, అయితే ఈ రాగం శోకానికే పరిమితం కాదు.  ఈ ప్రేమికుల ఆనందం కేవలం ప్రణయపు తొలిరోజుల్లో ఉండే మోహావేశం కాదనీ, వారి ప్రేమ నిజమైనదనీ, లోతైనదనీ చెప్పడానికీ, వారి ప్రణయభావ తీవ్రతని సూచించడానికీ వేటూరి వారి ఆనందానికి హంసానందీ రాగపరిమళాలు అద్దినట్టు అనుకోవాలి. సంగీతం తెలిసిన వాళ్ళు ఇంకా వివరిస్తే బావుంటుంది.

ఇలా హంసానందీ ఆనంద ఆలాపనల్లో ఆ ప్రేమికుల మానసాలు ఉప్పొంగుతుంటే రోజులన్నీ నవవసంత రాగాలతో, సురవీణా నాదాలతో నిండినట్టు అనిపించడంలో ఆశ్చర్యం ఏముంది?

వేకువలో వెన్నెలలో చుక్కలు చూడని కోనలలో
మావుల కొమ్మల ఊగిన కోయిల వేణువులూదిన గీతికలో!

లోకం మునుపు లేని కొత్త అందాలు సంతరించుకోవడం, కాలం ఎన్నడూ వినని రహస్యాలని చెవుల్లో గుసగుసలాడం వంటి అందమైన అనుభూతులన్నీ ప్రేమలో పడ్డవాళ్ళందరికీ అనుభవమే కదా! ఆ తీయని అనుభూతినే వేటూరి ఇక్కడ వర్ణిస్తున్నారు. “వేకువలో వెన్నెలలో” అనడంలో వేకువనీ వెన్నెలనీ విడివిడిగా ప్రస్తావించడంతో పాటూ, వేకువ నుంచి వెన్నెల వరకూ (రోజంతా) అన్న సూచనా ఉంది. “చుక్కలు చూడని కోనలు” అంటే “ఏ చుక్కలూ చూడలేని ఆ ప్రేమికుల హృదయపు కోనలు” అనీ కావొచ్చు, “లోకానికి అందకుండా వలపు కౌగిళ్ళ పొదరిళ్ళలో దాగిన ప్రేమికులూ” కావొచ్చు. ambiguity (బహుళార్థకత్వం) అనే కవితా ప్రక్రియని అత్యంత విరివిగా, సమర్థవంతంగా వాడుకున్న కవి వేటూరి (ఇది అస్పష్టత కాదు! కవి ఇస్మాయిల్ గారు ambiguity గురించి గొప్పగా వివరించారు. ఈ వ్యాసం చూడండి). అందుకే వేటూరి పాటలు ఎవరి అనుభవాలని బట్టి వారికి వారి వారి సొంతమైన అర్థంలో వినిపిస్తాయి! అదో సొగసు!

ఇలా వేకువలోనూ, వెన్నెలలోనూ, చుక్కలు చూడని కోనలలోనూ “వేణు గీతికలు” వినిపిస్తున్నాయట (“గీతకలో” అంటే “ఎన్ని గీతికలో కదా” అన్న అర్థంలో వాడారు. గీతిక-లో అని అసంపూర్తిగా వదిలెయ్యడం కాదు). పైగా ఆ గీతికలు కోయిల ఊదిన వేణువు నుంచి వచ్చినవట! ఆ ప్రేమికుల మనసే కదా ఈ కోయిల!  పైగా ఆ కోయిల మావిడి కొమ్మలలో హాయిగా ఊగుతూ ఉన్నదట. ఎంత అందమైన పదచిత్రం! అత్యంత మధురమైన ప్రేమ భావాన్ని ఇంతకన్నా లలితంగా చెప్పడం సాధ్యం కాదేమో!

చరణం 2:

అందాలన్నీ అందే వేళ, బంధాలన్నీ పొందే వేళ
కన్నుల్లో గంగా యమునా పొంగేనులే
కౌగిట్లో సంగమమేదో సాగేనులే

ఇక్కడ “అందం” అంటే బాహ్యమైన అందం మాత్రమే కాదు. మనసుల్లో పురివిప్పే స్వచ్చమైన ప్రేమకి ఉండే అందం అది. “అందాలు అన్నీ” అనడంలో అలాంటి ప్రేమ కలిగినప్పుడు మనసంతా, తనువంతా, లోకమంతా పరుచుకున్న అందాలు అని. అలాగే “బంధాలు అన్నీ” అంటే కౌగిళ్ళలో ఒదిగే బంధమూ, గాఢమైన హృదయానుబంధమే కాక ఆ బంధంలో ఉండే అన్ని అనుభూతులూ – నవ్వులూ, కన్నీళ్ళూ, కోపాలూ, తాపాలూ అన్నీ!

ఇలా బంధాలన్నీ అందంగా పెనవేసుకున్న వేళల్లో, ఒకరిని చూసి ఒకరు కరిగే ప్రణయంలో, వారి కళ్ళల్లో తిరిగే కంటినీటి తడి ఏదైతే ఉందో అది గంగా యమునలు అంత పవిత్రమైనదే అవుతుంది. వారి కౌగిలి హృదయ సంగమమై, ఆ కౌగిలిలో ప్రణయసాగర సంగమమే సాగుతుంది! శృంగార రసాన్ని పలికిస్తూనే ఎంతో ఉదాత్తంగా చేసిన వర్ణన ఇది!

కోరికలే శారికలై ఆడిన పాడిన సందడిలో
మల్లెల తావుల పిల్లన గ్రోవులు పల్లవి పాడిన పందిరులో!

శృంగార భావాలు (కోరికలు) గోరువంక పిట్టలై (శారికలు) చేసిన పులకింతల సందడిలో మల్లెపూల పందిళ్ళు వెలిశాయట (పాటలో “పందిరిలో” అని వినిపిస్తోంది. కానీ నాకు తోచిన “ఎన్ని పందిళ్ళో కదా” అన్న అన్వయం ప్రకారం అది “పందిరులో” అయ్యుండాలి)! ఆ మల్లెపూల పరిమళంలో (మల్లెల తావుల) మృదువైన మురళీ (పిల్లనగ్రోవి) గీతికలు వినిపిస్తున్నాయి. మెల్లగా ఆ ప్రేమికులని పిలుస్తున్నాయి. ఆ రాగం వారికే వినబడేది! ఈ ప్రణయం అందరికీ అందనిది!

ఇళయరాజా తన స్వర ప్రస్థానాలతో, అద్భుతమైన ఆలాపనలతో ఈ పాటని పలికిస్తే,  ఆ సంగీతపు తోటలో ఎంతో అందమైన పదభావ కుసుమాలని తన కవిత్వంతో పూయించారు వేటూరి. అందుకే ఈ పాట వినడం చాలా అందమైన అనుభూతిని కలిగిస్తుంది. పాటను పదే పదే వినాలనిపిస్తుంది. ఇళయరాజా-వేటూరి కాంబినేషన్‌కి కోటి దండాలు!

దైవపదం – దివ్యపదం

“బొంబాయి” చిత్రంలోని “అరబిక్ కడలందం” పాటలో లైను ఇది:

అందం దాని మతం అంతే లేని విధం, అయ్యో దివ్యపదమో!

తమిళ పాటలో “దైవపదం” అని ఉంటుంది. మరి వేటూరి దానిని “దివ్యపదం” అని ఎందుకు మార్చాడు? అది సంస్కృతపదమే, లిప్-సింక్ కోసం అలాగే వదిలెయ్యొచ్చు కదా! “ఎందుకంటే వేటూరి భక్తుడు కనుక!” అన్నాడు సోదరుడు సందీప్. “దివ్య, దైవ రెండూ పదాలకీ మూలం ఒకటే అయినా, “దివ్యము” అంటే స్వర్గానికి సంబంధించినదని వ్యవహారార్థం. ప్రియురాలితో సరససల్లాపాలు ఎంత తియ్యగా ఉన్నా ఆ అనుభవం “దేవుని సన్నిధి” (దైవపదం) లా ఉందని భక్తుడు ఎవడూ అనడు! అది “స్వర్గంలా” ఉందని (దివ్యపదం) అనొచ్చు కావాలంటే. అందుకే దివ్యపదం అన్నాడు వేటూరి, దైవపదం అనకుండా!”

దటీజ్ వేటూరి!

వేటూరి కలం – విరజాజి పరిమళం!

శృంగారగీతాల రచనలో వేటూరిది ప్రత్యేకమైన శైలి. రసరమ్య గీతాల నుంచీ, నాటు పాటల వరకూ ఏ రకమైన శృంగారగీతాలు రాసినా ప్రతి పాటలోనూ ఎంతో కొంత కవిత్వం, సౌందర్యదృష్టీ చొప్పించే శైలి అది. ఈ శృంగార గీతాల్లో పదుగురితో పంచుకునేవి కొన్ని, సన్నిహితులతోనే పంచుకోవాల్సినవి కొన్ని, ఎవరికి వారే ఆస్వాదించాల్సినవి కొన్ని! అయితే పదుగురితో పంచుకోదగ్గ కొన్ని అతి చక్కని వేటూరి పాటలు కూడా పెద్దగా ప్రాచుర్యం పొందక మరుగున పడిపోయాయి. “విద్యాసాగర్” స్వరకల్పనలో “ఒట్టేసి చెప్తున్నా” చిత్రానికి వేటూరి రాసిన అలాంటి ఓ శృంగార మాధురీ గీతాన్ని పరికించి పులకిద్దాం రండి!

ఓ ప్రేమలో పడ్డ యువజంట! సాయంసంధ్య వేళ! ప్రకృతి మనోహరంగా ఉంది. ఇద్దరి గుండెల్లో ప్రేమా, ఆరాధనా, ఆరాటం. ఎంత చెప్పుకున్నా మిగిలిపోయే మాటలు, ఎంత సేపు చూసుకున్నా తనివి తీరని చూపులు, ఎంత దగ్గరైనా పూర్తిగా దగ్గరి కాలేనితనం! ఇలాటి సందర్భాల్లోనే పాట పనికివచ్చేది. ముందుగా అబ్బాయి చిలిపిగా అందుకున్నాడు –  

పల్లవి:

అబ్బాయి: వెన్నెల్లో వేసంకాలం, ఎండల్లో శీతాకాలం, నీ ఒళ్ళో సాయంకాలం, హాయిలే హలా!

వేసవికాలంలో వెన్నెలా, శీతాకాలంలో లేత ఎండా ఎంతో హాయిగా ఉంటాయి. అయితే ఇక్కడ వేటూరి చెప్తున్నది కొంచెం వేరు. “వేసవికాలంలో వెన్నెల హాయి” అనలేదు, “వెన్నెల్లో వేసవికాలం హాయి” అంటున్నాడు! అంటే వెన్నెల వల్లే వేసవికి అందం వచ్చి, హాయి కలిగింది అన్నమాట! అలాగే లేత ఎండవల్లే శీతాకాలం శోభిల్లుతోంది. అచ్చం అలాగే ఆ అమ్మాయి సన్నిధిలో ఉంటూ, తన ఒళ్ళో తలవాల్చి ఉన్నప్పుడు, “అబ్బా! సాయంకాలం ఎంత బావుందో సుమా!” అనిపిస్తోందట అబ్బాయికి! ఇలా పొగిడితే ఏ అమ్మాయికి నచ్చదు చెప్పండి?

అమ్మాయి: కన్నుల్లో తొలి కార్తీకం, కౌగిట్లో కసి తాంబూలం, సరసంలో సంధ్యారాగం సాగునే ఇలా!

ఇక అమ్మాయి కూడా పాటలో జతకలిసింది అబ్బాయికంటే చిలిపిగా! కన్నుల్లో కార్తీక మాసపు వెన్నెల్లాంటి వెలుగట!  అది ప్రియుణ్ణి చూసినందుకు వచ్చిందో, లేక తియ్యని ఊహల కాంతో మరి! ఇద్దరూ కౌగిలిగా పెనవేసుకున్నప్పుడు వెచ్చని ప్రేమ తాంబూలాలు అందాయట! ఇలా సరస సాయంసంధ్యా సరాగాలు రోజూ సాగుతూ ఉండడం ఎంత బావుందో అంటోంది! ఏమి జాణతనం!

అబ్బాయి: ఏకంగా ఏలే రాజ్యం, ఎదలోనే వ్రాసే పద్యం, ఆశల్లో పోసే ఆజ్యం, కాదులే కలా!
లాలి లాలి లాహిరి – ఇదేమి లాహిరి!
అమ్మాయి: లాలి ఎంత పాడినా ఇదేమి అల్లరి!

“ఆహా, ఈ రోజు అమ్మాయి మంచి జోరుమీద ఉంది కదా!” అనుకుని ఆ అబ్బాయి కూడా ఊపందుకుని కొంచెం చిలిపితనాన్ని పెంచాడు. పెళ్ళి అయ్యాక జరిగే సంగతుల ఊహల్లో మునిగాడు. వారిద్దరూ ఏకమై ఏకాంతంగా ఏలే రాజ్యాన్నీ, ఆ ఏకాంత అనుభూతులన్నీ ఎదలో శాశ్వత కవితలై నిలిచే వైనాన్నీ, అలుపంటూ లేక ఆజ్యంపోసి మరీ పెంచే కోరికలనీ, ఇలా దొరకబోయే కానుకలన్నీ తలచుకుంటూ అవన్నీ కల కాదు సుమా అంటున్నాడు! అబ్బాయిలతో వచ్చే చిక్కు ఇదే! అమ్మాయి కొంచెం సరదా చూపిస్తే శ్రుతి మించిపోతారు! ఇలా “ఈ తీయని ఊహల లాహిరి ఎంత బావుందో!” అని అబ్బాయి మురిసిపోతూ ఉంటే, “చనువిచ్చాను కదా అని మరీ అల్లరి ఎక్కువ చెయ్యకు” అని అమ్మాయి ఓ హెచ్చరిక జారీ చేసింది!

అబ్బాయి: పండనీ పదే పదే పెదాల తిమ్మిరి!
అమ్మాయి: పండనీ పదే పదే పెదాల తిమ్మిరి!

“సరే, కనీసం ముద్దులనైనా పండించనీ!” అన్నాడు అబ్బాయి (ఇక్కడ ముద్దుని “పెదాల తిమ్మిరి” అనడం వేటూరి చిలిపితనం!). అదీ పదే పదే! దీనికి అమ్మాయి అభ్యంతర పెట్టినట్టు లేదు. ఎంతైనా ముద్దు అందరికీ ఆమోదయోగ్యమే కదా!

చరణం 1:

అబ్బాయి:  నీ తోడులేనిదే నాకు తోచదు
అమ్మాయి: నీ నీడ కానిదే ఊపిరాడదు

నీ తోడు లేకుంటే నాకసలు తోచదని ఒకరు అంటే, నీ నీడ కాకుంటే ఊపిరే ఆడదని ఇంకొకరు! ఈ భావం కొత్తదేమీ కాదు గానీ ట్యూనులో వింటే ఎంతో ప్రేమగా మార్దవంగా పలికేలా పదాలు పొదిగిన వేటూరికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం! సరే, ఇలాంటి విడదీయలేని గాఢమైన ప్రేమ మొదలైంది అంటే ఇక పెళ్ళికి సమయం దగ్గర పడిందనే!

అబ్బాయి:కోకిలమ్మ పాడింది కొమ్మకొక్క సన్నాయి
అమ్మాయి: కొంగుముళ్ళు కోరింది కోకచాటు అమ్మాయి

అబ్బాయికి కొమ్మకొమ్మనా కోయిల పాటలు, ఆ పాటల్లో పెళ్ళి సన్నాయి వినిపిస్తున్నాయి. తొందర అలాంటిది మరి!  కానీ అమ్మాయికి కొంచెం భద్రతాభావం కావాలి. “అప్పుడే పెళ్ళైపోయినట్టు అల్లరి మొదలెట్టెయ్యకు! ఇంకా కొంగుముళ్ళు పడాలి” అంటోంది. “కోకచాటు అమ్మాయి” అనడంలో అమ్మాయి కోరుకునే భరోసాని సూచించడంతో పాటూ శృంగారమూ పలికించాడు వేటూరి!

అబ్బాయి:  చెలి చూపు రాసె తొలి ప్రేమలేఖ!
అమ్మాయి: పొలిమేర దాటే చలికాగలేక!
అబ్బాయి:  విరజాజి పూల వాసనే వంతెనేయగా!

సరే! పెళ్ళయ్యే వరకూ విరహం తప్పదు కదా! అప్పటి వరకూ చెలిచూపుల ప్రేమలేఖలే శుభలేఖలుగా అందుకోవాలి. ఆ ప్రేమలేఖ “తనని తానుగా ఉండనివ్వని ఊహల జోరుకి తాళలేక” ఆ అమ్మాయి రాసినది! అంతటి ప్రేమా విరహం నిండిన ఘాటైన ప్రేమలేఖ అన్నమాట! (దీనినే వేటూరి “పొలిమేర దాటే చలికాగలేక” అంటూ తనదైన శైలిలో చిలిపిగా పలికించాడు). ఈ విరహాన్నీ, ఈ దూరాన్నీ తగ్గించమని ఆ అమ్మాయి జడలోని జాజిపూలని అబ్బాయి వేడుకుంటే, తమ సువాసననే ఇద్దరికీ మధ్య వంతెనగా వేసి కలిపాయట ఆ విరజాజి పువ్వులు! ఎంత అద్భుతమైన భావం! సాహో వేటూరి, సాహో!

చరణం 2:

అమ్మాయి: జాజిపూల గాలితో జాబులంపినా
అబ్బాయి: జాబిలమ్మ గిల్లుడే ఆగనంటది

పొద్దుపోయి రాతిరయ్యింది, చందమామ వచ్చాడు! చిక్కులు మొదలయ్యాయి! ఈ జాబిలి మహా టక్కరోడు. విరహంతో ఉన్నవాళ్ళని చూసి వినోదిస్తూ, విరహం పెంచుతూ ఉంటాడు. కాబట్టి జాజిపూల పరిమళంతో వంతెన వేసినా, జాబులు పంపినా జాబిలమ్మ “గిల్లుడు” ముందు ఏవీ పనికిరావట్లేదు!

అమ్మాయి: ఆకలమ్మ ఏనాడో కడుపు దాటిపోయింది
అబ్బాయి: దాహమంత కళ్ళల్లో దాగి నిన్ను తాగింది

ఈ విరహవేదన కూడా ఒకరకమైన ఆకలే. అది కడుపుకు సంబంధించిన ఆకలి కాదు. ఆ ఆకలి ఎప్పుడో పోయింది. ప్రేమించిన వాళ్ళకి ఆకలీ దాహం ఉండవని తెలుగు సినిమా కవులు చెప్పలేదూ మనకి? ఈ ఆకలి తనువూ, మనసూ, అణువణువూ పరుచుకున్న ఆకలి. ప్రేమ రసాస్వాదనలోనే, ప్రియ సమాగమంలోనే తీరే ఆకలి! ఇక దాహం కూడా గొంతుదాటి కళ్ళలోకి చేరింది. ప్రియురాలి ప్రేమస్వరూపాన్ని చూస్తూ అమాంతం ఆ ప్రణయామృతాన్ని గ్రోలితే కానీ తీరేది కాదు! ఎంత గొప్ప శృంగార భావాలివి! ఎంత అందంగా, కవితాత్మకంగా చెప్పాడో వేటూరి ఇక్కడ.

అమ్మాయి: విరహాల ఏటి కెరటాలు దాటి
అబ్బాయి: మరుమల్లె పూల వరదల్లో తేలి
అమ్మాయి: ఒడి చేరుకున్న ప్రేమలా వాలిపో ఇలా!

“ఆ కళ్యాణ ఘడియలు రాకుండా పోవు, ఈ విరహాల ఏటి కెరటాలు దాటకుండా పోము. దాటాక ఇంకొక్క వరదొచ్చి పడుతుంది. అది మరుమల్లె పూల వరద, ముంచెత్తే ప్రేమ వరద. హాయిగా మునిగి తేలదాం. చివరికి చేరుకునే ఒడ్డు ప్రేమ ఒడే! ఆ ప్రేమ ఒడిలో కలకాలం ఇలా మధురగీతాలు ఆలపించుకుంటూ ఉండిపోదాం! రా ప్రియా రా, వచ్చి వాలిపో!” – ఇవి ఆ ప్రేమికులు ఒకరితో ఒకరు చేసుకున్న బాసలు! వేటూరి మనకి చేసిన ఉద్బోధలు! వినిపించుకున్న వారు రసజ్ఞులు, బ్రతుకులో పండించుకున్నవాళ్ళు ధన్యులు!

విద్యాసాగర్ ఇచ్చిన సుమధురమైన బాణీలో, ఎస్పీబీ – సాధనా సర్గంలు ఎంతో చక్కగా పాడిన ఈ వేటూరి పాటని ఇక్కడ విని ఆస్వాదించొచ్చు.

(ఈ రోజు (జనవరి 29) వేటూరి జన్మదినం సందర్భంగా ఆ మహాకవికి నివాళులర్పిస్తూ రాసిన వ్యాసం)

అపరంజి మదనుడే, అనువైన సఖుడులే!

తెలుగు సినిమాల్లో ఉన్న క్రీస్తు భక్తిగీతాల్లో ఒక ప్రత్యేకమైన గీతం “మెరుపు కలలు” చిత్రంలోని “అపరంజి మదనుడే” అన్నది. ఈ పాటకి ఎంతో మాధుర్యం, భక్తిభావం ఉట్టిపడేలా సంగీతాన్ని సమకూర్చడం రెహ్మాన్ గొప్పతనమైతే, క్రీస్తుని వినూత్నమైన  పదప్రయోగాలతో వర్ణించి స్పందింపజెయ్యడం వేటూరి గొప్పతనం. క్రిస్మస్ సందర్భంగా ఈ పాటని పరికించి పులకిద్దాం.

వేటూరి అంతకమునుపే “క్రీస్తు గానసుధ” అనే ప్రైవేటు ఆల్బంకి అలతి పదాలతో జనరంజకమైన పాటలు రాసి మెప్పించారు. తమిళంలో వైరముత్తు సాహిత్యానికి తెలుగు అనుసృజన చేసిన ఈ పాటలో కూడా సరళమైన పదభావాలనే వాడినా క్రీస్తుని వర్ణించడానికి ఎవరూ సాధారణంగా ఎంచుకోని శబ్దాలను వాడి ప్రయోగం చేశారు. ఈ ప్రయోగాలని అందరూ హర్షించకపోవచ్చు, కొందరు తప్పుపట్టొచ్చు కూడా! అయితే క్రీస్తుపట్ల తనకున్న నిష్కల్మషమైన భక్తిభావమూ, ప్రేమా తనదైన పద్ధతిలో ఆవిష్కరించుకునే ఓ భక్తురాలి ప్రార్థనే ఈ గీతం అని గ్రహించిన వారికి పాట పరమార్థం, వేటూరి హృదయం అర్థమౌతాయి. ఓ అద్భుతమైన ట్యూన్‌కి పవిత్రంగా పొదిగిన సాహిత్యానికి మనం స్పందించగలిగితే మనలోనూ ఓ భక్తిభావం అంకురిస్తుంది.

పాట పూర్తి సాహిత్యం ఇది (దురదృష్టవశాత్తూ రెహ్మాన్ చాలా తెలుగు పాటల్లానే ఈ పాటలో కూడా గాయని చాలా తప్పులు పాడింది. ఆ తప్పులని ఇక్కడ సరిజెయ్యడం జరిగింది):

అపరంజి మదనుడే, అనువైన సఖుడులే అతడేమి అందగాడే!

వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై వచ్చె వలపంటివాడే

వినువీధిలో ఉండే సూర్యదేవుడునే, ఇల మీద ఒదిగినాడే

కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు శిశుపాలుడొచ్చినాడే   

 

అపరంజి మదనుడే, అనువైన సఖుడులే అతడేమి అందగాడే!

పోరాటభూమినే పూదోటకోనగా పులకింపజేసినాడే  

 

కల్వారి మలనేలు కలికి ముత్యపురాయి, కన్నబిడ్డతడులేవే

నూరేళ్ళ చీకటి ఒకనాడే పోగొట్టి ఒడిలోన చేరినాడే

ఇరుకైన గుండెల్లో అనురాగ మొలకగా ఇలబాలుడొచ్చినాడే

ముక్కారు కాలంలో పుట్టాడు పూజకే పుష్పమై తోడు నాకై

 

అపరంజి మదనుడే, అనువైన సఖుడులే అతడేమి అందగాడే!

వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై వచ్చె వలపంటివాడే

 

అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే!

నిజానికి ఈ పాటా ఓ ప్రేమగీతమే! ఇక్కడ ప్రేమ భగవంతుని పట్ల ప్రేమ. అలనాడు బెత్లహాంలో పుట్టిన పసిబిడ్డడు, జనుల వెతలు తీర్చిన దేవుడై, శిలువనెక్కిన శాంతిదూతై, ఈనాటికీ ప్రపంచంలోని అత్యధికులకి చీకటిలోని వెలుగురేఖ అవుతున్నాడంటే అతనెంతటి మహనీయుడు! అటువంటి బాలఏసుని తలచుకుంటే నిలువెత్తు ప్రేమస్వరూపం గుర్తుకు రావాలి, తన సువార్త ద్వారా జీవితంలో అడుగడుగునా సఖుడైనట్టి దేవుడు కనిపించాలి. ఈ వాక్యాల్లో కనిపించే భావం అదే! అవును అతను “అపరంజి (బంగారు) మదనుడు (ప్రేమ స్వరూపుడు)”. అతని ప్రేమ స్వచ్ఛమైన బంగారపు తళతళ. జీవితంలోని ఎదురయ్యే సంఘర్షణల్లోనూ, సందిగ్ధాల్లోనూ అతని పట్ల విశ్వాసమే దారిచూపిస్తూ ఉంటే అతను కాక “తగిన స్నేహితుడు” (అనువైన సఖుడు, right companion) ఎవరు? ఇతని కంటే అందగాడు ఇంకెవ్వరు? ఇక్కడ అందం అంటే బాహ్యమైన అందం కాదు. అతని కరుణ నిండిన వీక్షణం అందం, అతని ప్రేమ నిండిన చిరునవ్వు అందం, అతని గుండె పలికిన ప్రతిపలుకూ అందం. అతనికంటే అందమైన వాళ్ళుంటారా?

 

వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై వచ్చె వలపంటివాడే

క్రీస్తు జననం సాధారణ ప్రదేశంలో జరిగింది (పశువుల కొట్టంలోనని కొందరంటారు), ఏ రాజమహల్లోనో కాదు. ఆయన తొలుత సామాన్యులకీ, పేదలకీ దేవుడయ్యాడు కానీ అధికారులకీ, రాజులకీ కాదు. “వరిచేల మెరుపు” అనడం ద్వారా అప్పటి కాలంలోని ప్రధాన పంటైన వరిని, వరిచేలతో నిండిన ఆ నేలని ప్రస్తావించడం కన్నా, సామాన్యుల కోసం పుట్టిన అసామాన్యుడైన దైవస్వరూపంగా క్రీస్తుని కొలవడం కనిపిస్తుంది. చెక్కుచెదరని ధగధగ కాంతుల ప్రేమవజ్రం అతను. అతను ప్రపంచానికి వలపు సందేశం అందించడానికి అరుదెంచిన సర్వశ్రేష్టుడు (రత్నం; నవరత్నాల్లో వజ్రమూ ఒకటి. వజ్రాన్ని ముందే ప్రస్తావించాడు కాబట్టి ఇక్కడ రత్నాన్ని “అన్నిటి కన్నా శ్రేష్టమైన” అన్న అర్థంలో కవి వాడాడని అనుకోవడం సబబు)

 

వినువీధిలో ఉండే సూర్యదేవుడునే, ఇల మీద ఒదిగినాడే

కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు శిశుపాలుడొచ్చినాడే

ఇంతటి అనంత విశ్వంలో  కేవలం భూమి మీదే జీవరాశి ఎందుకు ఉండాలి (మనకి తెలిసి)? కొన్ని కోట్ల ఏళ్ళ పరిణామ క్రమంలో ఈ జీవరాశుల్లోంచి ఓ మానవుడు అద్భుతంగా ఎందుకు రూపుదిద్దుకోవాలి? ఎంతో బుద్ధి కలిగిన ఈ మానవుడే మళ్ళీ తెలివితక్కువగా తన దుఃఖాన్నీ, వినాశనాన్నీ తనే ఎందుకు కొనితెచ్చుకోవాలి? అలా దారితప్పిన మానవుడికి త్రోవచూపడానికి ఓ దేవుడులాంటి మనిషి ఎందుకు దిగిరావాలి? ఎందుకు ఎందుకు? శాస్త్రజ్ఞులు, “అదంతే! కారణాలు ఉండవు!” అనొచ్చు. కానీ ఓ భక్తుడి దృష్టిలో ఇదంతా దేవుని కరుణ. ఆకాశంలో ఉండే సూర్యుడికి నిజానికి భూమితో ఏమీ పని లేదు, భూమిని పట్టించుకోనక్కరలేదు. కానీ సూర్యుడు లేకుంటే భూమిపైన జీవరాశే లేదు. అలా సూర్యుడిలా కేవలం తన ప్రేమ వల్ల జనులని రక్షించడానికి దిగివచ్చిన అపారకరుణామూర్తి క్రీస్తు! నేలపైన వెలిగిన సూర్యుడు! జనుల బాధలనీ, శోకాలనీ, కష్టాలనీ ఇలా అన్ని కన్నీళ్ళనీ తన చల్లని ప్రేమామృత స్పర్శతో కడిగిన దేవుడు. ఈ బాలకుడే కదా లోకపాలకుడు (శిశుపాలుడు)!

 

పోరాటభూమినే పూదోటకోనగా పులకింపజేసినాడే!

చరిత్ర చూడని వినాశనం లేదు. మనుషులు రాక్షసులై జరిపిన హింసాకాండలెన్నో. ఈ యుద్ధోన్మాదం మధ్య సుస్వర సంగీతంలా, ఎడారిలో విరిసిన పూదోటలా, తన ప్రేమసందేశంతో జగానికి శాశ్వత మార్గాన్ని చూపినవాడు క్రీస్తు. హింసని ప్రేమతో ఎదుర్కొని, చిరునవ్వుతో శిలువనెక్కి, మరణం లేని మహిమాన్వితుడిగా వెలిగిన చరితార్థుడు.

 

కల్వారి మలనేలు కలికి ముత్యపురాయి, కన్నబిడ్డతడులేవే

నూరేళ్ళ చీకటి ఒకనాడే పోగొట్టి ఒడిలోన చేరినాడే

కల్వారి కొండ (Calvari Hill) అన్నది క్రీస్తుని శిలువ వేసిన ప్రదేశం. అంతటి కొండా భక్తుల గుండెల్లాగే శిలువనెక్కిన క్రీస్తుని చూసి కన్నీరైతే, ఆయన నమ్మిన వారిని రక్షించడానికి మరణాన్ని దాటి పునరుత్థానుడయ్యాడు. ఆ కొండపైన శిలువ వేయబడిన ఏసు ఆ కొండనే ఏలుతూ (మలనేలు – మలని + ఏలు, మల అంటే కొండ) స్వచ్చమైన తెల్లని ముత్యంలా మెరిశాడట! ఎంత అందమైన కల్పన!

ఈ “కలికి ముత్యపు రాయైన” క్రీస్తు భక్తులకి కన్నబిడ్డ లాంటివాడట! ఇందాకే బాలఏసు తండ్రి లాంటి పాలకుడయ్యాడు, ఇప్పుడు ఒడిలోన కన్నబిడ్డ అయ్యాడు! తండ్రీ బిడ్డా రెండూ ఆయనే. ఒడిలోని పసిపాపని చూసి ఓ తల్లికి కలిగే ఆనందం వర్ణనాతీతం. ఎంతటి బాధనైనా తక్షణం మటుమాయం చేసే గుణం పాప నవ్వుకి ఉంటుంది. “ఇంకేమీ లేదు, సమస్తమూ నా కన్నబిడ్డే” అనిపిస్తుంది. ఆ బిడ్డే దేవుడూ అయినప్పుడు కలిగే భరోసా “నూరేళ్ళ చీకటిని ఒక్క క్షణంలో పోగొట్టేదే” అవుతుంది!

ఇరుకైన గుండెల్లో అనురాగ మొలకగా ఇలబాలుడొచ్చినాడే

ముక్కారు కాలంలో పుట్టాడు పూజకే పుష్పమై తోడు నాకై

ప్రేమే తెలియని కరకు, ఇరుకు గుండెలకి ప్రేమంటే తెలియజెప్పిన శాంతిదూత క్రీస్తు. ఇలకి దిగివచ్చిన ఈ బాల దేవుణ్ణి “అనురాగ మొలక” గా వర్ణించడం ఎంతో చక్కగా ఉంది.

ఇలా ప్రేమ మూర్తిగా, స్నేహితుడిగా, పాలకుడిగా, కన్నబిడ్డగా పలు విధాల క్రీస్తుని కొలుచుకోవచ్చు. భక్తుడి బాధ తీర్చే పెన్నిధీ ఆయనే, భక్తుడు ఆనందంలో చేసే కీర్తనా ఆయనే. చీకటనుండి చేయిపట్టి నడిపించే వెలుగురేఖా ఆయనే, అంతా వెలుగున్న వేళ మెరిసే ఇంధ్రధనుసూ ఆయనే. సర్వకాల సర్వావస్థల్లోనూ పూజకి పువ్వులా దొరికాడు కనుకే “ముక్కారు కాలంలో పుట్టాడు పూజకే” అనడం. “ముక్కారు” అంటే “మూడు కాలాలు” అని అర్థం. అన్ని కాలాల్లోనూ, అన్ని కష్టాల్లోనూ తోడుండే దేవుడు ఆయనే!

ఈ పాటని యూట్యూబులో ఇక్కడ వినొచ్చు. ఇది కేవలం క్రైస్తవులకే చెందిన పాట కాదు. భక్తిలోని ఓ చిత్రం ఏమిటంటే, మొదట్లో భగవంతుడు, భక్తుడు, భక్తి అని వేరువేరుగా ఉన్నా, చివరకి కేవలం భక్తే మిగులుతుంది. ఆ స్థితిలో కృష్ణుడు, క్రీస్తు, అల్లా అని తేడాలుండవు. ఇలా ప్రేమని పెంచి, ఏకత్వాన్ని సాధించి జనులని నడిపించే భక్తి నిజమైన భక్తి అవుతుంది. అలాంటి భక్తి మాధుర్యం ఈ పాటలోనూ ఉంది.

(తొలి ప్రచురణ సారంగ పత్రికలో)

కడలి అలలకు అలుపు లేదులే

ఓ అందమైన అమ్మాయి, పేరు హేమ. ఆ అమ్మాయిని తన పాటతో మురిపించి, పెళ్ళి దాకా నడిపించాలనుకునే అబ్బాయి. “నువ్వు పదాలు చెప్పు, నేను పాట పాడతాను” అన్నాడు అమ్మాయితో. ఇంకేం ఓ చక్కని పాట పుట్టింది. అసంపూర్ణంగా మిగిలిపోయిన ఓ “ఉషాకిరణ్ మూవీస్” సంస్థకి చెందిన చిత్రానికి వేటూరి రాసిన పాట ఇది. ఎస్పీబీ స్వరకల్పనలో, ఎస్పీబీ, జానకి ఎంతో చలాకిగా పాడారు.

“కడలి కలలకు అలుపు లేదు, కనుల కలలకు అదుపు లేదు” అని మొదలెట్టడం ద్వారా అబ్బాయి వెల్లువెత్తిన తన ప్రేమనీ, ఆ ప్రేమని గెలిపించుకోవడం కోసం తాను అలుపెరుగక ప్రయత్నిస్తూనే ఉంటాననీ చెప్తున్నాడు! తర్వాత “అన్నం-చారు”  పదాలు వాడి వేటూరి చమత్కారంగా అన్నమయ్య పాట విని ఉప్పొంగిన చారుశీల అలమేలుమంగనీ, పులకిస్తున్న సప్తగిరులనీ వర్ణించాడు! మరి వేంకటేశ్వరుడి సంగతేమిటి? ఈ ఏర్పాటు అంతా ఆయనదే కదా మరి! శ్రీసతిని వేంకటేశ్వరుడు చూసుకున్నంత మురిపెంగా, వైభవంగా నిన్నూ నేను చూసుకుంటాను అన్న సూచన!

ఆకాశం-కైలాసం పదాలకి చెప్పిన వాక్యాలు చాలా కవితాత్మకంగా ఉన్నాయి. ఉదయ సంధ్యవేళ ఆ అమ్మాయి చరణాలని ముద్దాడే అరుణ కిరణాల దివ్యసౌందర్యాన్ని తిలకించాలని ఆకాశం ఇలకి దిగివస్తోందట! తామిద్దరూ ప్రేమని పండించుకుని, హృదయమనే గుడిలో సంధ్యాదీపాన్ని వెలిగించుకుంటే కైలాసం తలవంచి సాక్షాత్కరిస్తుందట! ఈ అతిశయోక్తులన్నీ విని ఆ అమ్మాయి “చాలు బాబూ ఈ ప్రేమ సుత్తి (హేమరింగ్)” అని తలపట్టుకుంటుంది. నా “ప్రేమరింగు” అందుకునే దాకా నీకీ పోరు తప్పదూ అంటాడు అబ్బాయి. “నీ హేమరింగే నాకివ్వరాదా” అని కూడా అంటాడు. ఇక్కడ మరి వేటూరి “హేమ”-రింగు అని అమ్మాయి పేరుతో చమత్కారం చేశాడో లేక “నీ గోలంతా ప్రేమగా భర్తనై భరిస్తా” అనే అర్థంలో వాడాడో!

రెండో చరణం ముచ్చటగా ఉంది. కాకి-కోకిల, దారం-దూరం వంటి పదాలను గమత్తుగా వేటూరి వాడాడు. “ప్రేమ వలనే మోక్షం సిద్ధిస్తుంది” అనే అర్థంలో వాడిన “మమకారమొకటే మనిషికున్న మోక్షతీరం” వాక్యం చాలా చక్కనైనదీ, లోతైనదీ! పాపం అబ్బాయి ఇలా తన భావుకతతో ప్రేమ బాణాలు వేస్తున్నా ఆ అమ్మాయికి బొత్తిగా కవితాసక్తి ఉన్నట్టు లేదు! “ఏమిటీ నస” అంటుంది! నస కాదు ప్రేమ పనస అంటాడు మన అబ్బాయి. పనస పండంత తియ్యనైన ప్రేమగోల ఇది మరి! “పనస” అంటే సంస్కృతంలో వేదభాగం అనే అర్థమూ ఉంది కనుక, వేదమంత్రం లాంటి నా ప్రేమ గీతాన్ని వినలేవా, విని శుభమస్తు అనలేవా (మాటతో కాకపోయినా కనీసం చూపుతో!) అనే చమత్కారమూ చేశాడు వేటూరి.

సినిమాలో అమ్మాయి ఒప్పుకుందో లేదో తెలియదు కానీ, అమాయకత్వం, ఆరాధనా నిండిన అబ్బాయి ప్రేమగీతానికి పొంగి శ్రోతలు మాత్రం వారు కలవాలని ఓటేస్తారు!

పల్లవి

అమ్మాయి: అలలు – కలలు

అబ్బాయి: కడలి అలలకు అలుపు లేదులే

అమ్మాయి: ఆహా!

అబ్బాయి: కనుల కలలకు అదుపు లేదులే

అమ్మాయి: పర్వాలేదే! అన్నం – చారు!

అబ్బాయి: అన్నమయ్య పదములు పాడగ

చారుశీల శ్రీసతి పొంగగ

సప్తగిరుల శిఖరాలూగెలే!

సప్తస్వరాలే ఊయలై!

అమ్మాయి: వెరీ గుడ్! వన్స్ మోర్!

|| కడలి అలలకు ||

 

చరణం 1

అమ్మాయి: ఆకాశం – కైలాసం

అబ్బాయి:  ఆకాశమే ఇలనంటదా

అమ్మాయి: పాపం!

అబ్బాయి: కైలాసమే తలవంచదా

అమ్మాయి: అలాగేం! ఇప్పుడు నువ్వు తలవంచుతావ్! చరణం-కిరణం!

అబ్బాయి: అయబాబోయ్!

చరణాల ఒడిలో అరుణకిరణం ఆడుతుంటే

హృదయాల గుడిలో సాంధ్యదీపం వెలుగుతుంటే

అమ్మాయి: హేమరింగ్ అంటే ఇదే!

అబ్బాయి: ఈ హేమరింగే నాకివ్వరాదా

అమ్మాయి: ఎందుకూ?

అబ్బాయి: నా ప్రేమరింగూ నీవందుకోవా

అమ్మాయి: ఆశ!

అబ్బాయి: నే వేచి ఉన్నా ప్రేమలా!

అమ్మాయి: ఉపయోగం లేదు నాయనా!

|| కడలి అలలకు ||

 

చరణం 2

అమ్మాయి: కాకీ – కోకిల

అబ్బాయి: ఈ కోకిలే నాకుండగా

ఏకాకిలా నేనుండనా!

అమ్మాయి: దారం-దూరం, కారం-తీరం!

అబ్బాయి: పూలల్లో దారం జన్మబంధం కాకు దూరం!

మమకారమంటే మనిషికున్న మోక్షతీరం!!

అమ్మాయి: ఏమిటి నస! ఇందుకా తీసుకొచ్చావ్!

అబ్బాయి: నస కాదు హేమా, ఇది ప్రేమ పనస

అమ్మాయి: హయ్!

అబ్బాయి: వినవేల మనసా నా వేద పనస

అమ్మాయి: ఓయ్!

అబ్బాయి: శుభమస్తు అనవా చూపుతో!

అమ్మాయి: ఇక విరమిద్దూ, అలిసిపోయావు!

|| కడలి అలలకు ||

(తొలి ప్రచురణ వేటూరి వెబ్సైటులో. పాట ఆడియో కూడా అక్కడ ఉంది)

పాటసారి డైరీలోంచి – 3 (విశ్వనాథ్, మణిరత్నం, ముళ్ళపూడి గురించి)

వేటూరి విశ్వనాథ్ గారితో తన పాటల అనుభవాల గురించి, “ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను” పాట ఉత్పత్తి గురించి, బాపు-రమణలతో అనుబంధం గురించి, మణిరత్నంతో తన సాన్నిహిత్యం గురించి ఇలా పలువురి సినీప్రముఖులతో తన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ రాసిన వ్యాసం ఇక్కడ.

కన్నానులే, కలయికలు ఏనాడు ఆగవులే!

రెహ్మాన్ పాటల్లో నాకు ఎంతో ఇష్టమైన పాట “బొంబాయి” చిత్రంలోని “కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే అన్నది. నా దృష్టిలో ఇది వేటూరి రాసిన గొప్ప పాటల్లో ఒకటి. కానీ చిత్రంగా ఈ పాట సాహిత్యం చాలా అపార్థాలకి దారితీసింది. ఓ మూడు సంఘటనలు చెప్తాను. 

  1. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మా కాలేజీ ఫంక్షన్‌లో ఓ అమ్మాయి ఈ పాట తమిళ్‌లో పాడుతూ ఉంటే నా వెనుక కూర్చున్న ఇద్దరు కుర్రాళ్ళు ఆ అమ్మాయి గురించి కామెంట్ వేస్తూ చులకనగా అన్న మాటలు –  “తెలుగులో పాడితే పాటలోని బూతులు తెలిసిపోతాయని తమిళ్‌లో పాడుతోందిరా!”. సినిమాలో కొత్తగా పెళ్ళైన స్నేహితురాలిని సరసంగా ఆటపట్టిస్తూ అమ్మాయిలు పాడే లైన్లు ఈ పాటకి కోరస్‌గా వస్తాయి. “మామకొడుకు రాతిరికొస్తే వదలకు రేచుక్కో!” వంటి వాక్యాల వల్ల కాబోలు ఇది “బూతు పాట” గా తీర్మానించారు నా వెనుకసీటు అబ్బాయిలు! ఇది పూర్తిగా తప్పు! నిజానికి పాటలోని అంశానికీ ఈ కోరస్‌కి సంబంధం లేదు. అందుకే ప్రస్తుత వ్యాసంలో కోరస్ ని చర్చించకుండా వదిలేస్తున్నాను.
  2. కోరస్ శృంగారపరంగా ఉంది కాబట్టి పాట కూడా శృంగార గీతమే అని చాలామంది పొరబడతారు. నేను చెన్నై I.I.T.లో చదివే రోజుల్లో ఏటా జరిగే సంగీత ఉత్సవం “సారంగ్” లో ఒక అమ్మాయి ఈ పాటని తమిళ్‌లో చాలా ఫీల్ అయ్యి హావభావాలతో శృంగార తాదాత్మ్యంతో పాడింది. సాహిత్యంలో కొన్ని వాక్యాలు శృంగారంతో ఉండడం వల్ల కాబోలు ఆ అమ్మాయి ఈ పాటని శృంగార గీతం అనుకుంది. కానీ నా దృష్టిలో ఇది శృంగార గీతం కాదు. ఒక ముస్లిం అమ్మాయి, ఒక హిందూ అబ్బాయిపై పడ్డప్పుడు తనలో తాను ఎదుర్కొనే సంఘర్షణ ఈ పాట. సామాజిక కట్టుబాట్లకి తలొగ్గాలా, ప్రేమ వైపు ఒగ్గాలా అన్న ఆలోచన సరదా విషయం కాదు, తీవ్రమైనది. ప్రేమలో పడిన ఆ అమ్మాయి తనని తాను అద్దంలో చూసుకుంటూ తనలోని భావాలన్నిటినీ (ప్రేమా, శృంగారం, విరహం, శోకం వగైరా) నిజాయితీగా పరామర్శించుకునే సీరియస్ పాట ఇది! అందుకే గాయని చిత్ర ఈ పాటలోని “జారె జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం” అని పాడేటప్పుడు నవ్వే నవ్వు రసభంగంగా అనిపిస్తుంది నాకు!
  3. చాలా రోజుల వరకూ నాకీ పాటలోని కొన్ని లైన్లు అర్థమయ్యేవి కావు. ఓ రోజు “పాడుతా తీయగా” చూస్తుంటే ఎవరో ఈ పాట పాడారు. SPB ఈ పాట సాహిత్యం గురించి వివరిస్తాడేమో అని నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాను. తీరా చూస్తే SPB, “ఏమిటో! వేటూరి ఇష్టం వచ్చినట్టు పదాలు కూర్చేశాడు. నాకో ముక్క అర్థం కాలేదు!” అని తేల్చేశాడు! వేటూరి అర్థంపర్థం లేని పాటలు రాసిన మాట నిజమే కానీ మంచి సంగీతం, సందర్భం కుదిరినప్పుడు మనకి అర్థం కాకపోయినా ఆయన అర్థవంతంగానే రాస్తాడు అని నా నమ్మకం. కొంచెం పరిశ్రమిస్తే ఈ పాట నాకు బాగానే అర్థమైంది. చాలా గొప్పగా ఉందనిపించింది. నాకు అర్థమైనది మీతో పంచుకోవాలనే ఈ వ్యాసం!

 పల్లవిలోనే కనిపించే కవిత్వం, పాటంతా తర్వాత దట్టంగా పరుచుకుంటుంది – 

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే

నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే

అందాల వయసేదొ తెలితామరై, విరబూసె వలపేదో నాలో

నీ పేరు నా పేరు తెలుసా మరీ, హృదయాల కథ మారె నీలో

వలపందుకే కలిపేనులే, ఒడిచేరె వయసెన్నడో

 

ఈ ప్రేమ “తొలిచూపు ప్రేమ”, హృదయాలను సూటిగా తాకిన ప్రేమ. అందుకే “తొలిచూపు కలయికలు” అంతటితో ఆగిపోవు అంటోంది. ఆ అబ్బాయికి తనపైగల ఆరాధన అమ్మాయికి చెప్పకనే తెలిసిపోయింది! మగవాడి కళ్ళలోని భావాలని (నీ కళ్ళలో పలికినవి…) ఆడవాళ్ళు ఇట్టే పసిగట్టగలుగుతారు – అది ప్రేమ అయినా, కాంక్ష అయినా! కాబట్టి ఇద్దరూ ఒకే స్థితిలో ఉన్నారు. తెల్లని తామరలా విరిసిన ఆమె వయసుకి సుగంధంలా దరిచేరిందీ ప్రేమ! ఎవరెవరో తెలియకపోయినా అతని హృదయం గల్లంతైంది! ఊరూ, పేరూ, వివరాలు తెలుసుకుని ప్రేమించేది ప్రేమవ్వదు! వయసు వచ్చి చేరాకా, వలపు గుండె తట్టాకా, ఝల్లుమనని జన్మ ఉంటుందా? 

ఉరికే కసివయసుకు శాంతం శాంతం తగిలితె తడబడె అందం

జారె జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం

అందం తొలికెరటం; చిత్తం తొణికిసలై నీటి మెరుపాయె

చిత్తం చిరుదీపం; రెపరెప రూపం తుళ్ళి పడసాగె

పసి చినుకే ఇగురు సుమా, మూగిరేగే దావాగ్ని పుడితే

మూగె నా గుండెలో నీలి మంట 

ఉరికే వయసుని ప్రేమ చల్లగా తాకింది. కానీ దాని వల్ల కుదురు రాకపోగా తడబాటు పెరిగింది. ఏదో కొత్త ధైర్యం కూడా వచ్చింది. అందుకే ప్రాయం కోసం, ప్రణయం కోసం పరదాని కొంచెం పక్కకి జరిపే చొరవొచ్చి చేరింది. “అందం తడబడింది” అన్న అందమైన ప్రయోగం వేటూరిలోని కవిని చూపెడుతోంది. అమ్మాయి పెరిగిన మహమ్మదీయ వాతావరణాన్ని సూచించడానికి “పరదా” అని వాడాడు. 

ప్రేమలో పడ్డాక, అందం తొలికెరటమై ఉప్పొంగింది. తీయని ఊహల్లో తుళ్ళే మనసు ఆ కెరటానికి నీటి మెరుపులా అమరింది! ఎంత అందమైన ఊహ! అయితే వాస్తవంలోకి వస్తే ఈ ప్రేమ ఫలించడం ఎంత కష్టమో తెలిసి అదే మనసు సంఘర్షణకి గురౌతోంది.  అది ఎలా ఉందంటే గాలికి రెపరెపలాడుతున్న దీపం లాగ! ఇలా మనసు ఊగిసలాటని పాజిటివ్‌గా నెగిటివ్‌గా రెండు అద్భుతమైన ఉపమానాలతో చెప్పాడు. వెంటనే ఇంకో అందమైన ఉపమానం – గుండెలో నీలిమంట మూగిందట, తానొక పసిచినుకట, ఆ నీలిమంట దావాగ్నిలా మారితే ఆ పసిచినుకు గతేం కానూ? అని ప్రశ్న. ఇక్కడ మంట శృంగారపరమైన ప్రతీక కావొచ్చు, లేదా వేదనా/సంఘర్షణా కావొచ్చు. “మూగె నా గుండెలో నీలిమంట..” అని అర్థోక్తిలో వదిలెయ్యడం మంచి ఫీల్ ఇచ్చింది. ఈ మూడు ఉపమానాలనీ మనం ఇంకొన్ని విధాలుగా కూడా అన్వయించుకోవచ్చు, అదే ఇక్కడి అందం. 

శ్రుతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలలూగింది నీలో

తొలిపొంగుల్లొ దాగిన తాపం తాపం సయ్యాటలాడింది నాలో

ఎంత మైమరపో ఇన్ని ఊహల్లో తెల్లారె రేయల్లే

ఎడబాటనుకో ఎర్రమల్లెలో తేనీరు కన్నీరే

ఇది నిజమా కల నిజమా, గిల్లుకున్న జన్మనడిగా

నీ నమాజుల్లో ఓనమాలు మరిచా 

మొదటి చరణంలో ఆ అమ్మాయి తన అనుభూతినీ, పరిస్థితినీ వివరిస్తే రెండో చరణంలో “ఎందుకు ఇలా అయ్యింది”, “ఇప్పుడేం చెయ్యాలి” అన్న ఆలోచన కనిపిస్తుంది. ప్రేమ భావం ఎందుకు ఇంత తీవ్రంగా ఉంది అంటే – వయసు ప్రభావం అని సమాధానం! వయసు మాయలాడి, జగత్కిలాడి! అది అబ్బాయిని శ్రుతి మించి ఉయ్యాలలూగిస్తే, అమ్మాయిని గిలిగింతలు పెట్టి తాపాన్ని ఎగదోస్తోంది! ఈ తీయని ఊహల మైమరపులో, పగలు కూడా రేయిలా మారుతోందట. “తెల్లారె రేయల్లే” అన్న ప్రయోగం ఎంత చక్కగా ఉందో! అదే సమయంలో ఒకవేళ వియోగమే వస్తే బ్రతుకు విఫలమే కదా అన్న స్పృహ కలుగుతోంది. దీనిని “ఎర్రమల్లెల్లో తేనీరు కన్నీరవ్వడం” అన్నాడు! ఎంత కవిత్వం అండి. ప్రస్తుత మాధుర్యం పూలలో తేనె అయితే ప్రేమ వైఫల్యం రాలే పూల కన్నీరే కదా! “ఎర్రమల్లెలు” అంటే “ఎరుపు రంగులో ఉన్న ఓ రకం మల్లెలు” అన్న అర్థం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ “ఎరుపు” ని రక్తం/వేదనకీ లేక సిగ్గు/శృంగారానికి సూచికగా వాడినట్టు అనిపిస్తోంది. వేటూరి పాటల్లో తవ్వుకున్న వారికి తగినంత నీరు!

పాటని ముగించే ఆఖరి లైన్లు నాకు చాలా ఇష్టం. తరచి చూస్తే ఇదంతా కలా నిజమా అని ఆ అమ్మాయికి అనిపిస్తోంది. లేకపోతే తానేమిటి ఇలా అయిపోవడం ఏమిటి? ఈ ప్రేమని జయించి తీరకపోతే బ్రతుకు వృథా అనిపించేంత మాయ ఎలా జరిగింది? స్పృహలో ఉన్నామా కలలో ఉన్నామా తేల్చుకోడానికి చేతిని గిల్లి చూసుకుంటాం. అయితే ఆ అమ్మాయి తన బ్రతుకుని గిల్లి అడిగిందట! “గిల్లుకున్న జన్మనడిగా” – ఎంత అద్భుతమైన ప్రయోగం! ఇంకా ఈ తీయని ఊహల మైమరపులో భాషనే మరిచిపోయిందిట! ఈ భావాన్ని కూడా ఎంత అద్భుతంగా చెప్పాడండి – “నీ నమాజుల్లో ఓనమాలు మరిచా”. “నమాజు” అనడం ద్వారా అమ్మాయి ముస్లిం అన్న విషయం గుర్తు చేస్తూ, తనది కేవలం తీయని ఊహ కాదు, ఓ ఆరాధన, ఓ ప్రార్థన అని తెలియజేస్తున్నాడు! ఓనమాలు – అంటే అక్షరాలు అనే కాదు, “ఓం నమః” ని గుర్తుచెయ్యడం ద్వారా అబ్బాయి హైందత్వాన్ని కూడా స్ఫురింపజెయ్యడం. అంటే ఈ మతాల వైషమ్యాలు మరిచి, ఈ అడ్డుగోడలు దాటి ప్రేమని సాధించుకుందాం అని చెప్పడం! ఈ రెండు వాక్యాలకీ వేటూరికి దణ్ణం పెట్టొచ్చు అనిపిస్తుంది నాకు!

ఒక్కసారి ఈ పాటలో వాడిన ఉపమానాలు, పదచిత్రాలు అన్నీ ఊహించుకుంటూ ఈ పాట సాహిత్యాన్ని మళ్ళీ చదవండి. ఎంత గొప్ప సాహిత్యమో తెలుస్తుంది. నిజానికి ఇది డబ్బింగ్ పాట. తమిళ కవి వైరముత్తుకి కొంత క్రెడిట్ దక్కాలి. అయితే పాట తమిళ సాహిత్య అనువాదం చూస్తే వేటూరి తనదైన ఊపమానాలు, ప్రయోగాలు చేస్తూ అనుసృజన చేసాడు కానీ, అనువాదం చెయ్యలేదని తెలుస్తుంది. పైగా డబ్బింగ్ పాటల్లో సైతం చక్కని భాషా, చిక్కని కవిత్వం పలికించడం వేటూరికే తెలిసిన విద్య! వేటూరి గొప్ప డబ్బింగ్ పాటల రచయిత కాకపోవచ్చు కానీ, డబ్బింగ్ పాటలకి కూడా గొప్పతనం దక్కేలా చాలా మంచి రచనలు చేసాడనడానికి ఈ పాటే ఉదాహరణ!

(తొలి ప్రచురణ వేటూరి వెబ్సైటులో)